కశ్మీర్‌కు స్వేచ్ఛ కల్పించాలి: తాలిబాన్లకు అల్ ఖైదా స్టేట్‌మెంట్

By telugu teamFirst Published Sep 1, 2021, 1:21 PM IST
Highlights

ఆఫ్ఘనిస్తాన్‌ను అమెరికా సేనలు ఉపసంహరించుకున్న తర్వాతి రోజు తాలిబాన్లకు అల్ ఖైదా అభినందనలు తెలిపందే. ఇదే ప్రకటనలో కశ్మీర్‌కు విముక్తి కల్పించాలని తెలిపింది. ఇస్లాం వ్యతిరేకుల సంకెళ్ల నుంచి కశ్మీర్ సహా సోమాలియా, ది లెవాంట్, పాలస్తీనా ఇతర ప్రాంతాలకు స్వేచ్ఛ కల్పించాలని పేర్కొంది.
 

న్యూఢిల్లీ: అల్ ఖైదాను టార్గెట్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్‌లో అడుగుపెట్టిన అమెరికా సేనలు సుమారు రెండు దశాబ్దాల తర్వాత వెనక్కి వెళ్లాయి. అమెరికా బలగాలు పూర్తిగా ఉపసంహరించుకున్న తర్వాతి రోజు తాలిబాన్లకు అల్ ఖైదా అభినందనలు తెలియజేసింది. అంతేకాదు, కశ్మీర్‌నూ తన అభినందన ప్రకటనలో ప్రస్తావించింది. కశ్మీర్‌ను ఇస్లాం వ్యతిరేకుల నుంచి విముక్తి కల్పించాలని ఉద్ఘాటించింది.

అమెరికా బలగాలు ఉపసంహరణ తర్వాత తాలిబాన్లు పూర్తి స్వాతంత్ర్యాన్ని పొందినట్టు తాలిబాన్లు ప్రకటించుకున్నారు. ఈ ప్రకటన తర్వాతే అల్ ఖైదా అభినందనలు తెలిపింది. ఈ ప్రకటనలోనే దీర్ఘకాలం ప్రవచిస్తున్న తన నినాదాన్ని మరోసారి పేర్కొంది. పాలస్తీనా, ది లెవాంట్(మధ్యాసియాలోని కొన్ని దేశాలను కలుపుకుంటూ ఉన్న ప్రాంతం), సోమాలియా, యెమెన్, కశ్మీర్‌లకు స్వేచ్ఛ కల్పించాలని తెలిపింది. ఇస్లాం వ్యతిరేకుల సంకెళ్ల నుంచి ఈ ప్రాంతాలకు విముక్తి కల్పించాలని వివరించింది. ‘ఓ అల్లాహ్! ప్రపంచవ్యాప్తంగా ఖైదీలుగానున్న ముస్లింలకు విముక్తి ప్రసాదించు’ అని పేర్కొంది.

ఆఫ్ఘనిస్తాన్‌లో మారుతున్న పరిణామాలతో ఈ రీజియన్‌లో సరికొత్త భద్రతా సవాళ్లు ఉదయిస్తున్నాయని నిపుణులు ఇప్పటికే పేర్కొంటున్నారు. భారత్‌కూ భద్రతా పరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశముందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్‌లో పరిణామాలను ఊతంగా తీసుకుని భారత్‌లో అరాచకాలు సృష్టించాలని విద్రోహ శక్తులు భావిస్తే వాటిని ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉన్నదని స్పష్టం చేశారు.

కాగా, ఇప్పటికే జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదంలో కీలకంగా ఉన్న జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ తాలిబాన్ నేతలతో కాందహార్‌లో భేటీ అయ్యారు. తాలిబాన్, జైషే మహమ్మద్ భావజాల సారూప్యమున్న సంస్థలుగా పేర్కొంటుంటారు. గతంలోనూ భారత్ నుంచి జైషే చీఫ్ మసూద్ అజర్‌ను విముక్తం చేయడంలో తాలిబాన్లు సహకరించారు. అప్పుడ ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలో ఉన్నారు. తాజాగా మళ్లీ అధికారంలోకి రావడంతోనే మసూద్ మళ్లీ వారితో భేటీ కావడం చర్చనీయాంశమైంది. ఈ భేటీలో కశ్మీర్‌లో తమ కార్యకలాపాలకు సహకరించాల్సిందిగా తాలిబాన్లను కోరినట్టు తెలుస్తున్నది.

click me!