
Russia Ukraine Crisis: రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగుతోంది. రష్యా మొదలు పెట్టిన ఈ మిలిటరీ చర్య కారణంగా రెండు దేశాల్లో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిందని తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన అణు దళాలను అప్రమత్తం చేయడం ద్వారా ఉద్రిక్తతలను మరింత పెంచినప్పటికీ, రష్యాతో "ముందు షరతులు లేకుండా" చర్చల్లో ఉక్రెయిన్ అధికారులు పాల్గొనేలా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆదివారం అంగీకరించారు. "ప్రిప్యాట్ నదికి సమీపంలో ఉక్రేనియన్-బెలారసియన్ సరిహద్దులో ఉక్రేనియన్ ప్రతినిధి బృందం ముందస్తు షరతులు లేకుండా రష్యన్ ప్రతినిధి బృందంతో సమావేశమవుతుందని మేము అంగీకరించాము" అని జెలెన్స్కీ వెల్లడించారు. అయితే, తాజా రిపోర్టుల ప్రకారం రష్యా-ఉక్రెయిన్ దేశాలు సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు శాంతి చర్చలు జరపనున్నాయని సమాచారం. ఈ శాంతి చర్చల గురించి బెలారస్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రెండు దేశాల బృందాల భేటీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. యుద్ధానికి ముగింపు కార్డు పడనుందని కూడా చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య సోమవారం చర్చలు జరగనుండటంతో అన్ని దేశాలు దీనిపై దృష్టి సారించాయి. ఈ చర్చలు ఈ యుద్ధానికి ముగింపు పలుకుతాయా? లేకుంటే మరింత ఉద్రిక్తలకు దారి తీస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ఇరు దేశాల మద్య చర్యలు జరుగనున్నాయనే వార్తల వెలువడుతున్న పరిస్థితులు వుండగా, Zhytomyr విమానాశ్రయంపై దాడి చేసేందుకు రష్యా ఇస్కాండర్ క్షిపణి వ్యవస్థలను ఉపయోగించింది. రష్యా బాలిస్టిక్ క్షిపణి లాంచర్లను ఉపయోగించి బెలారస్ నుండి వైమానిక దాడులు జరిగినట్టు సమాచారం.
ఇదిలావుండగా, రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాని ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం ఆపాలని ఐరాసతో పాటు చాలా దేశాలు కోరుతున్నాయి. అయితే, ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ లోని పెద్ద సంఖ్యలో సైనిక స్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు సైనిక బలగాలు కీవ్ నగరంలోకి ప్రవేశించాయి. రష్యా మొదలు పెట్టిన ఈ మిలిటరీ చర్య కారణంగా రెండు దేశాల్లో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిందని తెలుస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ లో మరణాలు, ఆర్థిక నష్టం తీవ్రత పెరుగుతున్నదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ చర్యలను ఆపాలని ప్రపంచ దేశాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అమెరికా సహా నాటో కూటమిలోని చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ రష్యా ఏమాత్రం లెక్కచేయడం లేదు. ఈ క్రమంలోనే వరుస పెట్టి ఐక్యరాజ్య సమితి (ఐరాస) వరుస సమావేశాలు నిర్వహిస్తూ.. రష్యాపై ఒత్తిడి తీసుకురావడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది.