
వాషింగ్టన్: ఆఫ్ఘనిస్తాన్ నుండి బలగాల ఉపసంహరణను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమర్ధించుకొన్నారు.అమెరికా బలగాలను ఆఫ్గాన్ నుండి ఉపసంహరించుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో సోమవారం నాడు అమెరికా ప్రజలనుద్దేశించి బైడెన్ ప్రసంగించారు.
also read:తాలిబన్లు బానిస సంకెళ్లు తెంచారు: పాక్ ప్రధాని ఇమ్రాన్
ఆఫ్ఘనిస్తాన్ నుండి సైన్యం ఉపసంహరించుకోవాలనే నిర్ణయాన్ని ఆయన సమర్ధించుకొన్నారు. 20 ఏళ్ల తర్వాత కూడా ఆప్ఘనిస్తాన్ నుండి సైనిక బలగాలను ఉపసంహరించుకొనేందుకు సరైన సమయం లేదని తాను గ్రహించానని ఆయన చెప్పారు.
9/11 తర్వాత ఆల్‌ఖైదా ఉగ్రవాదుల లింకుల కోసం తాలిబాన్లను శిక్షించేందుకు గాను అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పై యుద్దానికి సిద్దమైంది.తాము అనుకొన్నదానికంటే ముందే ఆఫ్గన్ ప్రభుత్వాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకొన్నారని ఆయన చెప్పారు.
రానున్న రోజుల్లో అమెరికా సైనికులతో పనిచేసిన వేలాది మంది అమెరికా పౌరులు ఆఫ్ఘనిస్తాన్ నుండి ఖాళీ చేస్తారని ఆయన తెలిపారు. ఈ సమయంలో తమపై దాడి చేస్తే తీవ్రమైన సైనిక ప్రతిస్పందనను ఎదుర్కోవాల్సి వస్తోందని బైడెన్ హెచ్చరించారు.
ఈ ఏడాది అమెరికా దళాలను ఆఫ్ఘాన్ నుండి రప్పించడమో లేదా అదనపు బలగాలను అక్కడికి పంపి యుద్దాన్ని మూడో దశాబ్దంలో కూడ కొనసాగించడమే తన ముందున్న కర్తవ్యాలన్నారు. అయితే తాను సైనిక బలగాలను వెనక్కి రప్పించేందుకే కట్టుబడి ఉన్నట్టుగా ఆయన తెలిపారు.అంతర్యుద్దంలో తాలిబన్లతో ఆ దేశ సైనికులు పోరాటం చేయడం లేదన్నారు. ఇంకెంతకాలం అమెరికా సైన్యాన్ని ఆఫ్ఘానిస్తాన్ కు పంపాలని బైడెన్ ప్రశ్నించారు.
ఆష్ఘనిస్తాన్ పై అమెరికా చేస్తున్న యుద్దంలో తాను నాలుగో అధ్యక్షుడినని ఆయన చెప్పారు. సైనిక బలగాలను ఉపసంహరించుకొనే ప్రక్రియను ఐదో అధ్యక్షుడికి పంపాలనుకోలేదన్నారు.ఆఫ్ఘానిస్తాన్ నుండి సైనిక బలగాలను ఉపసంహరించుకొన్నా కూడ తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతాయని ఆయన తేల్చి చెప్పారు.