Russia Ukraine Crisis : ప్రపంచంలోనే అతి పెద్ద విమానాన్ని నాశనం చేసిన రష్యా.. నిర్ధారించిన ఉక్రెయిన్ మంత్రి

Published : Feb 28, 2022, 01:15 AM IST
Russia Ukraine Crisis  : ప్రపంచంలోనే అతి పెద్ద విమానాన్ని నాశనం చేసిన రష్యా.. నిర్ధారించిన ఉక్రెయిన్ మంత్రి

సారాంశం

ప్రపంచంలోనే అతి పెద్ద విమానంగా గుర్తింపు పొందిన AN-225 Mriya విమానాన్ని రష్యన్ సైనికులు ఆదివారం నాశనం చేశారు. యుద్దం నేపథ్యంలో ఓ ఎయిర్ పోర్టులో పార్క్ చేసి ఉన్న ఈ విమానంపై రష్యా బలగాలు దాడి చేశాయి. విమానంపై దాడి విషయాన్ని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి నిర్ధారించారు. 

ఉక్రెయిన్ (Ukraine), ర‌ష్యా (Russia) కు మ‌ధ్య జ‌రుగుతున్న భీక‌ర దాడిలో రెండు దేశాల‌కు న‌ష్టం చేకూరుతోంది. రెండు వైపుల ప్రాణ న‌ష్టం జరుగుతోంది. రెండు దేశాల‌కు సంబంధించిన ర‌క్ష‌ణ ప‌రిక‌రాలు ధ్వంసం అవుతున్నాయి. అయితే పెద్ద దేశ‌మైన ర‌ష్యా, చిన్న‌దేశ‌మైన ఉక్రెయిన్ తో పోరాడుతున్న స‌మ‌యంలో స‌హ‌జంగానే ఉక్రెయిన్ ఎక్కువ‌గా న‌ష్ట‌పోతోంది. ఈ క్ర‌మంలో ఉక్రెయిన్ లో త‌యారైన ప్ర‌పంచంలోనే అతి పెద్ద విమానాన్ని ఉక్రెయిన్ కోల్పొయింది. దీనిని ఉక్రెయిన్ మంత్రి ధృవీక‌రించారు. 

ఉక్రెయిన్ రాజ‌ధాని కైవ్ (Kyiv) సమీపంలోని ఎయిర్‌ఫీల్డ్‌లో రష్యా దళాలు పోరాడుతున్న స‌మ‌యంలో ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఆదివారం ధ్వంసమైంది. ఈ విష‌యంలో ఉక్రెయిన్ అధికారిక ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా ‘‘ప్రపంచంలోని అతిపెద్ద విమానం మ్రియా (Mriya) (ది డ్రీం)ని కైవ్ సమీపంలోని ఎయిర్‌ఫీల్డ్‌లో రష్యన్ సైనికులు ధ్వంసం చేశారు. మేము మా విమానాన్ని పునర్నిర్మిస్తాము. బలమైన, స్వేచ్ఛా, ప్రజాస్వామ్య ఉక్రెయిన్ కోసం మా కలను నెరవేరుస్తాము ’’ అని తెలిపి, విమానం ధ్వంసం ప‌ట్ల సంతాపం వ్య‌క్తం చేసింది. 

రష్యా సేనలు నాలుగో రోజు ఉక్రెయిన్ పై దాడి కొనసాగిస్తున్న తరుణంలో AN-225 మ్రియాను నాశనం చేవారు. మ్రియా అంటే ఉక్రేనియన్‌లో డ్రీమ్ అని అర్ధం. ఉక్రేనియన్ ఏరోనాటిక్స్ కంపెనీ ఆంటోనోవ్ ఈ AN-225 Mriyaను త‌యారు చేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌గా అర్హత సాధించింది. ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కార‌ణంగా కైవ్ వెలుపల ఉన్న హాస్టొమెల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ విమానాన్ని పార్క్ చేసి ఉంచారు. అయితే దీనిపై పుతిన్ సేన‌లు దాడి చేశారు. 

ఈ విష‌యంపై ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా (DmytroKuleba) తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ‘‘ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానం. AN-225 మ్రియా (ఉక్రేనియన్‌లో 'డ్రీమ్'). రష్యా మన 'మ్రియా'ని నాశనం చేసి ఉండవచ్చు. కానీ బలమైన, స్వేచ్ఛా, ప్రజాస్వామ్య యురోపియన్ రాజ్యాన్ని వారు ఎప్పటికీ నాశనం చేయలేరు. . మేము గెలుస్తాము’’ అని ఆయ‌న ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో పాటు AN-225 మ్రియా ఫొటోను షేర్ చేశారు. వారు అతిపెద్ద విమానాన్ని కాల్చారు, కానీ త‌మ‌ మ్రియా ఎప్పటికీ నశించదు అంటూ పోస్ట్ చేశారు. 

విమానం ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో నిర్ధారించలేమని విమాన‌యాన సంస్థ ఆంటోనోవ్ తెలిపింది. ‘‘ప్రస్తుతం AN-225 ను నిపుణులు తనిఖీ చేసేంత వరకు మేము విమానం సాంకేతిక పరిస్థితిపై నివేదించలేము. తదుపరి అధికారిక ప్రకటన కోసం వేచి ఉండండి ’’ అని ఆ విమాన త‌యారీ సంస్థ ట్వీట్ చేసింది. 

రష్యా గురువారం నుంచి ఉక్రెయిన్ దేశంపై పూర్తి స్థాయి దండయాత్ర ప్రారంభించినప్పటి నుండి పలు ఉక్రేనియన్ నగరాలపై క్రూయిజ్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఆదివారం నాడు ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లో వీధి పోరాటాలు జరిగాయి. ఈ సమయంలో ఉక్రేనియన్ రష్యా దళాల నుండి నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోగలిగారు. అయితే రాజధాని కైవ్ లో కఠినమైన యుద్ధ కర్ఫ్యూ  కొన‌సాగుతోంది.  తుపాకీ కాల్పులు పేలుళ్ల శబ్దం ప్రతిధ్వనిస్తోంది. శనివారం నాటికి ఈ యుద్దంలో ముగ్గురు పిల్లలతో సహా 198 మంది పౌరులు మరణించినట్లు నివేదిక వెలువ‌డింది. అయితే ఇప్పటివరకు 1,115 మంది గాయపడ్డారు.

మ‌రో వైపు ఉక్రెయిన్ పై రష్యా దాడుల‌ను ఆ దేశ పౌరులు కూడా వ్య‌తిరేకిస్తున్నారు. యుద్దం వ‌ద్దంటూ నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం నాడు 44 రష్యన్ నగరాల్లో జరిగిన యుద్ధ వ్యతిరేక నిరసనలలో పోలీసులు 900 మందిని అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజుల నుంచి ఈ నిర‌స‌నలు చేసిన వారిని పోలీసులు నిర్బంధింస్తున్నారు. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కు 4,000 మందికి పైగా ర‌ష్యా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే
Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి