
న్యూయార్క్ : ఏప్రిల్ 4న యుఎస్‌లోని హిందూవులందరూ గర్వించే ఘటన New Yorkలో జరిగింది. ఇక్కడి ప్రముఖ దేవాలయం ఉన్న వీధికి 'Ganesh Temple Street' అని నామకరణం చేశారు. ఈ దేవాలయాన్ని 1977లో స్థాపించారు. అదే ది హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా శ్రీ మహా వల్లభ గణపతి దేవస్థానం, దీనిని గణేష్ టెంపుల్ అని పిలుస్తారు, ఇది ఉత్తర అమెరికాలోని మొట్ట మొదటి, పురాతన హిందూ దేవాలయంగా పరిగణించబడుతుంది.
ఈ హిందూ దేవాలయం క్వీన్స్ కౌంటీలోని ఫ్లషింగ్‌లో ఉంది. ఈ దేవాలయం ఉన్న వీధి పేరు బౌన్ స్ట్రీట్, మతపరమైన స్వేచ్ఛ, బానిసత్వ వ్యతిరేక ఉద్యమానికి మార్గదర్శకుడైన ప్రముఖ అమెరికన్ జాన్ బౌన్ పేరును ఈ వీధికి పెట్టారు. అయితే శనివారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో, ఈ గణేష్ ఆలయ గౌరవార్థం ఆ వీధికి 'గణేష్ టెంపుల్ స్ట్రీట్' అని పేరును మార్చారు.
ఈ మేరకు ఓ ప్రత్యేకకార్యక్రమంలో స్ట్రీట్ గుర్తును ఆవిష్కరించారు. ఈ వేడుకలో న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్, క్వీన్స్ బోరో ప్రెసిడెంట్ డోనోవన్ రిచర్డ్స్, న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్, ట్రేడ్, ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ డిప్యూటీ కమిషనర్, దిలీప్ చౌహాన్, ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఇది కేవలం వేడుక మాత్రమే కాదని.. ఇక్కడిదాకా చేరుకోవడానికి దశాబ్దాల సమయం పట్టిందని.. దీనివెనుక అందరి కృషి ఉందని క్వీన్స్ బోరో ప్రెసిడెంట్ అన్నారు. అంతేకాదు ఇది ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ గురించి చాలా చెబుతుంది. ఎందుకంటే మీరు మీ కోసం మాత్రమే కాకుండా మీ చుట్టూ ఉన్న ప్రజల జీవితాలకు ఆనందమయంగా మార్చేస్తారు.. అన్నారు. ఈ మేరకు రిచర్డ్స్ పూజారులు, పెద్ద సంఖ్యలో హాజరైన భక్తుల సమక్షంలో స్ట్రీట్ సింబల్ను ఆవిష్కరించిన వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ వేడుక బైసాకీ ఉత్సవాల్లో భాగంగా జరిగింది.
గతేడాది డిసెంబరులో, న్యూయార్క్ సిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో కౌన్సిల్‌మెన్ పీటర్ కూ అధ్యక్షతన ఉన్న కమిటీ బౌన్ స్ట్రీట్‌కు "గణేష్ టెంపుల్ స్ట్రీట్" అని పేరు పెట్టడాన్ని ఆమోదించిందని, ఆలయం సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపింది. నిర్వహణ, బోర్డు సభ్యులు, ఎన్నికైన అధికారులు ప్రతి ఒక్కరూ వారి నిరంతర మద్దతు అందించాలని కోరింది.
ఇక న్యూయార్క్ & డల్లాస్‌లోని కాన్సులేట్, ఇండియన్-అమెరికన్ వార్తాపత్రిక ది ఇండియన్ పనోరమా ప్రత్యేక బైసాఖీ వేడుకను నిర్వహించింది, ఇందులో సిక్కు సంఘం సభ్యులు, ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. సిక్కు యుద్ధ కళలో ఆరితేరిన దలేర్ సింగ్ స్థాపించిన అకల్ గట్కా అకాడమీకి చెందిన యువకులు ప్రత్యేక కళాత్మక ప్రదర్శనలు ఇచ్చారు. ఈ ప్రదర్శనల ద్వారా పంజాబ్ సంస్కృతి, వారసత్వాన్ని అందరికీ తెలిపారు.
గత వారం ప్రారంభంలో, న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, రాజస్థాన్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (రానా), జైపూర్ ఫుట్ USAతో కలిసి మార్చి 30న రాజస్థాన్ దివాస్ వర్చువల్ వేడుకను నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో జైస్వాల్, రాజస్థాన్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ ప్రసంగించారు. అమెరికా (రానా), న్యూయార్క్ అధ్యక్షుడు ప్రేమ్ భండారీ, రాజస్థాన్‌కు చెందిన ప్రముఖ జానపద గాయకుడు స్వరూప్ ఖాన్, రాష్ట్రానికి చెందిన ఇతర ప్రముఖ కళాకారులు హాజరయ్యారు.
రాజస్థాన్ సంస్కృతి, వారసత్వం, అక్కడి ప్రజల పరాక్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని జైస్వాల్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు భారతదేశంలో పర్యటించేప్పుడు తప్పనిసరిగా రాజస్థాన్‌ను సందర్శిస్తారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో జైపూర్ ఫుట్ ఆర్గనైజేషన్ భగవాన్ మహావీర్ విక్లాంగ్ సహాయతా సమితి-BMVSS చేస్తున్న పనిని ఆయన ప్రస్తావించారు.
"శ్రీలంక నుండి ఆఫ్ఘనిస్తాన్ వరకు, ఆఫ్రికా మారుమూల ప్రదేశాల దాకా జైపూర్ ఫుట్ ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగు వ్యాపించేలా చేయడం మాకు చాలా గర్వకారణం" అని రాజస్థాన్ దివస్‌ను తొలిసారిగా అమెరికాలో జరుపుకోవడం గర్వించదగ్గ విషయమని భండారీ అన్నారు. శ్రీలంకలో నిర్వహించిన జైపూర్ ఫుట్ కృత్రిమ అవయవాల శిబిరం విజయవంతంగా పూర్తి కావడంతో ఈ వేడుకను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
శిబిరాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, విదేశాంగ మంత్రిత్వ శాఖకు, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లాకు కృతజ్ఞతలు తెలిపారు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' - భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వారం రోజుల పాటు జరుపుకునే వేడుకల్లో భాగంగా లింబ్ ఫిట్‌మెంట్ క్యాంపును ప్రారంభించారు. ఇండియా ఫర్ హ్యుమానిటీ చొరవ కింద విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖచే స్పాన్సర్ చేయబడిన దాదాపు 14 దేశాలలో ఇది ఇప్పటివరకు జరిగిన 18వ శిబిరం. ఈ ఏడాది ఏప్రిల్‌లో బాబా సాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా జోధ్‌పూర్‌లోని ఖిచాన్ గ్రామంలో జైపూర్ ఫుట్ క్యాంప్ నిర్వహించనున్నట్లు భండారీ తెలిపారు.