
Russia Ukraine Crisis: రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాని ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం ఆపాలని ఐరాసతో పాటు చాలా దేశాలు కోరుతున్నాయి. అయితే, ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ లోని పెద్ద సంఖ్యలో సైనిక స్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు సైనిక బలగాలు కీవ్ నగరంలోకి ప్రవేశించాయి. రష్యా మొదలు పెట్టిన ఈ మిలిటరీ చర్య కారణంగా రెండు దేశాల్లో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిందని తెలుస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ లో మరణాలు, ఆర్థిక నష్టం తీవ్రత పెరుగుతున్నదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ చర్యలను ఆపాలని ప్రపంచ దేశాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అమెరికా సహా నాటో కూటమిలోని చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ రష్యా ఏమాత్రం లెక్కచేయడం లేదు. ఈ క్రమంలోనే వరుస పెట్టి ఐక్యరాజ్య సమితి (ఐరాస) వరుస సమావేశాలు నిర్వహిస్తూ.. రష్యాపై ఒత్తిడి తీసుకురావడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే నాటో సభ్యదేశాలు, యూరప్ దేశాలతో పాటు ప్రపంచంలోని చాలా దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తూ ముందుకు సాగుతున్నాయి. రష్యా యుద్ధం ఆపకుండా ఆ దేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే విధించిన ఆంక్షలను అధికం చేస్తూ.. ఒత్తిడి తీసుకువస్తున్నాయి. దీనిలో భాగంగా యూరోపియన్ దేశాలు, కెనడా రష్యా విమానాలకు తమ గగనతలాన్ని మూసివేసాయి. ఉక్రెయిన్‌పై దాడిని ముగించాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి తెచ్చే లక్ష్యంతోనే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇలా ఆంక్షలు విధించడం ఇదే అతిపెద్ద చర్య. ఈ మేరకు రష్యాకు యూరోపియన్ యూనియన్ తన గగనతలాన్ని మూసివేయాలని నిర్ణయించిందని EU విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ వెల్లడించారు. ఈ క్రమంలోనే యూరోపియన్ గమ్యస్థానాలకు అన్ని విమానాలను రద్దు చేస్తామని ఏరోఫ్లాట్ తెలిపింది.
ఇప్పటికే వాణిజ్య ఆంక్షలు విధించిన అమెరికా సైతం గగనతలాన్ని మూసివేసే విషయాన్ని పరిశీలిస్తున్నదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని US అధికారులు తెలిపారు. రష్యాకు తమ గగనతలాన్ని మూసివేసిన దేశాలు విమానాలను రద్దు చేస్తున్న విమానయాన సంస్థలు పెరుగుతున్నాయని పేర్కొంటూ పౌరులు వాణిజ్య విమానాల్లో రష్యాను విడిచిపెట్టడాన్ని వెంటనే పరిగణించాలని US ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకు జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్ బ్రిటన్, నార్డిక్స్ మరియు బాల్టిక్ లు తమ గగనతలంపై రష్యా ఉపయోగంపై నిషేధాన్ని విధించాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడికి ప్రతీకారంగా పుతిన్‌పై ఆర్థిక యుద్ధం చేయడానికి నాటో మిత్రదేశాలు చేసిన వ్యూహంలో ఇది పెద్ద ఎత్తుగడ అనే చెప్పాలి. ఇదే తరహా నిర్ణయాలు తీసుకోవాలని మరిన్ని దేశాలు సమాలోచనలు చేస్తున్నాయని రిపోర్టు పేర్కొంటున్నాయి. ఇదే జరిగితే.. రష్య తీవ్ర ఒత్తిడిలోకి జారుకోవడం ఖాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.