భారత ఎంబసీల్లో తాలిబాన్ల సోదాలు.. ఎత్తుకెళ్లిన వాహనాలు

By telugu teamFirst Published Aug 20, 2021, 4:20 PM IST
Highlights

తాలిబాన్ అగ్రనాయకత్వం ఇస్తున్న హామీలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఘటనలకు పోలిక ఉండటం లేదు. భారత దౌత్య సిబ్బంది రక్షణకు ‘మాదీ పూచీ’ అన్నట్టుగా మాటనిచ్చిన తర్వాత రోజే తాలిబాన్లు భారత కాన్సులేట్ కార్యాలయాల్లో దాడులు చేశారు. కాందహార్, హెరాత్ నగరాల్లోని మిషన్ కార్యాలయాల్లో దాడులు చేసింది. ఆ కార్యాలయాల ముందున్న వాహనాలను ఎత్తుకెళ్లారు. కాందహార్‌లోని కార్యాలయంలో కీలక దస్త్రాల కోసం వెతికినట్టు సమాచారం. కానీ, ఈ రెండు కార్యాలయాలను భారత సిబ్బంది ఎప్పుడో ఖాళీ చేశారన్న
సంగతి తెలిసిందే.

న్యూఢిల్లీ: తాలిబాన్ల మాటలకు, చేతలకు పొంతన ఉండటం లేదు. తాము మహిళలను హింసించబోమని, వేరే దేశాల దౌత్య సిబ్బందినీ గౌరవిస్తామని చెబుతున్న మాటలు నీటిమూటలేనని తెలుస్తున్నది. భారత రాయబారులను, దౌత్య సిబ్బంది రక్షణకు ఇటీవలే తాలిబాన్ సంస్థ హామీనిచ్చింది. కానీ, ఆ వాగ్దానాన్ని నిలుపుకోలేకపోయింది.

కాందహార్, హెరాత్‌ నగరాల్లోని భారత కాన్సులేట్‌లలో తాలిబాన్లు సోదాలు చేశారు. కాందహార్ దౌత్యకార్యాలయంలో కీలక డాక్యుమెంట్ల కోసం గాలించారు. రెండు చోట్లా కార్యాలయాల్లోని వస్తువులను చిందరవందర చేశారు. అనంతరం ఈ రెండు ఆఫీసుల ముందు పార్క్ చేసిన వాహనాలను ఎత్తుకెళ్లారు.

ఈ ఘటనను తాము ఊహించిందేనని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తాలిబాన్లు ఆ కార్యాలయాల్లోకి చొరబడి గందరగోళం చేశారని తెలిపాయి. కీలకమైన దస్త్రాల కోసం వెతికాయని పేర్కొన్నాయి. అలాగే, ఆ ఆఫీసుల ముందు పార్క్ చేసిన తమ వాహనాలను ఎత్తెకెళ్లారని విమర్శలు చేశారు.

తాలిబాన్‌ల ఖతర్ ఆఫీసు నుంచి భారత్‌కు ఓ సందేశం వచ్చినట్టు తెలిసింది. ఇండియన్ స్టాఫ్, సెక్యూరిటీ సిబ్బందికి నష్టం చేకూర్చబోమని తాలిబాన్లు హామీనిచ్చినట్టు సంబంధితవర్గాలు వెల్లడించాయి. అలాగే, యూఎస్, నాటో బలగాలకు సహకారం అందించిన ఆఫ్ఘనిస్తాన్ పౌరులనూ క్షమిస్తామని తాలిబాన్లు వెల్లడించారు. కానీ, వారిపైనా దాడులు జరపడం మొదలుపెట్టింది. దీంతో తాలిబాన్ అగ్రనాయకత్వం చేస్తున్న ప్రకటనలు డొల్లవేనని వెల్లడవుతున్నది.

తాలిబాన్లకు వస్తున్న ఇతర ఉగ్రవాద సంస్థల నుంచి వస్తున్న మద్దతుపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అరేబియన్ కనుమల్లోని అల్ ఖైదా తాలిబాన్ల విజయాన్ని ప్రశంసిస్తూ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సిరియాలోని హయత్ తహ్రీర్ అల్ షామ్, పశ్చిమ చైనాలోని టర్కిస్తాన్ ఇస్లామిక్ పార్టీల నుంచి మద్దతు లభించింది. తాలిబాన్ల విజయాన్ని కీర్తిస్తూ ప్రకటనలు చేశాయి. వీటికితోడు ఇజ్రాయెల్ సేనలపై పోరాడే హమాస్ సంస్థ కూడా తాలిబాన్లకు మద్దతు ప్రకటించింది.

click me!