దేశాధ్యక్షుడిపై గుడ్డు విసిరేసిన దుండగుడు.. అతనితో మాట్లాడతానన్న ప్రెసిడెంట్

By telugu teamFirst Published Sep 27, 2021, 8:12 PM IST
Highlights

ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మ్యాక్రన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ రెస్టారెంట్ ట్రేడ్ ఫెయిర్‌లో పాల్గొనడానికి వెళ్లిన మ్యాక్రన్‌పై ఓ దుండగుడు గుడ్డుపై విసిరాడు. భద్రతా సిబ్బంది వెంటనే దుండగుడిని గుర్తించి గది బయటకు తీసుకెళ్లారు.

న్యూఢిల్లీ: ఫ్రెంచ్ అధ్యక్షుడు(French President) ఇమ్మాన్యుల్ మ్యాక్రన్‌(Emmanuel Macron)కు చేదు అనుభవం ఎదురైంది. ఓ రెస్టారెంట్, హోటల్ ట్రేడ్ ఫెయిర్‌లో పాల్గొనడానికి వెళ్లిన మ్యాక్రన్‌పై ఓ దుండగుడు గుడ్డు(Egg) విసిరాడు. ఆ గుడ్డు అధ్యక్షుడు మ్యాక్రన్ భుజానికి తగిలింది. భుజానికి తగిలి పగులకుండానే వెనక్కి వెళ్లింది. ఆయన భద్రతా సిబ్బంది వెంటనే ఆ దుండగుడిని గుర్తించారు. దుండగుడిని పట్టుకుని వెంటనే గది బయటకు తీసుకెళ్లారు.

ఫ్రాన్స్‌లో ఆగ్నేయ నగరం లియోన్‌లో రెస్టారెంట్, హోటల్ ట్రేడ్ ఫెయిర్ జరిగింది. ఇందులో పాల్గొనడానికి ఇమ్మాన్యుల్ మ్యాక్రన్ వెళ్లారు. ఆ ఫెయిర్‌లో అందరూ గుమిగూడి ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. వారిని అదుపు చేయడానికి భద్రతా సిబ్బంది వలయంగా ఏర్పడ్డారు. అయినప్పటికీ అందులో నుంచి ఓ వ్యక్తి గుడ్డును విసిరాడు. అది నేరుగా మ్యాక్రన్ భుజానికి తగిలి వెనక్కెళ్లినట్టు ఓ వీడియోలో కనిపించింది.

ఇంటర్నేషనల్ క్యాటరింగ్, హోటల్, ఫుడ్ ట్రేడ్ ఫెయిర్‌లో అధ్యక్షుడు మ్యాక్రన్ మాట్లాడారు. ఈ ఘటనను ప్రస్తావిస్తూ ‘ఆయన నాకు ఏమైనా చెప్పాలని అనుకుంటే నా దగ్గరకు రానివ్వండి’ అని తెలిపారు. లేదంటే ‘నేనే తర్వాత ఆయన దగ్గరకు వెళ్తాను’ అని చెప్పారు.

ఫ్రాన్స్‌లో ఆందోళనకారుల నుంచి నేతలు ఇదే తరహాలో గుడ్ల దాడి ఎదుర్కొంటుంటారు. ఆందోళనకారుల ఆగ్రహానికి ఫ్రెంచ్ రాజకీయ నాయకులు ఇలా గుడ్ల దాడికి గురవుతుంటారు. ఇందుకు మ్యాక్రన్ కూడా మినహాయింపు కాదు. 

2017లో ఆయన అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్నప్పుడు కూడా ఓ కార్యక్రమంలో ఇలాంటి ఘటననే మ్యాక్రన్‌కు ఎదురైంది. ఓ ఆందోళనకారుడు ఇలాగే గుడ్డు విసిరాడు. ఇదే ఏడాది జూన్‌లో వ్యాలెన్స్ సిటీలోనూ ఆయన కొంతమందికి షేక్ హ్యాండ్ ఇస్తుండగా ఓ వ్యక్తి అధ్యక్షుడు మ్యాక్రన్ చెంపపై కొట్టాడు.

click me!