
క్రిస్మస్ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో (Democratic Republic of Congo) జరిగిన ఆత్మహుతి దాడిలో (suicide bomb attack) ఆరుగురు మృతిచెందారు. మరో 13 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు తెలిపారు. కాంగోలోని బెని (Beni) నగరంలో రద్దీగా ఉండే రెస్టారెంట్ అండ్ బార్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. క్రిస్మస్ సందర్భంగా ప్రజలు రెస్టారెంట్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే బాంబర్ రెస్టారెంట్‌లోని ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే అతడు రెస్టారెంట్ ఎంట్రన్స్ వద్ద ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతనితో పాటు మరో ఐదుగురు మృతిచెందారు.
ఈ ఘటనతో జనాలు భయాందోళన చెందారు. ఘటన స్థలం నుంచి పరుగులు తీశారు. అయితే మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్టుగా స్థానిక అధికారులు తెలిపారు. గాయపడినవారిలో అధికారులు కూడా ఉన్నారని చెప్పారు. ఈ తీవ్రవాద దాడిపై విచారణ జరుపుతున్నట్టుగా అధికారులు తెలిపారు. ఇస్టామిక్ స్టేట్‌తో (Islamic State) సంబంధాలు కలిగి ఉన్న అలైడ్ డెమొక్రాటిక్ ఫోర్సెస్ (Allied Democratic Forces) హస్తం ఉన్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఈ దాడికి సబంధించి ఇప్పటివరకు ఏ ఉగ్రసంస్థ బాధ్యత వహించలేదు.
ఇక, బాంబు పేలుడు సంభవించినప్పుడు రెస్టారెంట్‌లో 30 మందికి పైగా ప్రజలు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారని సాక్ష్యులు తెలిపారు. ఒకేసారి పెద్ద శబ్దం వినిపించిందని, బయటకు వెళ్లి చూసేసరి దట్టమైన పొగ వ్యాప్తి చెంది ఉందని.. ప్రవేశ ద్వారం వద్ద కొందరు కిందపడిపోయి కనిపించారని ఓ మహిళ ది అసోసియేటేడ్ ప్రెస్‌కి తెలిపింది. ఈ ఘటన అనంతరం అప్రమత్తమైన అధికారులు.. ప్రజలు తమ తమ ఇళ్లకు తిరిగి వెళ్లాలని కోరారు. ప్రజలు ఒక్కచోట గుమిగూడవద్దని అధికారులు సూచించారు.
గత కొద్ది వారాలుగా బెనిలో సైన్యం, ఇస్లాంవాదుల మధ్య తరుచూ ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి దాడులకు ముగింపు పలికే ప్రయత్నంలో భాగంగా.. కాంగో, ఉగాండా దళాల ఏడీఎఫ్‌కు వ్యతిరేకంగా గత నెలలో జాయింట్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగాండా రాజధాని కంపాలాతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన వరుస దాడుల్లో ఏడీఎఫ్ హస్తం ఉందని అధికారులు చెబుతున్నారు.