
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. దక్షిణ కరోలినా రాజధాని కొలంబియాలో (Columbia) రద్దీగా ఉండే షాపింగ్ మాల్‌లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 12 మందికి గాయాలు కాగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఆయుధాలు కలిగి ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుండగులు పథకం ప్రకారమే కాల్పులు జరిపినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.
కొలంబియా సెంటర్ మాల్ ప్రాంగణంలో శనివారం మధ్యాహ్నం కాల్పులు జరిగాయని కొలంబియా పోలీస్ చీఫ్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి తుపాకీలు కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురిలో కనీసం ఒక్కరైనా కాల్పులు జరిపారని ఆయన అన్నారు. అయితే ఎంత మంది వ్యక్తులు ఆయుధంతో కాల్పులు జరిపారనేది స్పష్టంగా తెలియరాలేదని చెప్పారు. ఇది యాదృచ్చికంగా జరిగిందని తాము నమ్మడం లేదని పేర్కొన్నారు. నిందితులు ఒకరికొకరు తెలుసునని తాము నమ్ముతున్నామని.. ఏదో విషయం కాల్పులకు దారి తీసిందని భావిస్తున్నట్టుగా చెప్పారు.
ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. గాయపడిన బాధితుల్లో 15 ఏళ్ల నుంచి 73 ఏళ్ల మధ్య వయసు వారు ఉన్నారని చెప్పారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. గాయపడిన వారిలో 10 మందికి తుపాకీ గాయాలు ఉన్నాయని చెప్పారు. మరో ఇద్దరు కాల్పుల అనంతరం చోటుచేసుకున్న తొక్కిసలాటలో గాయపడ్డారని తెలిపారు. ఈ ఘటనలో గాయపడినవారిలో తొమ్మిది మంది డిశ్చార్జ్ అయ్యారని మెడికల్ ప్రొవైడర్ ప్రిస్మా హెల్త్ పేర్కొంది.
ఇక, కొద్ది రోజుల కిందట.. కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో చోటుచేసుకున్న కాల్పుల్లో.. ఆరుగురు మృతిచెందగా.. 12 మంది గాయపడ్డారు. కామన్స్ షాపింగ్ మాల్, స్టేట్ క్యాపిటల్ సమీపంలో రద్దీగా ఉండే ప్రాంతంలో బార్‌లు మూసివేయడంతో ప్రత్యర్థి ముఠాల మధ్య ఈ కాల్పులు జరిగాయి.