Sri Lanka crisis: మాల్దీవుల నుంచి సింగపూర్‌కు గోటబయ రాజపక్స.. అందుకేనా..?

Published : Jul 14, 2022, 04:01 PM IST
Sri Lanka crisis: మాల్దీవుల నుంచి సింగపూర్‌కు గోటబయ రాజపక్స.. అందుకేనా..?

సారాంశం

శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి మాల్దీవులు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడి నుంచి ఆయన సింగపూర్ బయలుదేరారు. 

శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి పారిపోవడంతో అక్కడ నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే శ్రీలంక నుంచి గోటబయ రాజపక్స మాల్దీవులు చేరుకన్న విషయ తెలియడంతో అక్కడ నివాసం ఉంటున్న శ్రీలంక వాసులు ఆందోళన నిర్వహించారు. మాల్దీవుల రాజధాని Maleలో శ్రీలంక జాతీయులు.. గోటబయకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. దయచేసి క్రిమినల్స్‌కు రక్షణ కల్పించవద్దని కోరారు. 

ఈ క్రమంలోనే మాల్దీవుల్లో ఉండటం సురక్షితం కాదని గోటబయ రాజపక్స భావించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయన సింగపూర్ బయలుదేరి వెళ్లారు. గోటబయ రాజపక్స, అతని భార్య సౌదియా ఎయిర్‌లైన్స్ SV788 విమానంలో మాలే నుంచి సింగపూర్‌కు బయలుదేరినట్టుగా మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఈరోజు సాయంత్రం 7 గంటలకు వారు సింగపూర్ చేరుకుంటారని తెలుస్తోంది. గోటబయ రాజపక్స ప్రస్తుతానికి సింగపూర్‌లోనే ఉంటారని శ్రీలంక ప్రభుత్వ వర్గాల సమాచారం. 

అయితే బుధవారం రాజీనామా చేయనున్నట్టుగా గోటబయ రాజపక్స హామీ ఇచ్చినప్పటికీ.. అతని నుంచి ఇప్పటివరకు రాజీనామా లేఖ అందలేదని శ్రీలంక పార్లమెంటు స్పీకర్ యాపా అబేవర్ధనా తెలిపారు. అయితే తాను రక్షిత స్థావరానికి చేరేవరకు రాజీనామా చేయకూడదనే ఆలోచనలో గోటబయ రాజపక్సే ఉన్నట్టుగా నివేదికలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీలంక అధ్యక్ష హోదాలో అతడు ప్రభుత్వం నుంచి తన ప్రయాణానికి సంబంధించి కొన్ని డిమాండ్స్ ఉంచాడనే వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇక, గోటబయ రాజీనామా చేసి తీరాలని శ్రీలంకలో ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఆందోళనకారులు ప్రధాన మంత్రి కార్యాలయంలోకి చొరబడ్డారు. ఆ భవనంపైన జెండాను ఎగరవేశారు. కొలంబోలో ఆందోళనకు తీవ్రరూపం దాల్చడంతో.. వాటిని అదుపు చేసేందుకు పోలీసు బాష్ప వాయువు ప్రయోగించారు. ఈ క్రమంలోనే శ్వాస తీసుకోవడంతో ఇబ్బందితో 26 ఏళ్ల వ్యక్తి మరణించినట్టుగా బీబీసీ రిపోర్ట్ చేసింది. ఇంకా వందల సంఖ్యలో నిరసనకారులు గాయపడ్డారు. 

మరోవైపు దేశంలో కొనసాగుతున్న ఆందోళనలను అదుపు చేయడానికి.. తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని రణిల్ విక్రమసింఘే సైన్యం, పోలీసులకు కీలక ఆదేశాలు జారీచేశారు. శాంతిభద్రతలను పునరుద్దరించడానికి అవసరమైనది చేయాలని ఆదేశించారు. 

PREV
click me!

Recommended Stories

Petrol Price: రూపాయికే లీట‌ర్ పెట్రోల్‌.. ఇంత త‌క్కువ ధ‌ర‌కు కార‌ణం ఏంటో తెలుసా.?
Gold Price: వెనిజులాలో బంగారం ధ‌ర ఎంతో తెలిస్తే.. వెంట‌నే ఫ్లైట్ ఎక్కేస్తారు..