Russia Ukraine Crisis: రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాని ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం ఆపాలని ఐరాసతో పాటు చాలా దేశాలు కోరుతున్నాయి. అయితే, ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ లోని పెద్ద సంఖ్యలో సైనిక స్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు సైనిక బలగాలు కీవ్ నగరంలోకి ప్రవేశించాయి. రష్యా మొదలు పెట్టిన ఈ మిలిటరీ చర్య కారణంగా రెండు దేశాల్లో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిందని తెలుస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ లో మరణాలు, ఆర్థిక నష్టం తీవ్రత పెరుగుతున్నదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ చర్యలను ఆపాలని ప్రపంచ దేశాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అమెరికా సహా నాటో కూటమిలోని చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ రష్యా ఏమాత్రం లెక్కచేయడం లేదు. అయితే, ఉక్రెయిన్ సైతం రష్యా దళాలకు ధీటుగా స్పందిస్తోంది. దేశంలో సమాన్య ప్రజానీకం నుంచి రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు సైతం ఆయుధాలను చేతబట్టి యుద్ధ రంగంలో ముందుకు సాగుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అందాల సుందరి, మాజీ మిస్ ఉక్రెయిన్ అనస్తాసియా లెన్నా సైతం తుపాకి చేతబట్టి.. దేశం కోసం పోరాడుతోంది. దీనికి సబంధించిన చిత్రాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రష్యా దాడిని ఎదుర్కొనేందుకు మాజీ మిస్ ఉక్రెయిన్ అనస్తాసియా లెన్నాఆ దేశ మిలిటరిలో చేరింది. ఆయుధాలు చేతబట్టి రష్యా దాడికి వ్యతిరేకంగా పోరాడుతోంది. రష్యా దాడులు మొదలైన దగ్గర నుంచి తన సోషల్ మీడియా ఖాతాలో ఉక్రెయిన్ సాయుధ బలగాలకు మద్దతు పలుకుతూ అనేక పోస్ట్‌లను పెట్టారు. తాజాగా లెన్నా ఓ రైఫిల్‌ను పట్టుకుని ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఫోటోతో పాటు "దండయాత్ర చేయాలనే ఉద్దేశ్యంతో సరిహద్దును దాటి ఉక్రెయిన్‌లో చొరబడ్డ వాళ్లను అంతం చేస్తా" అంటూ రాసుకొచ్చారు.
అంతకుముందు, ఉక్రెయిన్ పార్లమెంటు సభ్యురాలు కిరా రుడిక్ తుపాకీ పట్టుకుని ఉన్న చిత్రాన్ని పంచుకున్నారు. "నేను కలాష్నికోవ్‌ను ఉపయోగించడం నేర్చుకుంటాను. దేశ రక్షణ కోసం ఆయుధాలు చేపట్టడానికి సిద్ధం అవుతున్నాను. ఇది అతివాస్తవికంగా అనిపిస్తుంది, కొద్ది రోజుల క్రితం అది నా మనసులోకి రాకపోవచ్చు. మన #మహిళలు మన #పురుషుల మాదిరిగానే మన మాతృభూమిని కాపాడుతారు" అని కిరా రుడిక్ ట్వీట్ చేశారు. అలాగే, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కూడా యుద్ధంలో పాల్గొంటున్నాడని, ఉక్రెయిన్ సైనికులతో కలిసి పోరాడుతున్నాడని రిపోర్టు పేర్కొంటున్నాయి. రష్యా దాడి నుంచి ఇలా ఉక్రెయన్ పౌరులు చొరవచూపడం ఇప్పుడు అందరికి అవసరమైనప్పుడు దేశం పట్ల నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేస్తోంది.