పాకిస్తాన్‌కు తాలిబాన్ల వార్నింగ్.. ‘మరోసారి వైమానిక దాడులు జరిగితే తీవ్ర పరిణామాలుంటాయ్ జాగ్రత్త!’

Published : Apr 17, 2022, 09:18 PM ISTUpdated : Apr 17, 2022, 09:22 PM IST
పాకిస్తాన్‌కు తాలిబాన్ల వార్నింగ్.. ‘మరోసారి వైమానిక దాడులు జరిగితే తీవ్ర పరిణామాలుంటాయ్ జాగ్రత్త!’

సారాంశం

పాకిస్తాన్‌కు తాలిబాన్లు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శనివారం పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్‌పై వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో సుమారు 40 మంది పౌరులు మరణించారు. ఈ దాడులపై తాలిబాన్లు సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలే రిపీట్ అయితే పాకిస్తాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.  

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన్ వైమానిక దాడులపై తాలిబాన్లు సీరియస్ అయ్యారు. ఖోస్త్, కునార్ ప్రావిన్సుల్లో పాకిస్తాన్ ఇటీవలే వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు సహా 40 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పాకిస్తాన్‌కు తాలిబాన్లు ఫైర్ అయ్యారు. మరోసారి ఇలాంటి వైమానిక దాడులు జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.

తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ పాకిస్తాన్‌కు ఓ వార్నింగ్ స్టేట్‌మెంట్ జారీ చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని పాకిస్తాన్ అంబాసిడర్‌కు సమన్లు జారీ చేసిన తర్వాత ఆయన పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఖోస్త్, కునార్ ప్రావిన్సుల్లోని శరణార్థులపై పాకిస్తాన్ దాడులను ఆఫ్తనిస్తాన్ ఇస్లామిక్ ఎమిరేట్స్ తీవ్రంగా ఖండిస్తున్నదని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ల ఓపికను పరీక్షించవద్దని హెచ్చరించారు. ఇలాంటి తప్పులను మళ్లీ రిపీట్ చేయవద్దని వార్నింగ్ ఇచ్చారు. లేదంటే పాకిస్తాన్ తీవ్ర పరిణామాలు
ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. రెండు దేశాల మధ్య సమస్యలను రాజకీయ మార్గాల్లో పరిష్కరించుకోవచ్చని వివరించారు.

ఏప్రిల్ 16న (శనివారం) ఖోస్త్, కునార్ ప్రావిన్సుల్లో పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా సుమారు 40 మంది ఆఫ్ఘనిస్తానీలు మరణించారు. ఐరాసలోని ఆఫ్ఘనిస్తాన్ దూత మాట్లాడుతూ, ఇది పాకిస్తాన్ దురాక్రమణ చర్యనే అని పేర్కొన్నారు. ఐరాస చార్టర్‌లోని అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను, ఐరాస భద్రతా మండలి తీర్మానాలను పాకిస్తాన్ ఉల్లంఘించిందని ఆరోపించారు. 

పాకిస్తాన్ వైమానిక దాడులను ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ఖండించారు. మానవాళిపై నేరంగా దీన్ని పరిగణించారు. ఈ దాడి ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘననే అని అన్నారు.

తాలిబాన్లు ఇదే నెలలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓపియం సహా మాదక ద్రవ్యాల సాగుపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ సుప్రీం నేత హైబతుల్లా అఖుంద్‌జాదా పేరిట ఈ ఆదేశాలు వచ్చాయి. ఇక పై ఆఫ్ఘనిస్తాన్‌లో మాదక ద్రవ్యాల సాగు ఉండబోదని, మాదక ద్రవ్యాల సాగుపై నిషేధం విధిస్తున్నట్టు ఆ ఉత్తర్వులు వెల్లడించాయి. ఎవరైనా ఈ నిబంధన ఉల్లంఘిస్తే.. వారి పంటను నాశనం చేయడం జరుగుతుందని తెలిపాయి. అంతేకాదు, ఉల్లంఘించిన వారిని షరియా చట్టం ప్రకారం శిక్షిస్తామని పేర్కొన్నాయి. ఈ ఆదేశాలను దేశ రాజధాని కాబూల్‌లో విలేకరుల సమావేశంలో అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది.

ఓపియంతో సహా ఇతర మాదక ద్రవ్యాల ఉత్పత్తి, వినియోగం, రవాణాలనూ నిషేధిస్తున్నట్టు తాలిబాన్ ప్రభుత్వం పేర్కొంది. గతేడది ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారాన్ని అందిపుచ్చుకున్న తాలిబాన్లు ప్రపంచ గుర్తింపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా ఆ దేశ నిధులపై విధించిన ఆంక్షలను సడలిస్తే వాటిని వినియోగించుకోవాలనే ప్రణాళికల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్‌లో మాదక ద్రవ్యాల సాగును నిషేధించాలని అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఒత్తిడి పెరుగుతున్నది. 

ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద మాదక ద్రవ్యాల సాగుదారు. ఇక్కడే అత్యధికంగా డ్రగ్స్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. తాలిబాన్లు అధికారంలోకి రాకమునుపు కూడా దాని దాడులు, ఇతర ఖర్చుల కోసం ఈ డ్రగ్స్ సాగుపైనే ఎక్కువగా ఆధారపడేది.

గతంలో తాలిబాన్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ సాగుపై నిషేధం విధించింది. దాని పాలన చివరి రోజుల్లో 2000ల్లో ఈ నిషేధం విధించింది. అప్పుడు కూడా తాలిబాన్ ప్రభుత్వానికి అంతర్జాతీయ మద్దతు లభించాలనే లక్ష్యంగానే ఆ నిర్ణయం తీసుకుంది. కానీ, అంతర్గతంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో దాని వైఖరిని మళ్లీ మార్చుకోవాల్సి వచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే