
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు దయానీయంగా మారుతున్నాయి. తాజాగా శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. శ్రీలంక ప్రభుత్వ ఆధీనంలోని సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్.. ఒక్క రోజే లీటర్ పెట్రోల్ ధరను భారీగా పెంచింది. అక్కడి కరెన్సీ(LKR) ప్రకారం.. 92 octane petrol లీటర్ ధర రూ. 84 పెరగడంతో.. కొత్త ధర రూ. 338కి చేరింది. 95 ఆక్టేన్ పెట్రోల్ లీటర్ ధర రూ. 95 పెరగడంతో.. కొత్త ధర రూ. 373కి చేరింది. సూపర్ డీజిల్ లీటర్ ధర రూ. 75 పెరగడంతో.. కొత్త ధర రూ. 329కి చేరింది. ఆటో డీజిల్ లీటర్ ధర రూ. 113 పెరగడంతో.. కొత్త ధర రూ. 289కి చేరింది.
ఈ పెరిగిన ధరలు సోమవారం అర్దరాత్రి నుంచే అమల్లోకి వచ్చినట్టుగా సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ (CPC) ప్రకటించింది. అంతర్జాతీయ చమురు ధరలు పెరగడం, డాలర్‌తో పోలిస్తే శ్రీలంక రూపాయి క్షీణత పెట్రోల్ ధరల పెంపుకు ప్రధాన కారణమని సీపీసీ అధికారులు తెలిపారు. ఇక, కార్లు, మూడు చక్రాల వాహనాలు, మోటార్ సైకిళ్లు, వ్యాన్‌లు, ఎస్‌యూవీలపై విధించిన ఇంధన పరిమితులను సోమవారం (ఏప్రిల్ 18) నుంచి ఎత్తివేశారు.
ఇక, సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ కొత్త ధరలు.. ప్రస్తుతం ఇండియన్ అయిల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ లంక ఇండియన్ అయిల్ కంపెనీ (LIOC) ధరలు దాదాపు ఒకేలా ఉన్నాయి. సీపీసీ ఇంధన ధరలు పెంచడం ఈ నెలలో ఇది రెండోవది. మరోవైపు నిన్న ఎల్ఐఓసీ కూడా ధరలను పెంచింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభవంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న లంక ప్రజలపై ఇది మరింత భారాన్ని మోపనుంది.
ఇక, శ్రీలంకకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత తీవ్రమైన సంక్షోభం రావడం ఇదే మొదటిసారి. కొంతవరకు విదేశీ కరెన్సీ కొరత కారణంగా ఈ సంక్షోభం ఏర్పడింది. అంటే.. ప్రధాన ఆహారాలు, ఇంధనం దిగుమతుల కోసం చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో దేశంలో నిత్యావసరాల కొరత, ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. జీవన వ్యయం విపరీతంగా పెరగడంతో మార్చి 7 నుంచి శ్రీలంక రూపాయి 60 శాతానికి పైగా పడిపోయింది.
ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో.. దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్సకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనలు చేపట్టారు. రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. దేశ ఆర్థిక సంక్షోభం కారణంగా రాజపక్స, అతని కుటుంబ సభ్యులు రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇక, సాంప్రదాయ సింహళ, తమిళ కొత్త సంవత్సరం కారణంగా వీకెండ్‌లో విద్యుత్ కోతలు విధించలేదు. అయితే సోమవారం నుంచి విద్యుత్ కోతలు తిరిగి ప్రారంభం కావడంతో.. ప్రజలు ఇంధనం, గ్యాస్ కోసం పెద్ద ఎత్తున క్యూలు కట్టారు.