
Russia Ukraine Crisis: ఉక్రెయిన్-రష్యా మధ్య (russia ukraine crisis) భీకర పోరు కొనసాగుతోంది. గత వారం రోజుల నుంచి ఇరు దేశాల బలగాలు హోరాహోరీ పోరు సాగిస్తున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని పలు కీలక నగరాలను రష్యా హస్తగతం చేసుకుంది. మిగితా నగరాలను కూడా ఆక్రమించడానికి రష్యా బలగాలు ప్రయత్నిస్తుండగా.. ఉక్రెయిన్ బలగాలు సైతం అదే స్థాయిలో దీటుగా ఎదురుదాడి చేస్తున్నారు. రెండు దేశాలను యుద్ధం నుంచి వెనక్కి రప్పించేందుకు గాను ప్రపంచదేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తనతో నేరుగా చర్చలు జరపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పిలుపునిచ్చారు. అప్పుడే ఈ యుద్ధం ఆగిపోవడానికి మార్గం దొరుకుతుందని జెలెన్స్కీ పేర్కొన్నారు. రెండో దశ చర్చల నేపథ్యంలో గురువారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉక్రెయిన్‌కు సైనిక సాయం అందించాలని పశ్చిమ దేశాలకు జెలెన్స్కీ పిలుపునిచ్చారు. సైన్యం అందించకపోతే.. రష్యా మిగిలిన ఐరోపా దేశాలపై దాడి చేస్తుందని అన్నారు. రష్యా వైమానిక దాడులను ఆపలేని పరిస్థితుల్లో ఉంటే.. తమ దేశానికి విమానాలు ఇవ్వండని జెలెన్స్కీ కోరారు. ఈ యుద్ధం ఉక్రెయిన్‌తోనే ఆగిపోదని.. తర్వాత పశ్చిమ దేశాలపైన లాత్వియా, లిథువేనియా, ఈస్టోనియాకు విస్తరిస్తోందన్నారు.
"మేము రష్యాపై దాడి చేయడం లేదు, అలాంటి ఆలోచన కూడా చేయడం లేదు. అలాంటప్పుడు మా నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు. వెంటనే మా భూభాగం నుంచి వెళ్లిపోండి అని వోలోడిమిర్ జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రక్షణ సాయం పెంచాలని లేకుంటే పశ్చిమదేశాలపై కూడా రష్యా దండయాత్ర చేస్తుందని యూరప్ దేశాలకు పిలుపునిచ్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తనతో నేరుగా చర్చలు జరిపితేనే.. ఈ యుద్ధం ఆగిపోవడానికి మార్గం దొరుకుతుందని, ఈ యుద్ధాన్ని ఆపడానికి అది ఏకైక మార్గమని జెలెన్స్కీ పేర్కొన్నారు. ఆధునిక ప్రపంచంలో మనిషి మృగంలా ప్రవర్తిస్తాడని ఎవరూ అనుకోరని పుతిన్ ను పరోక్షంగా విమర్శించారు.
గత వారం రోజులుగా రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేస్తుంది. ఈ దాడి ప్రారంభించినప్పటి నుండి దాదాపు 350 మంది పౌరులు మరణించారని ఉక్రెయిన్ పేర్కొంది. ఈ దాడికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నప్పటికీ, పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోలేదని రష్యా పేర్కొంది. లక్షలాది మంది ఉక్రెయిన్లు ప్రాణాలు అర చేత పట్టుకుని.. సరిహద్దు దాటి వెళ్లిపోయారు. ఉత్తర నగరంలోని చెర్నిహివ్‌లోని పాఠశాలను రష్యా విమానాలు ఢీకొన్నాయని, తొమ్మిది మంది మరణించారని ఉక్రెయిన్ తెలిపింది.
రష్యాకు జెలెన్‌స్కీ ప్రభుత్వం షాక్
ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్న రష్యాకు జెలెన్‌స్కీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్‌లోని రష్యన్ల ఆస్తులు సీజ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రష్యా ప్రభుత్వ ,పౌరుల ఆస్తులు సీజ్ చేసే చట్టానికి ఉక్రెయిన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది.