
Russia Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ రష్యాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఆ దేశంలోని సైనిక స్థావరాలను లేకుండా చేసేంతవరకు దాడులు కొనసాగిస్తామని రష్యా పేర్కొంటోంది. ప్రపంచ దేశాలు యుద్ధం ఆపాలని పేర్కొంటున్నాయి. ఇవేవి లెక్కచేయని రష్యా ..మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే వరుసగా రష్యా క్షిపణుల పశ్చిమ ఉక్రెయిన్‌లోని సైనిక శిక్షణా స్థావరంపై దాడి చేశాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ కు మద్దతు అందిస్తున్న NATO దేశాల మధ్య సహకారానికి కీలకమైన కేంద్రంగా ఈ సైనిక స్థావరం ఉంది. దీనిపై రష్యా మిస్సైళ్లతో విరుచుకుపడటంతో అక్కడ 35 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది.
ఈ శిక్షణ సైనిక స్థావరాన్ని 30 కంటే ఎక్కువ రష్యన్ క్రూయిజ్ క్షిపణులు లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇది NATO సభ్యదేశమైన పోలాండ్‌తో సరిహద్దుకు కొద్ది దూరంలో ఉంటుంది. దీనిని చాలా కాలంగా ఉక్రేనియన్ సైనిక సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా యూఎస్, పశ్చిమ దేశాలకు చెందిన మిలిటరీ నాయకులతో ఇక్కడ శిక్షణ తరగతులు నిర్వహించేవారు. ఎంతో కీలకంగా ఉన్న ఈ మిలిటరీ శిక్షణ కేంద్రం దాడికి గురైంది. ఉక్రెయిన్‌కు పాశ్చాత్య సైనిక సహాయం కోసం సిద్దపడి ఆయుధాలు పంపుతున్నాయి. దీంతో ఉక్రెయిన్ సహాయం అందించే వాహనాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతామని రష్యా ప్రకటింది. ఈ క్రమంలోనే దాడులు చోటుచేసుకున్నాయి.
కాగా, ఉక్రెయిన్ పై రష్యా దాడి ప్రారంభమైన 19 రోజులకు చేరుకుంది. యుద్ధం ప్రారంభమైన రెండు వారాల్లో పెద్ద ఎత్తున సైనికులు ప్రాణాలు కోల్పోయారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే, సాధారణ పౌరులు సైతం వందల్లో చనిపోయారని తెలుస్తోంది. రెండు వారాల క్రితం రష్యా దాడి చేసినప్పటి నుండి ఉక్రెయిన్ లో 596 మందికి పైగా సాధారణ పౌరులు చనిపోయారని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం పేర్కొంది. అయితే, ఇది అసలు సంఖ్యకంటే ఎక్కువగా ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఇతర రిపోర్టులు పేర్కొంటున్నాయి. యుద్ధం కారణంగా లక్షలాది మంది తమ ఇండ్లను వదిలి బంకర్లలో తలదాచుకుంటున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేని పరిస్థితుల్లో దారుణంగా పరిస్థితుల్లో ఉంటూ.. ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలావుండగా, భారీ మొత్తంలో.. అత్యాధునిక ఆయుధ సంపత్తిని కలిగి ఉన్నప్పటికీ.. పాశ్చాత్య దేశాల ఆయుధాల మద్దతుతో ఉక్రెయిన్‌లో ఊహించిన దాని కంటే గట్టి ప్రతిఘటనను ఎదుర్కొంటూ రష్యా ముందుకు సాగడంలో పోరాడింది. ఈ క్రమంలోనే దాడుల తీవ్రతను పెంచుతూ.. పెద్ద మొత్తంలో సైనికులను, ఆయుధాలను మోహరిస్తోంది రష్యా. ఇందులో భాగంగానే ఇప్పటివరకు సైనిక స్థావరాలే లక్ష్యం అని పేర్కొన్న రష్యా.. ఆ దేశ బలగాలు ప్రస్తుతం సాధారణ పౌరుల నివాసాలను, ఆస్పత్రులను, ఇతర కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. దీంతో వేలాది మంది వార్‌జోన్ లో చిక్కుకుపోయారు. దాడుల్లో వేల మంది మరణించారు. చనిపోయిన వారిలో పిల్లలు సైతం పెద్దమొత్తంలో ఉండటం ప్రస్తుత సంక్షోభానికి అద్దం పడుతోంది.