
Russia Ukraine war: రష్యా-ఉక్రెయిన్ వార్ ఇంకా కొనసాడుతోంది. ఉక్రెయిన్ మద్దతు ప్రకటించిన అమెరికా.. దాడికి గురవుతున్న దేశానికి ఆయుధాలు అందిస్తామని వెల్లడించింది. దీంతో ఆగ్రహించిన రష్యా ఉక్రెయిన్ పై తాజాగా హైపర్‌సోనిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఉక్రెయిన్‌లోని కీలకమైన దక్షిణ ఓడరేవు ఒడెసా వద్ద రష్యా దూకుడు పెంచుతూ దాడులకు తెగబడింది. వారాల క్రితం ధ్వంసమైన ఈశాన్య ప్రాంతంలోని భవనం శిథిలాలలో 44 మంది పౌరుల మృతదేహాలను కనుగొన్నట్లు ఉక్రేనియన్ అధికారులు మంగళవారం తెలిపారు. అలాగే, మారియుపోల్ ముట్టడి నగరంలో ఉక్కు కర్మాగారం వద్ద కనీసం 100 మంది పౌరులు చిక్కుకున్నారని ఉక్రేనియన్ అధికారి తెలిపారు. ఖార్కివ్ నగరానికి 120 కిలోమీటర్ల (75 మైళ్ళు) దూరంలో ఉన్న ఇజియమ్‌లో మార్చిలో కూలిపోయిన ఐదు అంతస్తుల భవనంలో 44 మృతదేహాలు కనుగొనబడ్డాయి. ఇది ఫిబ్రవరి చివరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రష్యా దాడికి గురవుతోంది.
యుద్ధం కారణంగా పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతున్నదనీ, ఇది ప్రపంచ దేశాలకు సైతం ముప్పును కలిగిస్తున్నదని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే ఐక్యారాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌పీ) రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మానవతావాద పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం కొత్త బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఒక నివేదిక తెలిపింది. సెషన్‌ను నిర్వహించాలని ఫ్రాన్స్, మెక్సికో దేశాలు అభ్యర్థించాయని సమాచారం. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా ప్రత్యేక సైనిక చర్యను ప్రకటించినప్పటి నుండి కౌన్సిల్ నిర్వహించే 16వ సమావేశం ఇది. ఈ సెషన్ లో కూడా రష్యాపై ఒత్తిడి తీసుకురావడానికి చర్యలు తీసుకునే అవకాశముంది. అయినప్పటికీ, UNSCలో శాశ్వత సభ్యదేశంగా ఉన్న రష్యా.. అది ఆమోదించని చర్యలను నిరోధించే అధికారం కలిగి ఉంది.
యుక్రెయిన్‌లోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల పర్యవేక్షణ మిషన్ అధిపతి మాటిల్డా బోగ్నర్ మాట్లాడుతూ.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి దేశంలో దాని అధికారిక లెక్కల ప్రకారం 3,381 చనిపోయారు కానీ... ఆ లెక్కల కంటే ఎక్కువ మందే ఈ యుద్ధం కారణంగా ప్రాణాలు కోల్పోయారని ఆయన చెప్పారు. "మేము అంచనాలపై పని చేస్తున్నాము, కానీ ప్రస్తుతానికి నేను మీకు చెప్పగలిగేది ఏమిటంటే, మేము ప్రస్తుతం మీకు అందించిన సంఖ్యల కంటే ఇది వేలకొద్దీ ఎక్కువ అని జెనీవాలో ఒక మీడియా సమావేశంలో మాటిల్డా బోగ్నర్ అన్నారు. ఇంతలో ఉక్రెయిన్ అమెరికా మద్దతు ప్రకటించడం.. ఆయుధాలు అందిస్తామంటూ వ్యాఖ్యానించడం రష్యాకు మరింత కోపం తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ పై హైపర్సోనిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఒడెస్సాపై జరిగిన హైపర్ సోనిక్ క్షిపణుల దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో పాటు పెద్ద ఎత్తున్న గాయపడ్డారనీ, విధ్వంసం అధికంగా ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ఇదిలావుండగా, శనివారం తూర్పు ఉక్రెయిన్‌లోని లుగాన్స్క్ రీజియన్‌లో బాంబులు కురిశాయి. లుగాన్స్క్ రీజియన్‌లో ఓ గ్రామంలోని స్కూల్‌పై బాంబులు కురిసినట్టు ఆ రీజియన్ గవర్నర్ వెల్లడించారు. అయితే, ఈ స్కూల్‌లో 90 మంది తలదాచుకుంటున్నట్టు తెలిపారు. బాంబుల దాడి కారణంగా ఈ బిల్డింగ్ మొత్తం ధ్వంసమైపోయింది. చుట్టూర మంటలు అంటుకున్నాయి. మంటలను అదుపులోకి తేవడానికి సుమారు నాలుగు గంటల కాలం పట్టింది. అయితే, ఈ కాలంలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముప్పై మందిని ఈ భవన శిథిలాల కింది నుంచి కాపాడినట్టు గవర్నర్ సెర్హియ్ గైదై తెలిపారు. అందులో ఏడుగురికి తీవ్రంగా గాయాలైనట్టు వివరించారు. కాగా, రెండు మృతదేహాలను రికవరీ చేసుకున్నట్టు చెప్పారు. సుమారు 60 మంది ఈ శిథిలాల కిందే ప్రాణాలు వదిలరని పేర్కొన్నారు.