Omicron: ఒమిక్రాన్ వేరియంట్ గురించి ఆ డాక్టర్ చెప్పే మాటలు నిజమైతే ప్రపంచానికి గుడ్‌ న్యూసే..

By team telugu  |  First Published Nov 29, 2021, 2:12 PM IST

కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) పేరు వింటేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అయితే దక్షిణాఫ్రికాకు చెందిన ఓ డాక్టర్ చెబుతున్న మాటలు కొద్దిగా ధైర్యం తెచ్చేలా ఉన్నాయి. 


కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) పేరు వింటేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. చాలా దేశాలు ఈ భయంతో అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధాలు విధిస్తున్నాయి. కొన్ని దేశాలు అయితే లాక్‌డౌన్‌లు విధించేందుకు సిద్దమవుతున్నాయి. అయితే ఒమిక్రాన్‌కు సంబంధించి అన్ని చెడు వార్తలే కాకపోవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తొలుత దక్షిణాఫ్రికాలో (South Africa)  గుర్తించిన ఈ వేరియంట్‌కు సంబంధించిన కేసులలో చాలా తేలికపాటి లక్షణాలు ఉన్నట్టుగా నివేదికలు వెలువడుతున్నాయి. 

అయితే కరోనా విజృంభణ తర్వాత.. డెల్టా మ్యూటేషన్ (Delta mutation) జనాలను తీవ్ర భయాందోళనలకు గురిచేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా పెద్ద సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతానికి ఆ కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే ప్రాణాంతకమైన డెల్టా మ్యుటేషన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల ప్రమాదం తగ్గుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. 

Latest Videos

undefined

Also read: Omicron: డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ ప్రమాదకరమా?.. అసలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతుందంటే..

దక్షిణాఫ్రికాలో తొలుత పేషెంట్లలో కొత్త వేరియంట్‌ను అనుమానించిన వారిలో ఒకరైన దక్షిణాఫ్రికా డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ Dr. Angelique Coetzee మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఇంట్లోనే చికిత్స చేయవచ్చని తెలిపారు. ఆమె రాయిటర్స్ వార్త సంస్థతో మాట్లాడుతూ..  తన క్లినిక్‌లో డెల్టా వేరియంట్‌కు భిన్నమైన లక్షణాలను కలిగి ఉన్న ఏడుగురు రోగులను గమనించినట్లు చెప్పారు. అయితే అవి చాలా తేలికపాటి లక్షణాలు అని చెప్పారు.

వ్యాక్సిన్‌లపై మంత్రుల సలహా కమిటీలో సభ్యునిగా ఉన్న కోయెట్జీ మాట్లాడుతూ.. ఈ వేరియంట్ బారినపడ్డ వారు వాసన లేదా రుచి కోల్పోయినట్లు నివేదించలేదని తెలిపారు. కొత్త వేరియంట్‌తో ఆక్సిజన్ స్థాయిలలో పెద్దగా తగ్గుదల లేదని చెప్పారు. 

చాలా మంది రోగులో చాలా తేలికపాటి లక్షణాలను చూస్తున్నామని ఆమె చెప్పారు. ఇప్పటివరకు వారికి శస్త్రచికిత్స అవసరం పడలేది తెలిపారు. పేషెంట్లకు ఇంట్లోనే చికిత్స చేయగులుగుతున్నామని వెల్లడించారు. ఈ వేరియంట్ 40 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు గల వ్యక్తులను ప్రభావితం చేస్తున్నట్టుగా తాను ఇప్పటివరకు గమనించినట్టుగా పేర్కొన్నారు. తాను చికిత్స అందించిన.. ఒమిక్రాన్‌ లక్షణాలతో ఉన్నవారిలో దాదాపు సగం మందికి టీకాలు వేయించుకోని వారేనని అన్నారు. అయితే ఈ వేరియంట్ బారిన పడుతున్నవారిలో ఒకటి రెండు రోజులు తీవ్రమైన అలసట ఉంటుందని.. ఈ కారణంగా తలనొప్పి, ఒళ్లు నొప్పులు వస్తున్నయని తెలిపారు.

దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రాథమిక డేటా ఆధారంగా వైరాలజిస్ట్ మార్క్ వాన్ రాన్స్ట్ (Marc van Ranst) స్పందిస్తూ.. ఈ వారాంతంలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గమనిస్తే తక్కువ వ్యాధికారకమైనదిగా కనిపిస్తుందని అన్నారు. మరోవైపు డెల్టా కన్న వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోందన్నారు. అయితే ఇది చాలా సానుకూల అంశమని అభిప్రాయపడ్డారు. 

ఇక, డెల్టా, ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ మరింత వేగంగా వ్యాపిస్తుందా..? అనే అంశంపై ఇంకా స్పష్టత లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి ఆర్టీ పీసీఆర్ (RT-PCR) పరీక్షలు ఈ వేరియంట్‌ను గుర్తించగలవని పేర్కొంది. ఇదివరకు కరోనా వైరస్ సోకినవారికి కూడా ఒమిక్రాన్ సంక్రమించే అవకాశం ఉందని ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నాయని పేర్కొంది. ఇంతకుముందు కోవిడ్‌ బారిన పడినవారికి ఈ వేరియంట్ మరింత సులువుగా సంక్రమించవచ్చు. ఈ వేరియంట్‌ను డేంజరస్ కేటగిరీలో చేర్చింది.

click me!