
Russian President Vladimir Putin health: గత ఏడాది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం ఎప్పుడూ చర్చనీయాంశమే. ఇప్పుడు, ఒక కొత్త నివేదిక ప్రకారం.. రష్యా అధ్యక్షుడు తలలో తీవ్రమైన నొప్పి, దృష్టి మసకబారడం, నాలుక తిమ్మిరి వంటి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీనిపై అక్కడి వైద్యులు సైతం ఆందోళన వ్యక్తం చేసినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. గత కొంత కాలంగా రష్యా అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంపై రకరకాల వదంతులు వస్తున్న తరుణంలో ఈ కొత్త పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
పుతిన్ ఆరోగ్యం గురించి రష్యాకు చెందిన జనరల్ ఎస్వీఆర్ టెలిగ్రామ్ ఛానల్ తాజా వాదనలు చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దృష్టి లోపంతో బాధపడుతున్న ఆయన నాలుక తీవ్రమైన వ్యాధికి గురై బాధపడుతున్నారు. పుతిన్ ఆరోగ్యం ప్రమాదంలో ఉందంటూ రష్యా నుంచి జనరల్ ఎస్వీఆర్ టెలిగ్రామ్ ఛానెల్ పేర్కొంది.
పుతిన్ దృష్టి లోపం, వికారం, కొన్ని ఆహారాలు తినలేకపోవడం, తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నట్లు నివేదిక తెలిపింది. అతని కుడి చేయి, కాలు బలహీనపడ్డాయి. నిపుణులైన వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినా పుతిన్ అందుకు నిరాకరించారు. ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని పేర్కొంది. అయితే, చివరకు వైద్యల సలహా మేరకు రోజంతా విశ్రాంతి తీసుకునీ, సాయంత్రం భద్రతా అధికారులతో మాట్లాడారనీ, అయితే, వర్చువల్ గా మాట్లాడగా, ఆయన కనిపించకుండా కేవలం మాటలు మాత్రమే వినిపించాయని నివేదిక పేర్కొంది. అధ్యక్షుడి ఆరోగ్యం సరిగ్గా లేని సమయంలో ఈ తరహా కమ్యూనికేషన్ ఉంటుందని తెలిపింది.
కాగా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి పుతిన్ ఆరోగ్యంపై అనేక పుకార్లు వచ్చాయి. ఫిబ్రవరిలో, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో తనను సందర్శించడానికి వచ్చినప్పుడు పుతిన్ కాళ్ళు వణుకుతున్నట్లు అనేక వీడియోలు బయటకు వచ్చాయి. పుతిన్ కేన్సర్ తో బాధపడుతున్నట్లు స్పానిష్ వార్తాపత్రిక మార్కా వెల్లడించింది. అయితే ఈ వార్తలన్నీ అవాస్తవమని రష్యా కొట్టిపారేసింది.