
ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా (Russia) దాడులు కొనసాగుతున్నాయి. దీంతో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోతోంది. అయినా ఏ మాత్రం తలొగ్గకుండా రష్యా దళాలకు ఉక్రెయిన్ సేనలు ధీటుగా బదులిస్తున్నాయి. ఫలితంగా రష్యా కూడా తన సైన్యాన్ని కోల్పొతోంది. ఇప్పటికే రష్యా తన ఇద్దరు మేజర్ జనరల్ లను యుద్దంలో పొగొట్టుకుంది. ఇలా రెండు వైపులా ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతున్నా.. వార్ మాత్రం ఆపడం లేదు.
ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వల్ల అమాయక ప్రజలు చనిపోతున్నారు. దీంతో చాలా మంది పౌరులు దేశ సరిహద్దులు దాటుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఇతర దేశాలకు పరుగులు పెడుతున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ కు చెందిన మాజీ ఎంపీ (Former MP) భార్య కూడా దేశం విడిచి వెళ్లిపోవాలని భావించారు. కానీ ఆమె వెంట భారీ స్థాయిలో నగదును తెచ్చుకుంది. అంత డబ్బుతో సరిహద్దులు దాటే ప్రయత్నం చేస్తుండగా పట్టుబడింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఉక్రెయిన్ పార్లమెంట్ మాజీ సభ్యుడు కోట్విట్స్కీ (Kotvytskyy) భార్య తన సూట్ కేసుల్లో 8 మిలియన్ డాలర్లు, 1.3 మిలియన్ యూరోల నగదుతో దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నించింది. జకర్‌పట్టియా ప్రావిన్స్ మీదుగా హంగేరీలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేసింది. అయితే ఆమె హంగేరియన్ సరిహద్దులో గార్డులకు పట్టుబడింది. ఈ విషయాన్ని NEXTA మీడియా సంస్థ సోమవారం ఉదయం నివేదించింది.
ఇదిలా ఉండగా.. రష్యా ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాడులను ప్రారంభించింది. ఐక్య రాజ్య సమితి వెల్లడించిన వివరాల ప్రకారం.. యుద్ధం ఫలితంగా ఉక్రెయిన్ అంతటా 10 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వీరిలో దాదాపు 3.4 మిలియన్లు పోలాండ్, స్లోవేకియా, రొమేనియా, హంగేరీ వంటి పొరుగు దేశాలకు పారిపోయారు.
యుక్రెయిన్‌లో జరిగిన యుద్ధంలో చిన్నారులతో సహా వందలాది మంది పౌరులు చనిపోయారు. కాగా, ఇప్పటి వరకు 14,000 మందికి పైగా రష్యా సైనికులు మరణించారని ఉక్రెయిన్ ప్రకటించింది. అలాగే యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్ ముఖ్యనగరం కైవ్ లో దాదాపు 228 మంది మరణించారు. ఈ విషయాన్ని ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. ‘‘ ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించినప్పటి నుంచి రాజధానిలో నలుగురు పిల్లలతో పాటు మొత్తంగా 228 మంది సాధారణ పౌరులు మరణించారు. మరో 912 మంది గాయపడ్డారు ’’ అని కైవ్ నగర పాలక సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు, ఆర్థిక జరిమానాలు విధించాయి. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelenskyy) ఆదివారం ప్రకటించారు. దౌత్యం విఫలమైతే మూడో ప్రపంచయుద్ధం వస్తుందనే భయాందోళనలను ఆయన వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా చర్చలకు తాను సిద్ధంగానే ఉన్నానని చెప్పారు. చర్చలు చేపట్టకుండా, సంధి కాకుండా మరో మార్గంలో యుద్ధం ముగుస్తుందని తాను అనుకోవడం లేదని తెలిపారు.