తాలిబాన్ ప్రభుత్వానికి తుదిమెరుగులు.. కార్యక్రమానికి చైనా, పాక్, రష్యా, ఇరాన్‌లకు ఆహ్వానం!

By telugu teamFirst Published Sep 6, 2021, 3:05 PM IST
Highlights

తాలిబాన్లు తమ ప్రభుత్వానికి తుదిమెరుగులు దిద్దుతున్నట్టు పేర్కొన్నారు. త్వరలోనే ప్రకటన ఉంటుందని, ఈ కార్యక్రమానికి చైనా, పాకిస్తాన్, రష్యా, టర్కీ, ఖతర్, ఇరాన్‌లను ఆహ్వానించినట్టు సమాచారం.
 

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పాటు చేయబోతున్న తాలిబాన్ ప్రభుత్వానికి తుదిమెరుగులు అద్దుతున్నట్టు కొన్నివర్గాలు తెలిపాయి. ప్రభుత్వాన్ని ప్రకటిస్తామని చెప్పి ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఒకవైపు తాలిబాన్లకు, హక్కానీ గ్రూపునకు మధ్య పొసగడం లేదన్న వార్తలు వస్తుండగా మరోవైపు పంజ్‌షిర్‌లో ఘర్షణలు కొనసాగుతూనే ఉండటంతో దేశంలో అంతర్యుద్ధం చెలరేగే ముప్పు ఉన్నదని నిఘావర్గాల అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా తాలిబాన్ స్పందించింది. తాలిబాన్ ప్రభుత్వానికి తుదిమెరుగులు దిద్దుతున్నట్టు తాలిబాన్‌వర్గాలు తెలిపాయి. అంతేకాదు, ఈ ప్రభుత్వ ప్రకటన కార్యక్రమానికి పాకిస్తాన్, టర్కీ, ఖతర్, రష్యా, చైనా, ఇరాన్‌లను ఆహ్వానించినట్టు తెలిసింది. 

తాలిబాన్ అధికారప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, పంజ్‌షిర్‌ను హస్తగతం చేసుకున్నట్టు వెల్లడించారు. పంజ్‌షిర్‌లో యుద్ధం ముగిసిందని, దేశంలో ఇక సుస్థిరత ఏర్పడుతుందని తెలిపారు. ఇక నుంచి ఆయుధాలు ఎవరూ ఎత్తుకోవద్దని చెప్పారు. ఆయుధాలు చేతపట్టినవారందరూ ప్రజలకు శత్రవులేనని స్పష్టం చేశారు. ఆక్రమణదారులెవరూ దేశాన్ని పునర్నిర్మించలేరని ప్రజలు తెలుసుకోవాలన్నారు. అది తెలుసుకోవడం ప్రజల బాధ్యత అని చెప్పారు. అంతేకాదు, కాబూల్ ఎయిర్‌పోర్టులో సేవలను పునరుద్ధరించడానికి ఖతర్, టర్కీ, యూఏఈల్లోని టెక్నికల్ టీమ్‌లు పనిచేస్తున్నాయని వివరించారు.

పంజ్‌షిర్ లోయను తమ అధీనంలోకి తెచ్చుకున్నామని తాలిబాన్లు ప్రకటించుకున్నారు. ప్రావిన్స్‌లోని గవర్నర్ కార్యాలయంలో తాలిబాన్ల జెండాను ఎగరేశారు. ఇప్పుడు దేశమంతా తమ అధీనంలో ఉన్నదని వివరించారు. కాగా, తిరుగుబాటుదారులు మాత్రం యుద్ధం ఇంకా ముగిసిపోలేదని తెలిపారు. పంజ్‌షిర్ తిరుగుబాటుదారుల్లో కీలక నేతలను మట్టుబెట్టినట్టు తాలిబాన్లు ప్రకటించారు.

click me!