ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు నమోదు.. నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించిన కిమ్

By Mahesh KFirst Published May 12, 2022, 1:54 PM IST
Highlights

ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు నమోదైనట్టు గురువారం ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. ప్యాంగ్యాంగ్‌లో కొందరు అనారోగ్యంతో హాస్పిటల్ చేరగా వారి నుంచి శాంపిళ్లు తీసుకుని కరోనా టెస్టు చేశారని, అందులో వారికి ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ అని వచ్చినట్టు తెలిపింది. దీంతో వెంటనే కిమ్ జోంగ్ ఉన్న నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు.
 

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారితో సతమతమై.. అనేక మార్గాల్లో పోరాడి ఇప్పుడు కొంత ఉపశమన స్థితికి చేరాయి. ఈ పోరులో టీకాను కనుగొని చాలా దేశాలు డబుల్ వ్యాక్సిన్‌లు, బూస్టర్ డోసులు కూడా వేశాయి. మన దేశంలో మూడు వేవ్‌లు కరోనా వచ్చి వెళ్లింది. కొన్ని దేశాల్లోనైతే నాలుగో.. ఐదో వేవ్‌లు కూడా వచ్చి వెళ్లిపోయాయి. కానీ, ఉత్తర కొరియా దేశంలో మాత్రం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అసలే అది క్లోజ్‌డ్ ఎకానమీ. ఇతర దేశాలతో పెద్దగా సంబంధాలను మెయింటెయిన్ చేయదు. కానీ, గురువారం ఉత్తర కొరియా కరోనా వైరస్ తమ దేశంలోకి కూడా ఎంటర్ అయిందని ప్రకటించింది. ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు నమోదైనట్టు గురువారం వెల్లడించింది. ఆ వెంటనే ఉత్తర కొరియా సుప్రీమ్ లీడర్ కిమ్ జోంగ్ ఉన్ నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు.

అయితే, ఎన్ని కేసులు నమోదు అయ్యాయనే విషయం తెలియదు. కానీ, ఈ దేశంలో సరైన ఆరోగ్య వ్యవస్థ లేదు. ఆర్థికంగా కూడా అంతంతగానే ఉన్నది. ఇప్పటి వరకు ఈ దేశంలో కరోనా వైరస్‌కు టీకా వేయలేదనే సమాచారం ఉన్నది. ఈ దేశంలో 26 మిలియన్‌ల జనాభా ఉన్నది. చాలా మంది ఇందులో టీకా వేసుకోనివారే. అదీ ఈ దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసే నమోదైనట్టు తెలిసింది. ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపించే వైరస్ కావడంతో ఉత్తర కొరియాలో పరిస్థితులు రోజుల వ్యవధిలోనే దారుణంగా దిగజారిపోయే  ముప్పు ఉన్నట్టు స్పష్టం అవుతున్నది.

ఉత్తర కొరియా అధికార మీడియా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ కరోనా కేసు నమోదైనట్టు వెల్లడించింది. ప్యాంగ్యాంగ్ నగరంలో కొందరు తీవ్ర జ్వరంతో హాస్పిట్ల‌లో చేరారని, వారి నుంచి కరోనా టెస్టు కోసం శాంపిళ్లు సేకరించినట్టు వివరించింది. శాంపిళ్ల పరీక్షలో ఒమిక్రాన్ వేరియంట్ బారిన వారు పడ్డట్టు తెలిసిందని పేర్కొంది. అయితే, ఎన్ని శాంపిళ్లు కలెక్ట్ చేశారని, ఎంతమందిలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్‌గా తేలినట్టు వెల్లడించింది.

కాగా, దేశ సుప్రీమ్ లీడర్ కిమ్ జోంగ్ ఉన్ వెంటనే క్రైసిస్ పోలిట్‌బ్యూరోతో సమావేశం అయ్యారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిపారు. అత్యంత స్వల్ప సమయంలోనే ఈ మహమ్మారిని వేర్లతోపాటుగా అంతం చేయడమే లక్ష్యం అని ఆయన మీటింగ్‌లో చెప్పినట్టు వివరించారు. దేశ ప్రజల్లో రాజకీయ అవగాహన ఎక్కువగా ఉన్నదని, కాబట్టి, ఈ ఎమర్జెన్సీని కచ్చితంగా గెలుస్తామని తెలిపినట్టు పేర్కొన్నారు. ఈ ఎమర్జెన్సీ క్వారంటైన్ ప్రాజెక్ట్‌ను గెలుస్తామని చెప్పినట్టు వివరించారు. అదే విధంగా దేశ సరిహద్దులపై కఠిన నియంత్రణ ఉంచాలని తెలిపారు. అలాగే, ప్రజలకూ ఆయన పలు సూచనలు చేశారు. పని చేసే చోట్ల ఐసొలేట్‌గా ఉండాలని, వైరస్‌ వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

click me!