Taliban: తాలిబాన్లకు పంజ్‌షిర్ తలవంచిందా? పాక్ మీడియా దుష్ప్రచారమంటున్న రెబల్స్

By telugu teamFirst Published Sep 4, 2021, 2:40 PM IST
Highlights

తాలిబాన్లకు పంజ్‌షిర్ తిరుగుబాటుదారులు ముప్పు తిప్పలు పెడుతున్నారు. కొన్నాళ్లుగా ఇక్కడ ఇరవర్గాల మధ్య భీకర పోరాటం జరుగుతున్నది. ఇదిలా ఉండగా, తాలిబాన్లు మరికాసేపట్లో ప్రభుత్వ ప్రకటన వెలువరించే అవకాశముంది. ఈ తరుణంలో పంజ్‌షిర్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్నామని తాలిబాన్లు ప్రకటించారు. కానీ, పంజ్‌షిర్ తిరుగుబాటుదారులు ఈ వాదనను ఖండించారు.

న్యూఢిల్లీ: ఎట్టకేలకు తాలిబాన్లు రెండోసారి ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వ ప్రకటనకు సిద్ధమవుతున్నది. కానీ, మొదటిసారిలాగే ఇప్పుడూ పంటికింది రాయిలా పంజ్‌షిర్ తగులుతూనే ఉన్నదని మదనపడుతున్నది. సోవియేట్ సేనలు సహా విదేశీ బలగాలకే కాదు, తాలిబాన్లకూ లొంగకుండా పంజ్‌షిర్ లోయ సింహంలా నిలబడింది. ఇప్పటికీ తాలిబాన్లు, పంజ్‌షిర్‌లోని తిరుగుబాటుదారులకు మధ్య భీకర పోరు జరుగుతున్నది. తాలిబాన్ల ప్రభుత్వ ఏర్పాటు ప్రకటన వెలువడే సందర్భంలో పంజ్‌షిర్‌ను తాము లొంగదీసుకున్నామని వెల్లడించింది. దేవుడి దయ వల్ల ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తమ అధీనంలో ఉన్నదని, పంజ్‌షిర్ కూడా తమ కమాండ్‌లోనే ఉన్నదని తాలిబాన్ కమాండర్ ప్రకటించారు. కానీ, ఈ ప్రకటనను పంజ్‌షిర్ తిరుగుబాటుదారులు ఖండిస్తున్నారు. తాము ఎవరి అధీనంలో లేమని స్పష్టం చేశారు.

కొన్ని రోజులుగా పంజ్‌షిర్ లోయలో భారీగా తుపాకీ గుళ్లు, బాంబుల చప్పుడు వినిపిస్తున్నది. ఆకాశంలోకి పొగలు వెలువడటం, లోయల నుంచి దుమ్ము రేగడం, భారీ శబ్దాలను రికార్డు చేస్తూ చుట్టుపక్కల్లోని స్థానికులు వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ తరుణంలోనే తాము పంజ్‌షిర్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తాలిబాన్లు ప్రకటించారు. ఈ ప్రకటనను ధ్రువీకరించే పరిస్థితి లేదు. ఎందుకంటే తిరుగుబాటు దారులు తాలిబాన్ల వాదనను కొట్టిపారేశారు.

పంజ్‌షిర్‌లో తాలిబాన్ వ్యతిరేక యోధుడు అహ్మద్ షా మసూద్ తనయుడు అహ్మద్ మసూద్ సారథ్యంలో తిరుగుబాటు జరుగుతున్నది. వీరితోనే నార్తర్న్ అలయెన్స్ కూడా ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అమృల్లా సలేహ్ కూడా ఉన్నారు.

తాలిబాన్ల వాదనను అమృల్లా సలేహ్ ఖండించారు. ‘మేము క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. అందులో సందేహం లేదు. తాలిబాన్ల దాడిని ఎదుర్కొంటున్నాం. కానీ, వారిని తిప్పికొడుతున్నాం. ఇంకా పంజ్‌షిర్ మా కంట్రోల్‌లోనే ఉన్నది’ అని ఓ అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. ఆయనతోపాటు తిరుగుబాటుదారుల నేతలూ ఇలాగే స్పందించారు.

అహ్మద్ మసూద్ కూడా ఇదే వాదన చేశారు. తాలిబాన్లకు పంజ్‌షిర్ తలొగ్గిందనే వార్తలను ఖండించారు. ‘పాకిస్తాన్ మీడియాలో పంజ్‌షిర్ తాలిబాన్లకు లొంగిపోయిందనే వార్తలు ప్రసారం అవుతున్నాయి. ఇవి పచ్చి అబద్ధాలు’ అని స్పష్టం చేశారు.

తాలిబాన్లతో జరుగుతున్న పోరులో ఇరువైపులా పెద్దసంఖ్యలో మరణిస్తున్నట్టు తెలుస్తున్నది. రెండు వైపులా ప్రాణనష్టం జరుగుతున్నా.. పోరాటంపై పంజ్‌షిర్ తిరుగుబాటుదారులు రాజీపడటం లేదు. తొలుత తాలిబాన్లు సంధికోసం ప్రయత్నించారు. ఒప్పందం కోసం చర్చ చేశారు. కానీ, ఈ చర్చ పురోగతి సాధించలేదు. దీంతో పోరాటమే దారిగా మారింది.

click me!