జిహాదీలను తాలిబాన్ మోసం చేసింది.. మా పోరాటం సాగిస్తాం: ఐఎస్ఐఎస్

By telugu teamFirst Published Aug 27, 2021, 1:56 PM IST
Highlights

జిహాదీలను తాలిబాన్లు మోసం చేశారని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ పేర్కొంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న తాలిబాన్లు అమెరికా తయారుచేసిన కీలుబొమ్మలేనని తెలిపింది. తాము జిహాద్ కొత్త దశకు సిద్ధమవుతున్నామని, తమ పోరాటం సాగిస్తామని ఓ పేపర్‌లో ఐఎస్ పేర్కొంది.

న్యూఢిల్లీ: దశాబ్దాలుగా నెత్తురోడుతున్న ఆఫ్ఘనిస్తాన్‌లో మరో దశ ప్రారంభమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రెండు దశాబ్దాలుగా ఆఫ్ఘనిస్తాన్ సైన్యం, అమెరికా బలగాలు లక్ష్యంగా తాలిబాన్ల పేలుళ్లు, విధ్వంసం జరిగింది. ఇకపై తాలిబాన్లు, ఐఎస్ఐఎస్ ముఠాల మధ్య బీభత్సం జరగనున్నట్టు తెలుస్తున్నది. అమెరికాతో తాలిబాన్ల ఒప్పందాన్ని మొదటి నుంచి వ్యతిరేకించిన ఐఎస్ఐఎస్ తాజాగా, కొత్త దశ జిహాద్‌కు ప్రిపేర్ అవుతున్నట్టు ప్రకటించింది.

ఆఫ్ఘనిస్తాన్ రాజధానిలో జంట పేలుళ్లతో ఐఎస్ మారణహోమం సృష్టించింది. ఎయిర్‌పోర్టు సమీపంలో జరిగిన పేలుళ్లలో 100 మందికిపైగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ పేలుళ్లు తమ పనేనని ఐఎస్ ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఐఎస్ ప్రస్థానాన్ని పరిశీలించాల్సి వస్తున్నది.

ఆఫ్ఘనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక ఉగ్రసంస్థలు తాలిబాన్లకు అభినందనలు తెలిపాయి. కానీ, ఐఎస్ మౌనం వహించింది. తాలిబాన్, ఐఎస్ రెండూ సున్నీ వర్గ ఉగ్రవాద సంస్థలే. వాటి లక్ష్యమూ ఒకటే. ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా విధ్వంసం చేస్తున్నాయి. కానీ, స్ట్రాటజీ వేరుగా ఉన్నది. తామే అసలైన జిహాదిస్తులమని రెండూ చెప్పుకుంటాయి. ఐఎస్ మాత్రం తాలిబాన్లను మతద్రోహులుగా పేర్కొంటుంది.

దోహాలో వాషింగ్టన్‌తో తాలిబాన్ల ఒప్పందాన్ని ఐఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. తాలిబాన్లు జిహాదీని వదిలిపెట్టిందని, అమెరికాకు మోకరిల్లిందని విమర్శించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారం సొంతం చేసుకున్న తాలిబాన్లు కేవలం అమెరికా చేతిలో పావులే అంటూ ఆరోపించింది. తాలిబాన్లు షరియాను అమలు చేయగలరా? అంటూ ప్రశ్నించింది. జిహాదీలకు వారు ద్రోహం చేశారని పేర్కొంది. గతశుక్రవారం అల్ నబా అనే వారపత్రికలో ఐఎస్ తాలిబాన్ల విజయాన్ని ‘ముల్లా బ్రాడ్లీ’గా పేర్కొంది. అంటే పరోక్షంగా తాలిబాన్లు అమెరికా ప్రాక్సీ అని పేర్కొంది. వారి చెప్పుచేతల్లో నడిచేవారని ఆరోపించింది. అందుకే తాము జిహాద్ నూతన దశకు సిద్ధమవుతున్నామని తెలిపింది. దోహా ఒప్పందం ప్రకారం అమెరికా వ్యతిరేక శక్తులకు ఆఫ్ఘనిస్తాన్‌లో చోటివ్వమని తాలిబాన్ హామీనిచ్చిన సంగతి తెలిసిందే.

ఇరాక్‌లో పుట్టిన ఐఎస్ కాలిఫేట్‌(ఖలీఫా రాజ్యం)ను ప్రకటించింది. అందులో కొంత విజయవంతమైంది కూడా. ఇప్పుడు ఇరాక్, సిరియాలో తన పట్టు నిలుపుకుంది. 2014లో చేసిన ఈ ప్రకటన తర్వాత పాకిస్తాన్ తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌లోని ఉగ్రవాదులతోనూ చేతులు కలిపి ఈ రీజియన్‌లో కొత్త చాప్టర్‌ను, కొత్త రాజ్యాన్ని స్థాపించే లక్ష్యంతో పనిచేసింది. దానికి ఐఎస్ఐఎస్ లీడర్షిప్‌ ఆమోదం ఉన్నది. కానీ, మధ్యప్రాచ్యంలో ఐఎస్ సక్సెస్ అయినప్పటికీ ఈ రీజియన్‌లో విఫలమైంది. కాబూల్‌ను హస్తగతం చేసుకోవడానికి ముందు తాలిబాన్లకు ఐఎస్ ముఠాకు భీకర పోరాటాలు జరిగాయి. కానీ, ఐఎస్ ముఠా కంటే తాలిబాన్లే పుంజుకుని ఆఫ్ఘనిస్తాన్‌ను అధీనంలోకి తెచ్చుకున్నారు. మొదటి నుంచీ ఈ రెండింటి మధ్య శత్రుత్వం కొనసాగుతూనే ఉన్నది. తాజాగా, బాహాటంగా తాలిబాన్లను విమర్శించడమే కాదు, తమ పోరాటం కొనసాగిస్తామని ఐఎస్ ఓ పత్రికలో పేర్కొంది.

click me!