ఆఫ్గనిస్తాన్: అనుకున్నదే అయ్యింది.. కాబూల్‌లోకి ప్రవేశించిన తాలిబన్లు

By Siva KodatiFirst Published Aug 15, 2021, 2:25 PM IST
Highlights

తాలిబన్లు ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించారు. ఇప్పటికే 19 రాష్ట్రాల రాజధానుల్లో తాలిబన్లు పాగా వేశారు. దీనితో పాటు ఆఫ్ఘనిస్తాన్ అన్ని సరిహద్దులను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన అగ్రరాజ్యం అమెరికా ఆఫ్గన్ నుంచి తమ రాయబార కార్యాలయ సిబ్బందిని స్వదేశానికి తరలిస్తోంది.

అఫ్గానిస్థాన్‌ హస్తగతమే లక్ష్యంగా తాలిబన్ల దురాక్రమణ మరింత జోరుగా సాగుతోంది. ఇప్పటికే దేశంలో మెజారిటీ భూభాగంపై పట్టుసాధించిన వారు ఆదివారం ఉదయానికి దేశ రాజధాని కాబూల్‌కు సమీపంలో ఉన్న మరో నగరం జలలాబాద్‌ను సైతం ఆక్రమించారు. వేకువజామున ప్రజలు నిద్ర లేచేసరికి నగరవ్యాప్తంగా తాలిబన్‌ జెండాలు పాతుకుపోయాయి. జలాలబాద్‌ ఆక్రమణతో కాబూల్‌ నగరానికి తూర్పు ప్రాంతాలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఆ వెంటనే తాలిబన్లు రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించారు. ఇప్పటికే 19 రాష్ట్రాల రాజధానుల్లో తాలిబన్లు పాగా వేశారు. దీనితో పాటు ఆఫ్ఘనిస్తాన్ అన్ని సరిహద్దులను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన అగ్రరాజ్యం అమెరికా ఆఫ్గన్ నుంచి తమ రాయబార కార్యాలయ సిబ్బందిని స్వదేశానికి తరలిస్తోంది. హెలికాఫ్టర్ల ద్వారా దౌత్య సిబ్బందిని తరలిస్తోంది. 

అంతకుముందు దక్షిణాన ఉన్న లోగర్‌ రాష్ట్రాన్ని తాలిబన్లు శనివారం పూర్తిగా ఆక్రమించుకున్నారు. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన మజార్‌-ఏ-షరీఫ్‌పైనా ఆధిపత్యం సాధించారు.  కాందహార్‌లోని రేడియో స్టేషన్‌ను ఆక్రమించిన తాలిబన్లు... ఇక నుంచి ఇస్లామిక్‌ వార్తలనే ప్రసారం చేస్తామని ప్రకటించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో... ఆఫ్గనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ శనివారం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మరింత రక్తపాతం జరగనివ్వనని.. దేశంలో శాంతి, సుస్థిరతల స్థాపనపై దృష్టి సారిస్తానని తెలిపారు.

click me!