ఇప్పటికే చైనాలో డేంజర్ బెల్స్: అమెరికాలో ఎంటరైన బుబోనిక్ ప్లేగు, తొలి కేసు నమోదు

By Siva KodatiFirst Published Jul 15, 2020, 3:19 PM IST
Highlights

గతేడాది చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. దీనికే ఇంత వరకు వ్యాక్సిన్ రాలేదు. ఇదిలావుండగానే చైనాలో బుబోనిక్ ప్లేగు మరోసారి మొదలైన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాలోనూ ఈ వ్యాధి వెలుగుచూసింది. 

గతేడాది చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. దీనికే ఇంత వరకు వ్యాక్సిన్ రాలేదు. ఇదిలావుండగానే చైనాలో బుబోనిక్ ప్లేగు మరోసారి మొదలైన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాలోనూ ఈ వ్యాధి వెలుగుచూసింది.

కొలరాడోలోని ఓ ఉడుతకు బుబోనిక్ ప్లేగు పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇది అరుదైనదే అయినా ఈగల ద్వారా వ్యాప్తి చెందే ఈ బ్యాక్టీరియా అత్యంత ప్రమాదకరమైనదని వైద్య నిపుణులు అంటున్నారు.

మోరిసన్ నగరంలోని ఓ ఉడుతకు జూలై 11న ఈ బుబోనిక్ ప్లేగు నిర్థారణ అయినట్లు జఫర్సన్ కంట్రీ పబ్లిక్ హెల్త్ విభాగం వెల్లడించినట్లు సీఎన్ఎన్ కథనాన్ని ప్రచురించింది. కాగా మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకర వ్యాధిగా ఈ ప్లేగును ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.

జస్టీనియన్ ప్లేగుకు కారణమైన యెర్సీనియో‌ పెస్టిస్ బ్యాక్టీరియా 800 ఏళ్ల తర్వాత రూపాంతరం చెంది బుబోనిక్ ప్లేగుగా విరుచుకుపడింది. బ్లాక్‌డెత్‌గా పిలిచే ఈ వ్యాధి 14వ శతాబ్ధంలో యూరప్, ఆసియా, ఆఫ్రికాలను వణికించింది.

అప్పట్లోనే ఈ బుబోనిక్ ప్లేగు కారణంగా 5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోగా.. ఒక్క ఐరోపాలోనే 25 నుంచి 60 శాతం మరణాలు చోటు చేసుకున్నాయంటే దీని తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

సరైన జాగ్రత్తలు  పాటించకపోతే జంతువుల నుంచి ఈ వ్యాధి మనుషులకు వ్యాపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యాంటీ బయోటిక్స్‌తో త్వరగా చికిత్స చేస్తే మరణాన్ని నివారించవచ్చని చెబుతున్నారు.

గజ్జలు, చంకలు, మెడపై కోడి గుడ్ల మాదిరిగా శోషరస కణుపులు పెరగడం ఈ బుబోనిక్ ప్లేగు ప్రధాన లక్షణం. మరికొందరిలో జ్వరం, చలి, తలనొప్పి, అలసట, కండరాల నొప్పులు తదితర లక్షణాలు కనిపిస్తాయి.

మరోవైపు ఇన్నర్ మంగోలియా అటానమస్ రీజియన్‌లోని బైయన్నూరు ప్రాంతంలో బుబోనిక్ వ్యాధి ఇద్దరికి నిర్థారణ కాగా.. వీరిని వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స అందజేస్తున్నట్లు చైనా జూలై 7న ప్రకటించింది. అలాగే వీరితో కాంటాక్ట్ అయిన 146 మందిని క్వారంటైన్ చేశామని వెల్లడించింది.

కాగా, మరోసారి ప్లేగు వ్యాధి వ్యాపిస్తోందని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అధికారికంగా ఏటా 1,000 నుంచి 2 వేల కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. అమెరికాలో ఏటా కొద్ది సంఖ్యలో ప్లేగు కేసులు నమోదవుతున్నాయి. 2015లో కొలరాడోలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 

click me!