
న్యూఢిల్లీ: శ్రీలంక దేశం స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి ఎప్పుడూ చూడని అత్యంత దుర్భర క్షణాలను నేడు ఎదుర్కొంటున్నది. 70 ఏళ్లలో దారుణ ఆర్థిక సంక్షోభం ఈ దేశంలో నెలకొంది. ప్రభుత్వాలు తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో దేశ ప్రజలు క్షోభ అనుభవిస్తున్నారు. వారి ఆగ్రహావేశాలు చూసిన దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం వదిలి మాల్దీవులకు పారిపోయారు. ఆ తర్వాత తన అధ్యక్ష పదవికి రాజీనామా ప్రకటించారు. కాగా, ప్రధానమంత్రి రానిల్ విక్రమ్ సింఘే దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు.
దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని కొలంబో మాత్రం నిరసనలకు కేంద్రంగా మారిపోయింది. అధ్యక్ష భవనాన్నీ ప్రజలు కైవసం చేసుకున్నారు. స్విమ్మింగ్ పూల్, రూమ్‌లు, ఇతర అన్ని చోట్లనూ వారు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. కొందరు ఈ భవన ముట్టడిని నిరసనగా చూస్తుంటే.. ఇంకొందరు ఈ భవనాన్ని టూరిస్టు డెస్టినేషన్‌గా ఎంజాయ్ చేస్తున్నారు.
దేశంలో ఇంత జరుగుతుంటే ఓ యువతి మాత్రం తనదైన తరహాలో ఎంజాయ్ చేస్తూ తన ట్రిప్ చేపట్టింది. మదుహంసి హసింతర అనే యువతి హ్యాండ్ బ్యాగ్‌తో ప్రెసిడెంట్ రెసిడెన్స్‌లో ఫొటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేసింది. అధ్యక్ష భవనంలోని కారు ముందు నిలబడి, భవనం ముందు ఉన్న మైదానంలో, భవనంలోపల సోఫా సెట్, కుర్చీల్లో కూర్చుని ఆమె ఫొటోలు తీసుకుంది. వాటిని ఫేస్‌బుక్‌లో స్వయంగా షేర్ చేసుకుంది. మొత్తంగా దేశమంతా ఆందోళనల్లో మునిగి పోయి ఉంటే.. ఆ యువతి మాత్రం ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌ను ఒక టూరిస్ట్ స్పాట్‌గా ఎంజాయ్ చేసింది.
మొత్తం ఆమె 26 ఫొటోలను ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. జులై 12వ తేదీన ఆమె పోస్టు చేసిన ఈ ఫొటోలు ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారాయి. వేలాది మంది ఆ ఫొటోలపై లుక్ వేశారు. ఇంకొందరైతే.. కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దేశమంతా తగలబడి పోతుంటే.. ఈమె ఫొటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నదా? అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకొందరు దేశ ప్రజల నిరసనలను తగ్గిస్తూ ఆమె ప్రచారం చేస్తున్నట్టుగా ఉన్నదని వివరించారు.
అసలు నీవు దేశానికి కొత్త అధ్యక్షురాలిగా కావాలి అని ఒక యూజర్ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. శ్రీలంకలో మరో కొత్త టూరిస్ట్ డెస్టినేషన్ అంటూ ఇంకొకరు కామెంట్ చేశారు. దేశాన్ని ఆమె తప్పుగా రిప్రజెంట్ చేస్తున్నదని మరొకరు ఫైర్ అయ్యారు.
ఆ యువతి ఫొటోలను స్వల్ప సమయంలోనే 21 వేల మంది లైక్ చేయగా.. సుమారు 1700 మంది కామెంట్లు చేశారు. అలాగే దాదాపు 9100 మంది షేర్ చేశారు.