తాలిబన్ల కంట్రోల్‌లోకి కాందహార్.. సంక్షోభంలో ప్రభుత్వం!

By telugu teamFirst Published Aug 13, 2021, 12:54 PM IST
Highlights

ఆఫ్ఘనిస్తాన్‌లో కాబూల్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన కాందహార్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నారు. కాందహార్ సహా హెరాత్ నగరాన్ని, అక్కడి హెరాత్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాలిబన్లు తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. ఈ విషయాన్ని అఫ్ఘాన్ భద్రతావర్గాలూ ధ్రువీకరించాయి. మరో నెల రోజుల్లో కాబూల్‌నూ టార్గెట్ చేసే అవకాశాలున్నాయని యూఎస్ నిఘావర్గాలు తెలిపాయి.

న్యూఢిల్లీ: అమెరికా, నాటో బలగాలు ఉపసంహరణ మొదలైనప్పటి నుంచి తాలిబన్లు శరవేగంగా అఫ్ఘాన్ ప్రభుత్వ బలగాలపై పైచేయి సాధిస్తున్నారు. కీలక నగరాలను హస్తగతం చేసుకుంటూ దావానలంలా విస్తరిస్తున్నారు. తాజాగా, దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన కాందహార్‌ను ఆక్రమించుకున్నారు. అనంతరం అంతే వేగంగా మూడో అతిపెద్ద నగరమైన హెరాత్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు హెరాత్ అంతర్జాతీయ విమానాశ్రయం వారి కంట్రోల్‌లోకి వెళ్లిపోయింది. ఎయిర్‌పోర్టులోని సిబ్బంది తాలిబన్లకు లొంగిపోయారు.

కాందహార్‌, మరో నగరం లష్కర్ గాహ్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్నట్టు తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఈ ప్రకటనను అఫ్ఘాన్ భద్రతబలగాలకు చెందిన సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. తాలిబన్ల దూకుడును దృష్టిలో పెట్టుకుని హెరాత్‌ నుంచి ముందుగానే అఫ్ఘాన్ బలగాలు సురక్షిత ప్రాంతాలకు వెనుదిరిగాయి. అనంతరం స్వల్ప వ్యవధిలోనే తాలిబన్లు హెరాత్‌ను ఆక్రమించుకున్నారు. హెరాత్‌ను ఆక్రమించుకున్నాక గంటల వ్యవధిలోనే కాందహార్, లష్కర్ గాహ్‌ను స్వాధీనపరుచుకున్నట్టు ప్రకటించుకున్నారు.

మే నెల నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ ప్రారంభమైనప్పటి నుంచి తాలిబన్లు దూకుడు పెంచినప్పటికీ గతవారంలో అఫ్ఘాన్ ప్రభుత్వ కీలక భూభాగాలపై పట్టుకోల్పోయింది. వారం రోజుల్లోనే ఉత్తర, దక్షిణ, పశ్చిమ అఫ్ఘానిస్తాన్‌లో చాలా వరకు తాలిబన్లు ఆక్రమించుకున్నారు. కాబూల్‌కు 90 మైళ్ల దూరంలోని కీలకమైన ఘజనీ సెంట్రల్ సిటీని గురువారం సీజ్ చేశారు. 

ముప్పై రోజుల్లో కాబూల్‌‌ టార్గెట్
ప్రస్తుతం తూర్పువైపున పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని మజార్-ఈ-షరీఫ్, జలాలాబాద్‌లతోపాటు కాబూల్‌ నగరాలు ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. దీంతో అఫ్ఘాన్ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయినట్టు స్పష్టమవుతున్నది. మరో 30 రోజుల్లో రాజధాని నగరం కాబూల్‌ నుంచి భద్రతా దళాలను తాలిబన్లు బయటికిపంపే ముప్పు ఉన్నట్టు నిఘా వర్గాలను పేర్కొంటూ అమెరికా రక్షణ శాఖ అధికారులు తెలిపారు. 90 రోజుల్లో కాబూల్‌నూ తాలిబన్లు తమ అధీనంలోకి తెచ్చుకునే అవకాశముందని వివరించారు.

అధికారాన్ని పంచుకునే ప్రతిపాదన నిలిచేనా?
తాలిబన్లను ఎదుర్కోవడానికి అష్రఫ్ ఘనీ ప్రభుత్వం సొంత భద్రతా బలగాలు సహా నాటో, యూఎస్ బలగాలపైనే ప్రధానంగా ఆధారపడ్డారు. కానీ, చాలా వరకు అమెరికా బలగాలు వెనుదిరగడంతో మరెంతో కాలం ప్రభుత్వం నిలబడే అవకాశం లేదని తెలుస్తున్నది. ఈ తరుణంలో దోహాలోని ప్రభుత్వ బృందం అధికారాన్ని పంచుకునే రాజీ ప్రతిపాదనను తాలిబన్లకు చేసినట్టు తెలిసింది. అయితే, దేశంలోని చాలా భాగాన్ని ఆక్రమించుకున్న తాలిబన్లు ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించే అవకాశాలు స్వల్పమేనన్నది విశ్లేషకుల అభిప్రాయం.

యూఎస్, యూకేల దౌత్య సిబ్బంది తరలింపు
తాలిబన్లు దాదాపు దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్న క్రమంలో అమెరికా, ఇంగ్లాండ్‌లు అప్రమత్తమయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్‌లోని తమ దౌత్య సిబ్బందిని వెనక్కి తెచ్చుకోవడానికి చర్యలు ప్రారంభించాయి. వీరిని అతివేగంగా తమ దేశాలకు చేరవేయనున్నట్టు ప్రకటించాయి. వారిని సురక్షితంగా స్వదేశానికి తేవడానికి భద్రతా బలగాలను పంపనున్నట్టు వివరించాయి. అయితే, ఆ బలగాలు తాలిబన్లపై దాడి కోసం కాదని, కేవలం తమ దౌత్య సిబ్బంది తరలింపునకే అని యూఎస్ స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. 3000 మంది జవాన్లను ఒకట్రెండు రోజుల్లో అఫ్ఘాన్ పంపనున్నట్టు యూఎస్ రక్షణశాఖ ప్రకటించగా, 600 ట్రూపులను పంపనున్నట్టు యూకే వెల్లడించింది.

click me!