హైతీలో తీవ్ర భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ.. భారీగా మరణాలు?

By telugu teamFirst Published Aug 14, 2021, 8:49 PM IST
Highlights

కరీబియన్ దేశం హైతీని తీవ్ర భూకంపం అతలాకుతలం చేసింది. శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో సముద్రతీరంలో ఏర్పడ్డ భూకంపం యావత్ దేశాన్ని వణించింది. ఫలితంగా అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. పెద్దమొత్తంలో మరణాలు నమోదయ్యే అవకాశముందని అధికారులు అభిప్రాయపడ్డారు.

న్యూఢిల్లీ: కరీబియన్ కంట్రీ హైతీని తీవ్ర భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్‌పై 7.2గా నమోదైనట్టు యూఎస్ జియలాజికల్ సర్వే వెల్లడించింది. ఇది తీవ్రస్థాయి భూకంపమని పేర్కొంటూ సునామీ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో భవంతులు నేలమట్టమయ్యాయని, పెద్దసంఖ్యలో మరణాలు సంభవించి ఉండవచ్చని సమాచారం. కచ్చితంగా మరణాలు సంభవించాయని ధ్రువీకరించగలనని హైతీ సివిల్ ప్రొటెక్షన్ డైరెక్టర్ జెర్రీ చాండ్లర్ తెలిపారు. కానీ, ఎంతమంది మరణించారో ఇప్పుడే తేల్చి చెప్పలేనని, వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. దేశంలో ఎమర్జెన్సీ ఆపరేషన్స్‌ను యాక్టివేట్ చేశారు. ప్రధాని ఏరియల్ హెన్రీ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్‌కు చేరుకున్నారు.

హైతీ తీర పట్టణం పెటిట్ ట్రౌ డీ నిప్పస్‌ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో సముద్ర భూగర్భంలో కనీసం 10 కిలోమీటర్ల లోతున భూకంపకేంద్రం ఉన్నట్టు అంచనా వేసింది. ఎక్కువ సేపు భూమి కంపించిందని, భూకంప ప్రకంపనలు దేశమంతటా వ్యాపించినట్టు స్థానికుల ద్వారా తెలుస్తున్నది. సరిహద్దును పంచుకుంటున్న పొరుగుదేశం డొమినికన్ రిపబ్లిక్‌లోనూ దీని తీవ్రత కనిపించింది. హైతీ కాలమానం ప్రకారం ఉదయం 8.29 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ తీవ్రతను పసిగట్టిన యూఎస్ సునామీ వార్నింగ్ సిస్టమ్ కొన్ని తీర ప్రాంతాల్లో తీవ్రస్థాయి సునామీ అలలు వచ్చే ముప్పు ఉందని హెచ్చరించింది. సాధారణ అలల కంటే రెండు మూడు మీటర్ల ఎత్తులో అలలు రావచ్చునని తెలిపింది. యూరోపియన్ మిడిటెర్రేనియన్ సెస్మలాజికల్ సెంటర్ భూకంప తీవ్రత 7.6గా గణించింది. క్యూబా సహా కరీబియన్ రీజియన్ మొత్తంలో దీని తీవ్రత కనిపించిందని తెలిపింది.

2010లో హైతీని ధ్వంసం చేసిన భూకంప నష్టాల నుంచే దేశం ఇంకా బయటపడలేదు. అప్పటి భూకంపంలో కనీసం రెండు లక్షల మంది పౌరులు మరణించారు. పశ్చిమ భూగోళంలో హైతీ అతిపేద దేశంగా పేర్కొంటారు. దీనికితోడు జులైలో దేశాధ్యక్షుడు జోవెనెల్ మోయిస్‌ హత్యతో రాజకీయ అస్థిరత కూడా దేశంలో కొనసాగుతున్నది.

click me!