Russian Ukraine Crisis : దౌత్య మార్గం ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలి - యూఎన్ సమావేశంలో భారత్

Published : Mar 01, 2022, 10:25 AM IST
Russian Ukraine Crisis : దౌత్య మార్గం ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలి - యూఎన్ సమావేశంలో భారత్

సారాంశం

చర్చల ద్వారానే ఉక్రెయిన్, రష్యాకు మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించుకోవాలని భారత్ మరో సారి తేల్చి చెప్పింది. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో సోమవారం యూఎన్ జనరల్ అసెంబ్లీ అత్యవసరంగా సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో భారత్ తన వైఖరిని వెల్లడించింది. 

ఉక్రెయిన్ లో క్షీణిస్తున్న పరిస్థితిపై తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని భార‌త్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. హింసను తక్షణమే నిలిపివేయాలని, శత్రుత్వాలను అంతం చేయాలని పునరుద్ఘాటించింది. నిజాయితీగా, స్థిరమైన చర్చల ద్వారానే అన్ని విభేదాలను తొలగించగలమని భార‌త్ తేల్చి చెప్పింది. ఉక్రెయిన్ సంక్షోభం నేప‌థ్యంలో సోమ‌వారం యూఎన్ జ‌న‌ర‌ల్ అసెంబ్లీ ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైంది. ఈ స‌మావేశంలో భార‌త్ త‌న వాద‌నలు వినిపించింది. 

యూఎన్ అత్య‌వ‌స‌ర స‌మావేశంలో భార‌త ప్ర‌తినిధి టీఎస్ తిరుమూర్తి పాల్గొని మాట్లాడారు. ఉక్రెయిన్‌లో పరిస్థితి మరింత దిగజారడం పట్ల భారతదేశం తీవ్ర ఆందోళన చెందుతోంద‌ని తెలిపారు. హింసను నిలిపివేయాల‌ని కోరుతున్నామ‌ని చెప్పారు. దౌత్య మార్గం ద్వారా మాత్ర‌మే స‌మ‌స్య ప‌రిష్క‌రించుకోగ‌లమ‌ని, దీనికి వేరే మార్గం లేద‌ని భార‌త్ గ‌ట్టిగా నమ్ముతోందని అన్నారు. రష్యన్ ఫెడరేషన్, ఉక్రెయిన్ నాయకత్వంతో ఇటీవలి సంభాషణలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిని గట్టిగా సమర్థించారని తెలిపారు. ‘‘నిజాయితీ, చిత్తశుద్ధి, నిరంతర సంభాషణ ద్వారానే అన్ని విభేదాలను తొలగించగలమని మేము మా దృఢ విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తున్నాము ’’ అని తిరుమూర్తి అన్నారు. 

ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను అత్యవసరంగా తరలించడానికి భారత్ చేయగలిగినదంతా చేస్తోందని తిరుమూర్తి తెలిపారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులతో పాటు భారతీయ పౌరుల భద్రత మా మొదటి ప్రాధాన్యతగా ఉంది అని ఆయ‌న పేర్కొన్నారు. భారతీయ పౌరుల కోసం తమ సరిహద్దులను తెరిచిన ఉక్రెయిన్‌లోని అన్ని పొరుగు దేశాలకు భారతదేశం కృతజ్ఞతలు తెలుపుతోంద‌ని అన్నారు. భారతీయ పౌరులను వారి స్వదేశానికి తరలించడానికి భారతీయ మిషన్లు, వారి సిబ్బందికి అన్ని సౌకర్యాలను కల్పింద‌ని చెప్పారు. 

కాగా.. ఇటీవ‌ల జ‌రిగిన యూఎన్ భ‌ద్ర‌త మండ‌లి స‌మావేశంలోనూ భార‌త్ త‌ట‌స్థంగానే ఉంది. ఇటు ఉక్రెయిన్ కు అనుకూలంగా గానీ, అటు ర‌ష్యాకు అనుకూలంగా గానీ మాట్లాడ‌లేదు. ఉక్రెయిన్ పై ర‌ష్యా దూకుడును త‌గ్గించేందుకు, ర‌ష్యాపై చ‌ర్య‌ల తీసుకోవాల‌ని యూఎన్ భ‌ద్ర‌తా మండ‌లి స‌మావేశంలో అమెరికా తీర్మాణం ప్ర‌తిపాదించింది. ఈ కౌన్సిల్ లో 15 స‌భ్య దేశాలు ఉంటాయి. అయితే అమెరికా ప్ర‌వేశ‌పెట్టిన తీర్మాణంలో భార‌త్ ఓటు వేయ‌లేదు. ఓటింగ్ దూరంగా ఉంది. ఇదే దారిలో చైనా, యూఏఈ కూడా నిలిచాయి. 11 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. అయితే ఈ తీర్మాణాన్ని ర‌ష్యా త‌నకు ఉన్న వీటో అధికారంతో ర‌ద్దు చేసింది. 

అమెరికా యూఎన్ భ‌ద్ర‌తా మండలిలో ప్ర‌వేశ‌పెట్టిన తీర్మాణాన్ని ర‌ష్యా ర‌ద్దు చేయ‌డంతో ఆ దేశం మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. ర‌ష్యా చ‌ర్య‌ల‌ను యూఎన్ జ‌న‌ర‌ల్ అసెంబ్లీలో ఎండ‌గ‌ట్టాల‌ని భావించింది. దీని కోసం యూఎన్ జ‌న‌ర‌ల్ అసెంబ్లీని అత్య‌వ‌స‌రంగా స‌మావేశప‌ర్చాల‌ని నిర్ణ‌యించి, భ‌ద్ర‌తా మండ‌లిలో తీర్మాణం ప్ర‌వేశ‌పెట్టింది. ఇలా అత్య‌వ‌స‌ర స‌మావేశం చాలా అరుదుగా జ‌రుగుతూ ఉంటుంది. చరిత్ర‌లో కేవ‌లం ప‌ది సార్లు మాత్ర‌మే ఇలా స‌మావేశం ఏర్పాటు అయ్యింది. ఈ స‌మావేశం కోసం ఒక విధాన‌ప‌రమైన తీర్మాణానికి భ‌ద్ర‌తా మండ‌లి ఆమోదం అవ‌స‌రం. ఈ నేప‌థ్యంలో అమెరికా తీర్మాణం ప్రవేశపెట్టింది. అయితే ఈ తీర్మాణానికి కూడా భార‌త్ దూరంగానే ఉండి వైఖ‌రిని అవ‌లంభించింది. ఆ తీర్మాణాన్ని మెజారిటీ దేశాలు ఆమోదించ‌డంతో సోమవారం జ‌న‌ర‌ల్ అసెంబ్లీ స‌మావేశం అయ్యింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే
Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి