
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాలో ఓ అవాంఛనీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి సుమారు వేయి కుక్కలను ఆకలికి వదిలిపెట్టాడు. నిర్బంధించాడు. ఆ కుక్కలు ఆకలికి తాళలేక ప్రాణాలు విడిచిపెట్టాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేసి జంతువులపై దాష్టీకాన్ని దర్యాప్తు చేస్తున్నాయి. నిందితుడు నేరాన్ని అంగీకరించాడని, వదిలిపెట్టిన కుక్కలను తీసుకెళ్లి ఆహారం పెట్టకుండా చనిపోయే వరకు నిర్బంధించినట్టు తెలిపాడని అధికారులు వెల్లడించారు.
యానిమల్ రైట్స్ యాక్టివిస్టు ఈ ఘటనపై మాట్లాడారు. డాగ్ బ్రీడర్లు వాటిని వదిలించుకోవాలని ఈ వ్యక్తికి అప్పగించినట్టు తెలిపారు. ఆ కుక్కలు పునరుత్పత్తి వయసును దాటేశాయని, వ్యాపారంగానూ వాటితో గిట్టుబాటు కాని దశకు వచ్చిన తర్వాత కుక్కలను ఈ వ్యక్తికి అప్పగించాయని వివరించారు. 2020 నుంచి ఈ కుక్కలను ఆ వ్యక్తికి అప్పగించి సంరక్షించడానికి ఒక్క కుక్కకు 10 వేల వొన్‌ల చొప్పున చెల్లించినట్టు పేర్కొన్నారు. కానీ, ఆ వ్యక్తి కుక్కలను తీసుకుని నిర్బంధించి ఆహారం పెట్టకుండా చంపేశాడని తెలిపారు. ఈ ఘటన గ్యాంగే ప్రావిన్స్‌లోని యాంగ్‌పియాంగ్‌లో చోటుచేసుకున్నది.
ఓ స్థానికుడు తన కుక్క తప్పిపోవడంతో దాని కోసం వెతుకుతుండగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ కుక్కల కళేబరాలు ఒక పొరగా మారిపోయాయని కథనాలు తెలిపాయి. ఆ లేయర్ పైనే మరో వరుసగా ఇంకొన్ని కుక్కల కళేబరాలను ఉంచాడు. ఆహారం లేక ఆకలితో అల్లాడిపోతున్న కుక్కలను బోనులు, సంచులు, రబ్బర్ బాక్సుల్లో ఉంచాడు.
Also Read: సిమ్లాలో 200 మీటర్ల లోతైన లోయలో పడిన కారు.. నలుగురు దుర్మరణం.. మృతుల్లో ఆర్మీ జవాన్..
ఈ వారంలో అక్కడ మరణించిన కుక్కలను తొలగిస్తామని స్థానిక ప్రభుత్వం తెలిపింది. నాలుగు కుక్కలను ప్రాణాలతో కాపాడగలిగారు. వాటికి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారని సౌత్ చైనా మార్నింగ్ పోస్టు పేర్కొంది.
దక్షిణ కొరియాలో జంతు సంరక్షణ కోసం కఠిన చట్టాలు ఉన్నాయి. జంతువులకు ఉద్దేశపూర్వకంగా ఆహారం పెట్టకున్నా.. నీరు అందించకున్నా వారికి మూడేళ్లపాటు జైలు శిక్ష లేదా 3 కోట్ల వొన్‌ల జరిమానాను విధిస్తున్నది.