
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా మరో భయానక హెచ్చరికలు చేసింది. తమకు ప్రత్యేక డొమెస్టిక్ సెక్యూరిటీ కాన్సెప్ట్ ఉన్నదని, ఇక్కడి ప్రజల కోసం ప్రత్యేక కాన్సెప్ట్ ఉన్నదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అందులోనే తాము న్యూక్లియర్ వెపన్స్ వినియోగానికి అవసరమైన సందర్భాలను వివరించామని పేర్కొన్నారు. తమ దేశం ఉనికికే ముప్పు వస్తే తమ కాన్సెప్ట్ ప్రకారం అణ్వాయుధాలు వినియోగిస్తామని తెలిపారు.
ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధంలో వ్లాదిమిర్ పుతిన్ న్యూక్లియర్ ఆయుధాలను వినియోగించే అవకాశాలను పరిశీలించబోరని మీరు నిశ్చితంగా నమ్ముతున్నారా? అందుకు కారణాలు తెలుపగలరా? అని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ను సీఎన్ఎన్ ఇంటర్నేషనల్ ఇంటర్వ్యూలో ప్రశ్నలు గుప్పించారు.
గత నెల 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారంభించింది. 28వ తేదీన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూక్లియర్ వార్నింగ్ ఇచ్చారు. తాను న్యూక్లియర్ డిటరెంట్ ఫోర్స్‌ను హై అలర్ట్‌లో పెట్టినట్టు పుతిన్ పేర్కొన్నారు. దీనిపై ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఉక్రెయిన్‌కు అమెరికా, నాటో కూటమి ఫైటర్ జెట్లు సరఫరా చేస్తే యుద్ధానికి మరింత ఆజ్యం పోసినట్టేనని పుతిన్ హెచ్చరించారు. తద్వార అది పశ్చిమ దేశాల్లోని అణ్వాయుధ శక్తులతో రష్యా యుద్ధంగా పరిణమించవచ్చునని వార్నింగ్ ఇచ్చారు.
కాగా, పెస్కోవ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై అమెరికా రక్షణ శాఖ అధికారులు స్పందించారు. పెంటగాన్ అధికారులు స్పందిస్తూ.. ఆయన వ్యాఖ్యలు ప్రమాదకరం అని అన్నారు. న్యూక్లియర్ దేశాలు ఇలా వ్యవహరించరాదని, బాధ్యతాయుతంగా ఉండాలని హితవు పలికారు. వ్లాదిమిర్ పుతిన్ న్యూక్లియర్ వార్నింగ్ ఇచ్చారని, కానీ, అందుకు సంబంధించిన కదలికలను తమ దృష్టికి ఇంకా రాలేదని, అవేమీ తమకు కనిపించలేదని తెలిపారు. తమ రక్షణ వ్యూహాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితులు మాత్రం ఇప్పుడు కనిపించలేదని స్పష్టం చేశారు.
రష్యా సైనిక బలగాలు చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లోని కొత్త ప్రయోగశాలపై బాంబుల వర్షం కురిపించాయి. దీంతో ఆ ల్యాబ్ పూర్తిగా ధ్వంసం అయింది. అలాగే, చెర్నోబిల్ పరిసర ప్రాంతాల్లో రేడియేషన్ ను గుర్తించే మానిటర్లు పనిచేయడం అగిపోయింది. న్యూక్లియర్ ప్లాంట్ సహా ఇతర విషయాలతోపాటు, రేడియోధార్మిక వ్యర్థాల నిర్వహణను మెరుగుపరిచేందుకు ఈ ల్యాబ్ పనిచేస్తుందని చెర్నోబిల్ మినహాయింపు జోన్‌కు బాధ్యత వహించే ఉక్రేనియన్ స్టేట్ ఏజెన్సీ వెల్లడించింది.
యుద్ధం ప్రారంభంలో రష్యా సైన్యం డికమిషన్డ్ ప్లాంట్‌ను స్వాధీనం చేసుకుంది. మినహాయింపు జోన్ అనేది ప్లాంట్ చుట్టూ ఉన్న కలుషితమైన ప్రాంతం. 1986లో ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన అణు విధ్వంసం జరిగిన ప్రదేశం ఈ చెర్నోబిల్. కాగా, యూరోపియన్ కమిషన్ మద్దతుతో 6 మిలియన్ యూరోల వ్యయంతో నిర్మించిన ప్రయోగశాల 2015లో ప్రారంభించబడిందని రాష్ట్ర ఏజెన్సీ తెలిపింది. ప్రయోగశాలలో అత్యంత చురుకైన నమూనాలు మరియు రేడియోన్యూక్లైడ్‌ల నమూనాలు ఉన్నాయి. అవి ఇప్పుడు శత్రువుల చేతిలో ఉన్నాయి, అవి నాగరిక ప్రపంచానికి కాకుండా దానికే హాని కలిగిస్తాయని మేము ఆశిస్తున్నాము అని ఏజెన్సీ తన ప్రకటనలో తెలిపింది. మరో ఆందోళనకరమైన పరిణామంలో, ప్లాంట్ చుట్టూ ఉన్న రేడియేషన్ మానిటర్లు పనిచేయడం మానేశాయని ఉక్రెయిన్ న్యూక్లియర్ రెగ్యులేటరీ ఏజెన్సీ తెలిపింది.