
ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) రహస్య స్థావరంపై తాలిబాన్ బలగాలు దాడి చేశాయి. ఈ దాడిలో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ విషయాన్ని ఆఫ్ఘన్ ప్రభుత్వ ప్రతినిధి శనివారం వెల్లడించారు. తాలిబాన్ నేతృత్వంలోని ప్రభుత్వ ప్రధాన ప్రతినిధి జబీహుల్లా స్పందిస్తూ.. ఇస్లామిక్ ఎమిరేట్‌లోని ప్రత్యేక విభాగాలకు చెందిన బలగాలు నిన్న (శుక్రవారం) ఐఎస్ మిలిటెంట్ల రహస్య స్థావరాన్ని గుర్తించాయని అన్నారు. అనంతరం ఇద్దరు కార్యకర్తలను అరెస్టు చేసి, ఆపై పోలీస్ డిస్ట్రిక్ట్ 8లో వారి రహస్య స్థావరంపై దాడి చేశాయని పేర్కొన్నారు. ఫలితంగా ఉదయం ఆరుగురు తిరుగుబాటుదారులు మరణించారని ఆయన ట్వీట్ చేశారు.
భార్యాభర్తల చికెన్ గొడవ ... తలదూర్చిన పక్కింటాయన దారుణ హత్య
ఘటనా స్థలం నుంచి రైఫిళ్లు, గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలు, కారుతో పాటు అనేక ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా రహస్య స్థావరం నుండి స్వాధీనం చేసుకున్నట్లు ముజాహిద్ తెలిపారని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.
కాగా.. ప్రస్తుత దాడిలో మరణించిన ఉగ్రవాదుల్లో కొందరు కొన్ని వారాల కిందట వజీర్ అక్బర్ ఖాన్ మసీదు, దష్త్-ఏ-బర్చి జిల్లాల్లోని కళాశాలపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో అనేక మంది చనిపోయారు. మరెందరికో గాయాలు అయ్యాయి. తాజా దాడిలో ఒక భద్రతా సిబ్బంది చనిపోయారని, మరొకరు గాయపడ్డారని ముజాహిద్ ధృవీకరించారు. కొద్ది రోజుల క్రితం ఉత్తర కుందుజ్ ప్రావిన్స్‌లో ఐదుగురు ఉగ్రవాదులను తాలిబాన్ బలగాలు హతమార్చాయి. ఆ తరువాత ఆఫ్ఘనిస్తాన్‌లో ఐఎస్‌పై జరిగిన రెండో ఆపరేషన్ ఇది.