
Russia Ukraine War: రష్యాతో ఉక్రెయిన్ శాంతి చర్చలు జరుపుతునే ఉంది. అయినా.. ఉక్రెయిన్ నగరాలపై రష్యా బాంబుల దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో రష్యాపై ఈయూ దేశాలు మళ్లీ సరికొత్త ఆంక్షలను విధించాయి. రష్యా ఆర్థిక వ్యవస్థపై దెబ్బకొట్టేలా.. యూరోపియన్ యూనియన్ దేశాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఇకపై రష్యా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుపై ఈయూ దేశాలు నిషేధం విధించనున్నాయి. అలాగే.. అన్ని యూరోపియన్ ఓడరేవుల నుండి దేశం యొక్క నౌకలను నిరోధించాలని నూతన ప్రతిపాదనను తీసుకవచ్చాయి. ఈ ప్రతిపాదనను కూటమిలోని 27 సభ్య దేశాలు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి.
బుచా వేదికగా రష్యా సైనికులు మరణాహోమాన్ని సృష్టించాయనీ, అత్యంత క్రూరంగా వ్యవహరించారని, ఈ చర్యలకు నిరసనగా రష్యాపై ఒత్తిడి తెచ్చే విధంగా ఈ ఆంక్షలను తీసుకు వచ్చినట్లు ఈయూ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్‌డేర్ లేయన్ తెలిపారు. ఈ ఆంక్షలలో 4 బిలియన్ యూరోల బొగ్గుతో పాటు మరిన్ని ఉత్పత్తులు ఉన్నాయి. యూరప్ ఆర్థిక మాంద్యం భారిన పడుతుందని రష్యా ఇంధన వనరులపై ఆంక్షలను విధించే సాహసం ఇప్పటివరకు ఈయూ దేశాలు చేయలేదు. కానీ ప్రస్తుత నిర్ణయం ఓ కీలక పరిణామం.
ఈ నిర్ణయంపై ఈయూ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్‌డేర్ లేయన్ మాట్లాడుతూ.. ఈ కీలక నిర్ణయం యూరప్‌కు ఒక్కదానికే కాదనీ, ప్రపంచం మొత్తం క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రష్యా యుద్ధంపై, యుద్ధంలో అమాయకపు పౌరుల ఊచకోత, ప్రపంచ ప్రాథమిక విధానాల ఉల్లంఘనకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
అలాగే.. రష్యాకు చెందిన మరో నాలుగు బ్యాంకులు, మరికొంత మంది రష్యా వ్యక్తులపై కూడా ఆంక్షలు కొనసాగుతాయి. ప్రధానంగా ఈ నాలుగు బ్యాంకులపై నిషేధం విధించడంతో రష్యా ఫైనాన్సియల్ సెక్టార్లో 23 శాతం మార్కెట్ నుంచి దూరంగా ఉండాల్సి ఉంటుంది.
అలాగే.. రష్యా ఓడరేవులు, ఓడలపై కూడా ఈయూ దేశాలు నిషేధం విధించాయి. అయితే.. వ్యవసాయ, నిత్యావసర వస్తువులపై మినహాయింపు ఇచ్చాయి. 10 మిలియన్ యూరోల విలువ కలిగిన సెమీ కండక్టర్లు, మెషినరీలు, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులపై నిషేధం కొనసాగుతుందని ఉర్సులా వాన్‌డేర్ లేయన్ చెప్పారు.
ఇదే సందర్బంలో ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర తరువాత .. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వేదికపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడారు. రష్యా బలగాలు.. ఉక్రెయిన్ సర్వనాశనం చేశాయనీ, వారి దాష్టీకాలను తమ దేశం వేదికగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారాలను పాల్పడ్డారనీ, వారిని అత్యంత దారుణంగా చంపేశారని ఆరోపించారు.
బుచా వేదికగా రష్యా సైనికులు మరణాహోమాన్ని సృష్టించారనీ, అత్యంత క్రూరంగా వ్యవహరించారని మండిపడ్డారు. రష్యాను అంతర్జాతీయ న్యాయస్థానానికి ఈడ్చుకురావాలని జెలెన్‌స్కీ పరోక్షంగా పుతిన్‌పై విరుచుకుపడ్డారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నుంచి రష్యాను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉక్రెయిన్ ప్రజలను బానిసలుగా మార్చేందుకు రష్యా ప్రయత్నిస్తోందని జెలెన్స్కీ పేర్కొన్నారు.