
న్యూఢిల్లీ: అమెరికా బలగాలు వెనుదిరగ్గానే గంభీరంగా తమకు పూర్తి స్వాతంత్ర్యం లభించిందని ప్రకటించిన తాలిబాన్లకు మొదటి ఎదురుదెబ్బ తగిలింది. దేశమంతటినీ తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నా తలవంచని పంజ్‌షిర్ ఇప్పటికీ సవాల్ విసురుతున్నది. తాలిబాన్‌పై తిరుగుబాటుదారులు ఇక్కడ ఒక్కటవుతున్నారు. తాలిబాన్లపై చివరి శ్వాస వరకు పోరాడి మరణించిన యోధుడు అహ్మద్ షా మసూద్ కుమారుడు అహ్మద్ మసూద్, ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ నేతృత్వంలోని తిరుగుబాటుదళం తాలిబాన్లపై వార్‌ను డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. పంజ్‌షిర్ తమ అధీనంలోకి వచ్చిందని ఒకవైపు తాలిబాన్లు ప్రకటించుకుంటుండగా, తాలిబాన్లు తమ ప్రాంతంలోకి వస్తారు గానీ, తిరిగివెళ్లేరని తిరుగుబాటుదారులు స్పష్టం చేస్తున్నారు.
గత రెండు మూడు రోజులుగా పంజ్‌షిర్ ప్రావిన్స్, పర్వాన్ ప్రావిన్స్‌లోని జబల్ సరాజ్ జిల్లా, ఖవాక్ పంజ్‌షిర్, బగ్లాన్ ప్రావిన్స్‌లోని అందర్బ్ జిల్లాలో తిరుగుబాటుదారులు, తాలిబాన్ల మధ్య ఘర్షణలు ముమ్మరంగా సాగుతున్నాయి. గతంలోనూ తాలిబాన్లపై పోరాడిన నార్తర్న్ అలయెన్స్ కూడా ఈ తిరుగుబాటుదారులతో చేతులు కలిపారు. నార్తర్న్ అలయెన్స్ విజయగర్వంతో తాజాగా ఓ ట్వీట్ చేసింది. ఖవాక్‌లో జరుగుతున్న యుద్ధంలో గత రాత్రి వరకు తాలిబాన్లు 350 మంది బలగాలను కోల్పోయిందని తెలిపింది. అంతేకాదు, కనీసం 40 మంది ఖైదీలుగా పట్టుబడ్డారని వివరించింది. అంతేకాదు, తమకు అనేక అమెరికా వాహనాలు, ఆయుధాలు, పేలుడు సామగ్రిని బహుమానంగా లభించాయని తెలిపింది. కమాండర్ మునీబ్ అమీరికి అభినందనలు అని ప్రకటించింది. ఇందులో అహ్మద్ మసూద్‌ను ట్యాగ్ చేస్తూ ఈ రోజు మధ్యాహ్నం ట్వీట్ చేసింది.
పంజ్‌షిర్‌లోకి గుల్బహార్ గుండా తాలిబాన్లు ఎంటర్ కావాలని ప్రయత్నిస్తున్నారని టోలో న్యూస్ రిపోర్ట్ వెల్లడించారు. కానీ, పంజ్‌షిర్‌లోని ప్రతిఘటన శక్తులు తాలిబాన్లకు దీటుగా బదులిస్తున్నారని తెలిపారు. మెయిన్ రోడ్‌ను తాలిబాన్లు ఓ కంటెయినర్ ద్వారా బ్లాక్ చేశారని వివరించారు. అయితే, ఇరువర్గాల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయని ఈ రోజు ఉదయం వెల్లడించారు.