Sri Lanka Crisis: శ్రీలంకలో ఎమర్జెన్సీ.. గోటబయ పరారీతో నిరసనలు ఉధృతం.. అదుపు తప్పుతున్న పరిస్థితులు

Published : Jul 13, 2022, 12:03 PM ISTUpdated : Jul 13, 2022, 12:51 PM IST
Sri Lanka Crisis: శ్రీలంకలో ఎమర్జెన్సీ.. గోటబయ పరారీతో నిరసనలు ఉధృతం.. అదుపు తప్పుతున్న పరిస్థితులు

సారాంశం

శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి పరారు కావడంతో అక్కడి ప్రజలు నిరసనలను మరింత ఉధృతం చేశారు. ఒక్కసారిగా రోడ్లపై వచ్చిన వేలాది మంది ప్రజలు రాజధాని కొలంబోలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి పరారు కావడంతో అక్కడి ప్రజలు నిరసనలను మరింత ఉధృతం చేశారు. ఒక్కసారిగా రోడ్లపై వచ్చిన వేలాది మంది ప్రజలు రాజధాని కొలంబోలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే నిరసనకారులను అదుపు చేసేందుకు సైనిక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. కొలంబోలోని శ్రీలంక ప్రధాని నివాసంలోకి వెళ్లేందుకు గోడను ఎక్కిన నిరసనకారులను చెదరగొట్టేందుకు సైనిక సిబ్బంది టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. దీంతో పరిస్థితులు అదుపు తప్పేలా కనిపిస్తున్నాయి. 

మరోవైపు అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయిన తర్వాత శ్రీలంక అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ మేరకు శ్రీలంక ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఉటంకిస్తూ AFP వార్త సంస్థ రిపోర్ట్ చేసింది. ఇదిలా ఉంటే శ్రీలంకలోని నిరసనకారులు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాము ఎట్టిపరిస్థితుల్లోనూ పార్లమెంట్ భవనాన్ని ముట్టడించి తీరుతామని చెబుతున్నారు. 

ఓ నిరసనకారుడు ఏషియానెట్ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఈరోజు గోటబయ రాజీనామా కోసం ఎదురు చూస్తున్నాం. మేము చాలా కష్టాలు అనుభవిస్తున్నాం. ఈరోజు గోటబయ కచ్చితంగా రాజీనామా చేయాలి. లేకుంటే ఈ నిరసన ఆగదు. నిరసన నేటితో 96వ రోజుకు చేరింది.  ఇంటికి వెళ్లడానికి పెట్రోలు దొరక్క ఇక్కడే ఉండిపోయాం. ఇక్కడే తింటున్నాం, నిద్రపోతున్నాం. మూడు నెలలుగా మా పేరెంట్స్‌ను చూడలేదు. వారు ఇక్కడికి దూరంగా ఉన్నారు. మా దేశంలోనే ఉండలేని పరిస్థితిలో ఉన్నాం. మా దేశం కావాలి. ఆయన (గోటబయ) రాజీనామా చేయకపోతే.. మేము పార్లమెంటుకు వెళ్లి దానిని కూడా ఆక్రమిస్తాం’’ అని చెప్పారు.

Also Read: గోటబయ రాజపక్స మాల్దీవులు వెళ్లేందుకు భారత్ సాయం చేసిందనే ప్రచారం.. భారత్ రియాక్షన్ ఇదే..

ఇక, శ్రీలంక స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి ఎన్నడూ లేనంతగా అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది మే నెలలో మహింద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక, జూలై 9న అధ్యక్ష భవన్‌లోకి వేలాది మంది ప్రజలు దూసుకు వచ్చారు. ఈ క్రమంలోనే మూడు రోజుల పాటు శ్రీలంకలోనే తలదాల్చుకున్న అధ్యక్షుడు గోటబయ రాజపక్స.. ఎట్టకేలకు దేశం విడిచి పారిపోయారు. 

ఇక, జూలై 20న పార్లమెంటులో ఓటింగ్ ద్వారా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని రాజకీయ పార్టీల నేతలు నిర్ణయించుకున్నట్లు శ్రీలంక పార్లమెంట్ స్పీకర్ మహింద యాపా అబేవర్దన తెలిపారు. జూలై 20న పార్లమెంటు ద్వారా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే ఈరోజు తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూలై 19న అధ్యక్ష పదవికి నామినేషన్లు కోరనున్నారు. 

PREV
click me!

Recommended Stories

20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..
India Oman: మోదీ మాస్ట‌ర్ ప్లాన్, ఒమాన్‌తో కీల‌క ఒప్పందం.. దీంతో మ‌న‌కు లాభం ఏంటంటే..