డబ్బులతో పారిపోలేదు.. కనీసం చెప్పులు కూడా వేసుకోలేదు.. ఆప్ఘాన్ అధ్యక్షుడు

By telugu news teamFirst Published Aug 19, 2021, 8:50 AM IST
Highlights

. తాను డబ్బుతో పారిపోయాననేది అబద్ధమని.. దీన్ని యూఏఈ కస్టమ్స్ అధికారులతోనూ ధ్రువీకరించుకోవచ్చని ఘని చెప్పారు. దేశాధినేతగా తనకున్న ముప్పతో పారిపోయానని చెప్పారు. 


ఆప్ఘనిస్తాన్  పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఆ దేశాన్ని తాలిబాన్లు ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. తాలిబాన్లు.. రాజధాని కాబూల్ చేరుకునే సమయానికే.. ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘని పరారయ్యాడనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాతి రోజు.. ఆయన పారిపోతూ డబ్బుల సంచులతో వెళ్లిపోయాడంటూ వార్తలు వచ్చాయి. అయితే.. ఆ వార్తలపై తాజాగా అష్రఫ్ ఘని స్పందించారు. ఈ మేరకు ఆయన ఫేస్ బుక్ లో ఓ వీడియోని షేర్ చేశారు. 

అఫ్ఘానిస్థాన్ దేశం నుంచి పారిపోయే ముందు దేశ నిధుల నుంచి 169 మిలియన్ డాలర్లను దొంగిలించి తీసుకెళ్లానని రష్యా దేశ దౌత్యవేత్త చేసిన వ్యాఖ్యలను ఘనీ ఖండించారు. తాను యునైటెడ్ ఎమిరేట్స్ లో ఉన్నానని ఘనీ ధ్రువీకరించారు. తాను తాలిబాన్ల నుంచి తప్పించుకునేందుకు సంప్రదాయ బట్టలు, ఒక చొక్కా మాత్రమే ధరించానని.. కనీసం చెప్పులు కూడా తీసుకువెళ్లలేదని ఆయన పేర్కొన్నారు.

తాను డబ్బు తీసుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయని, ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఘని వీడియోలో వివరించారు.తాను నాలుగు కార్లు, హెలికాప్టరు నిండా నగదుతో కాబూల్ నుంచి పారిపోయానని రష్యా రాయబారి చేసిన ఆరోపణలను ఘనీ కొట్టివేశారు. తాను డబ్బుతో పారిపోయాననేది అబద్ధమని.. దీన్ని యూఏఈ కస్టమ్స్ అధికారులతోనూ ధ్రువీకరించుకోవచ్చని ఘని చెప్పారు. దేశాధినేతగా తనకున్న ముప్పతో పారిపోయానని చెప్పారు. 

దేశంలో రక్తపాతాన్ని నివారించడానికి ఏకైకమార్గంగా తాను కాబూల్ నుంచి పారిపోవాలని తీసుకున్న నిర్ణయాన్ని ఘనీ సమర్థించుకున్నారు. అఫ్ఘాన్ భద్రతా దళాలకు ఘనీ కృతజ్ఞతలు తెలిపారు. శాంతి ప్రక్రియ వైఫల్యం తాలిబాన్లు అధికారాన్ని లాక్కోవడానికి దారితీసిందని ఆయన చెప్పారు.

తాను మళ్లీ తిరిగి దేశంలోకి అడుగుపెట్టాలని చూస్తున్నట్లు చెప్పారు. ఆ మేరకు తాను శాంతియుతంగా  చర్చలు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
 

click me!