నూతన వధువులకు షాకింగ్ న్యూస్.. ఇప్పుడే గర్భం దాల్చవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి

By telugu teamFirst Published Sep 10, 2021, 7:25 PM IST
Highlights

డెల్టా వేరియంట్ విజృంభణతో అక్కడ చాలా మంది గర్భిణులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ప్రభుత్వం కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు, సంతానం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఓ సూచన చేసింది. కరోనా కల్లోల పరిస్థితులున్నందున గర్భం దాల్చాలనే నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని మహిళలకు శ్రీలంక విజ్ఞప్తి చేసింది.
 

కొలంబో: కరోనా మహమ్మారితో ప్రజల జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. భవిష్యత్‌కు సంబంధించిన ఎన్నో నిర్ణయాలు వాయిదా వేయాల్సి వచ్చింది. ఉద్యోగ జీవితాలే కాదు.. వైవాహిక జీవితాలనూ ప్రారంభించడానికి కరోనా అడ్డుకట్ట వేసింది. ఆంక్షల మధ్య పెళ్లిల్లు జరుగుతున్నా.. తాజాగా ఇప్పుడే గర్భం దాల్చవద్దని శ్రీలంక ప్రభుత్వం మహిళలను అభ్యర్థించింది.

నాలుగు నెలల్లోనే తల్లులు కావాల్సిన 40 మంది గర్భిణులు కరోనాకు బలయ్యారని శ్రీలంక ఆరోగ్య శాఖ పేర్కొంది. అందుకే కొత్తగా పెళ్లి చేసుకున్నవారు లేదా పిల్లల కోసం ప్రయత్నిస్తున్నవారు ఆ నిర్ణయాన్ని కొంత కాలం వాయిదా వేసుకోవాలని సూచించింది. మే నెలలో కరోనాతో తొలి సారి ఓ గర్భిణి మరణించారు.

సాధారణంగా దేశంలో ఏడాదికి 90 నుంచి 100 మంది గర్భిణుల మరణాలు రిపోర్ట్ అవుతాయని ప్రభుత్వ హెల్త్ ప్రమోషన్ బ్యూరో డైరెక్టర్ చిత్రమాలి డిసిల్వా తెలిపారు. కానీ, థర్డ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికి కేవలం కరోనాతోనే 41 మంది గర్భిణులు మరణించారని వివరించారు.

ప్రభుత్వ గైనకాలజిస్టు డాక్టర్ హర్ష ఆటపట్టు ఈ విషయంపై స్పందిస్తూ కొత్తగా పెళ్లి చేసుకున్నవారు, సంతాన సాఫల్యం కోసం ప్రయత్నిస్తున్నవారు తమ నిర్ణయాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. కనీసం ఓ ఏడాది కాలంపాటైనా పిల్లలను కనాలనే కోరికను వాయిదా వేసుకోవాలని తెలిపారు.

ఇప్పటికి సుమారు 5,500 మంది గర్భిణులు కరోనా బారినపడ్డారని డిసిల్వా వివరించారు. సుమారు 70శాతం రెండు డోసుల టీకా వేసుకున్నారని తెలిపారు.

గర్భిణులు టీకా వేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. డెల్టా వేరియంట్ మరింత తీవ్ర లక్షణాలు కలిగించవచ్చునని శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. శ్రీలంక దేశవ్యాప్తంగా ఇప్పుడు పాక్షిక లాక్‌డౌన్ అమలవుతున్నది.

click me!