Taliban: ముల్లా బరాదర్ సారథ్యంలో తాలిబాన్ ప్రభుత్వం!.. ఎవరీ బరాదర్?

By telugu teamFirst Published Sep 4, 2021, 3:57 PM IST
Highlights

తాలిబాన్ ప్రభుత్వానికి దాని సహవ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ సారథ్యం వహించనున్నట్టు సమాచారం. తాలిబాన్లను త్వరలోనే ఈ ప్రభుత్వ ఏర్పాటు ప్రకటన చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ముల్లా బరాదర్ ప్రస్థానాన్ని తెలుసుకోవాల్సిన అవసరముంది.
 

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు త్వరలో తమ ప్రభుత్వ ప్రకటన చేయనున్నారు. ఈ ప్రభుత్వానికి ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ సారథ్యం వహించనున్నట్టు తెలుస్తున్నది. గతనెల 15న కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబాన్లు సుమారు 20 రోజుల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటన చేయనున్నారు. ఈ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తారని భావిస్తున్న బరాదర్ ఎవరు? ఆయన ప్రస్థానమేంటో ఓసారి చూద్దాం..

కాందహార్‌లో మద్రాసాను ఏర్పాటు చేసి తాలిబాన్‌ స్థాపనలో బరాదర్‌ది కీలక పాత్ర. ముల్లా బరదార్ తాలిబాన్ సహవ్యవస్థాపకుడు. ముల్లా మొహమ్మద్ ఒమర్‌తో కలిసి తాలిబాన్‌ను స్థాపించారు. ముల్లా మొహమ్మద్ ఒమరే ముల్లా అబ్దుల్ ఘనీకి బరాదర్ అనే పేరును ఇచ్చారు. బరాదర్ అంటే సహోదరుడు అని అర్థం. 

ఆఫ్ఘనిస్తాన్‌లోని ఉరుజ్గాన్ ప్రావిన్స్‌లో 1968లో అబ్దుల్ ఘనీ బరాదర్ జన్మించారు. అఫ్ఘాన్ ముజాహిదీన్‌లో చేరి 1980వ దశకంలో సోవియెట్ సేనలపై పోరాడారు. 1989లో సోవియెట్ ప్రభుత్వం తమ బలగాలను ఉపసంహరించుకుంది. అనంతరం దేశంలో అంతర్గత యుద్ధం సంభవించింది. అప్పుడే ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్, ముల్లా ఒమర్‌తో కలిసి కాందహార్‌లో మద్రాసా ఏర్పాటు చేశారు. అక్కడే వీరిరువురు కలిసి తాలిబాన్‌ను స్థాపించారు. 

1996లో ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారాన్ని చేపట్టి తాలిబాన్ ప్రభుత్వంలో ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. తాలిబాన్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత కూడా యూఎస్, నాటో సంకీర్ణ దళాలపై దాడిలోనూ కీలకపాత్ర పోషించారు. ఈ దళాలపై దాడికి సీనియర్ మిలిటరీ కమాండర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. తర్వాత ఆయన అరెస్టయి 2010లో పాకిస్తాన్‌లో ఊచల వెనక్కి వెళ్లారు.

2018లో జైలు నుంచి విడుదలైన తర్వాత దోహాలోని తాలిబాన్ రాజకీయ కార్యాలయానికి హెడ్‌గా వ్యవహరించారు. యూఎస్‌తో చర్చల్లో కీలక వ్యక్తిగా పరిణమించారు. ఆయన మిలిటరీ వ్యక్తిగా కంటే రాజకీయ వ్యక్తిగానే ఎక్కువ మంది దృష్టిలో పడ్డారు. తీవ్రవాద ముద్ర నుంచి కొంచెమైనా దూరంగా ఉన్న బరాదర్ తాలిబాన్ల ప్రభుత్వానికి సారథ్యం వహించడానికి సరైన వ్యక్తిగా వారు భావిస్తున్నారు.

కాగా, తాలిబాన్ల సుప్రీమ్ మతగురువు హైబతుల్లా అఖుంజాదా మతపరమైన విషయాలను పర్యవేక్షించనున్నారు. ఇస్లాం మత చట్రంలోనే పాలన సాగేలా చూసుకోనున్నట్టు సమాచారం. ఈ తరుణంలోనే  పొరుగు దేశం ఇరాన్ తరహాలోనే తాలిబాన్ ప్రభుత్వం ఉంటుందన్న వాదనలు వచ్చాయి. ఇరాన్‌లో మతపెద్ద సూచనల మేరకు పాలన సాగుతుంది. అదే మాడల్‌ను తాలిబాన్లు ఎంచుకోనున్నట్టు తెలుస్తున్నది. తాలిబాన్ సహ వ్యవస్థాపకుడు వారి ప్రభుత్వానికి సారథ్యం వహించనున్నట్టు సమాచారం.

click me!