ఆఫ్ఘనిస్తాన్‌లో చిన్నారిని హతమార్చిన తాలిబాన్లు.. తండ్రి తిరుగుబాటు దళంలో చేరాడనే అక్కసుతో దుర్మార్గం

By telugu teamFirst Published Sep 28, 2021, 1:55 PM IST
Highlights

ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు తాలిబాన్లు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నారు. ఇష్టారీతిన పౌరులను హతమార్చి అదే శిక్షాస్మృతి అంటూ క్రూరత్వాన్ని చాటుతున్నారు. ఇటీవలే నలుగురిని హతమార్చి క్రేన్‌లకు వేలాడదీసి ప్రదర్శనకు ఉంచిన తాలిబాన్లు తాజాగా ముక్కుపచ్చలారని చిన్నారి బాలుడిని నడివీధిలో హతమార్చి రక్తపు మడుగులో వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఆ చిన్నారి బాలుడి తండ్రి తాలిబాన్లకు వ్యతిరేకంగా ఏర్పడిన తిరుగుబాటు దళ సభ్యుడన్న అనుమానాలే ఈ దుర్మార్గానికి కారణమని తెలుస్తున్నది.
 

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లోతాలిబాన్ల దుర్మార్గాలు పెరిగిపోతున్నాయి. క్రూరత్వంతో కూడిన శిక్షల అమలును మళ్లీ ప్రారంభించారు. ఆ దేశ పౌరులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. ఇటీవలే కిడ్నాప్ చేశారన్న ఆరోపణలతో హెరాత్ ప్రావిన్స్‌లో నలుగురిని హతమార్చి క్రేన్‌లకు వేలాడదీసి ప్రదర్శన ఉంచిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తాజాగా మరో కర్కశ ఘటన చోటుచేసుకుంది.

తాఖర్ ప్రావిన్స్‌లో తాలిబాన్లు అతికిరాతకంగా ఓ చిన్నారి బాలుడును పొట్టనబెట్టుకున్నారు. ఆ బాలుడి తండ్రి తాలిబాన్లపై తిరుగుబాటు చేసిన దళంలో చేరినట్టు తాలిబాన్లు అనుమానించారు. తర్వాత ఆ బాలుడిని హతమార్చి వీధిలో పడేసి వెళ్లిపోయారు. రక్తపుమడుగులో నిర్జీవంగా పడి ఉన్న ఆ బాలుడి చుట్టూ చిన్న పిల్లలు రోధిస్తూ కంటతడి పెట్టించారు. స్వతంత్ర స్థానిక మీడియా ఔట్‌లెట్ పంజ్‌షిర్ అబ్జర్వర్ బాలుడి మృతదేహాన్ని చూపించే వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది.

తాలిబాన్లు కాబూల్‌ను స్వాధీనంలో తెచ్చుకున్న తర్వాత తాలిబాన్లకు వ్యతిరేకంగా పంజ్‌షిర్ ప్రావిన్స్‌లో తిరుగుబాటు దళం ఏర్పడింది. తాలిబాన్ల పాలనను తాము ఆమోదించడం లేదని ప్రకటించారు. వారిపై గెరిల్లా యుద్దాన్ని ప్రకటించింది. వీరోచితంగా పోరాటం జరిపింది. కొన్ని వారాలపాటు తిరుగుబాటు దళానికి, తాలిబాన్లకు మధ్య భీకర యుద్ధం జరిగింది. తర్వాత పంజ్‌షిర్ ప్రావిన్స్‌నూ స్వాధీనం చేసుకున్నట్టు తాలిబాన్లు ప్రకటించారు.

click me!