
ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్దం మరింతగా ముదురుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ చిక్కుకున్న భారతీయులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ వారిని అప్రమత్తం చేస్తున్న భారత ప్రభుత్వం, ఉక్రెయిన్‌లో భారత రాయబార కార్యాలయం.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను భారతీయులు వెంటనే విడిచివెళ్లాలని ఆదేశించింది.
విద్యార్థులతో పాటు భారతీయులందరూ ఈ రోజే అత్యవసరం కీవ్ నగరాన్ని వదిలివెళ్లాలని భారత ఎంబసీ ట్విట్టర్‌లో సూచించింది. అందుబాటులో ఉన్న రైళ్ల ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా బయటపడాలని తెలిపింది.
ఇక, ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం చర్చలు జరిగినప్పటికీ.. అవి ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. మరోవైపు ఉక్రెయిన్‌పై దాడిని రష్యా మరింత ముమ్మరం చేసింది. చాలా దేశాలు రష్యాల చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నా అధ్యక్షుడు పుతిన్ వాటిని పట్టించుకోవడం లేదు. న్యూక్లియర్ వెపన్స్ బలగాలను సన్నద్దంగా ఉండాలని పేర్కొనడం పై యావత్ ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా బలగాలు ముందుకు సాగుతున్నాయి. రష్యా సైన్యాన్ని ఉక్రెయిన్ బలగాలు, ప్రజలు ధీటుగా ఎదుర్కొంటున్నప్పటికీ వారిని నిలువరించడానికి అది సరిపోవడం లేదు. రష్యా బలగాలు భారీ ఎత్తున్న ఉక్రెయిన్ రాజధాని కైవ్ దిశగా దూసుకువస్తున్నాయని శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడికావడం మరింత ఆందోళనకు దారితీసింది. 40 మైళ్ల పొడవునా రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కైవ్ వైపు దూసుకొస్తున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా బలగాలు ముందుకు సాగుతుండటంతో.. పెద్ద ఎత్తున విధ్వంసం చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కీవ్ నగరంపై క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉండటంతో భారత ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో భారతీయులు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది.
ఇక, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగా పేరుతో స్వదేశానికి తరలిస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ గగనతలం మూసివేసినందున అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను తొలుత సరిహద్దు దేశాలైన రొమేనియా, హంగేరి చేరుకునేలా సూచనలు చేస్తున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో భారత్‌కు తరలిస్తున్నారు. ఈ ప్రక్రియను కేంద్రం మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉక్రెయిన్ సరిహద్దు దేశాలతో మరింత సమన్వయంతో వ్యవహరించేందుకు.. నలుగురు కేంద్ర మంత్రులను ప్రత్యేక దూతలుగా అక్కడి పంపాలని నిర్ణయం తీసుకుంది.
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా.. రొమేనియా, మాల్దోవాల నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరెన్ రిజిజు స్లొవేకియాకు, పెట్రోలియం మంత్రి హర్దీ్‌పసింగ్ పురి హంగరీకి, కేంద్ర రోడ్డు, రవాణా, విమానయాశ శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ పోలండ్ వెళ్తారు.
భారతీయుల తరలింపు ప్రయత్నాల్లో భాగం పంచుకోవాలని ప్రధాని మోదీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు పిలుపునిచ్చారు. వైమానిక దళం యొక్క సామర్థ్యాలను ఉపయోగించుకోవడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ మందిని ఖాళీ చేయగలుగుతామని మోదీ అభిప్రాయపడినట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలోనే భారత వైమానిక దళం ఈరోజు నుంచి ఆపరేషన్ గంగాలో భాగంగా పలు C-17 విమానాలను అక్కడికి పంపే అవకాశం ఉంది.