ఇక క్యాన్సర్ గురించి భయపడాల్సిన పనిలేదు. రాకుండా వ్యాక్సిన్లు.. వచ్చిన తరువాత ప్రాణాంతకం కాకుండా కోలుకునే చికిత్సలతో ప్రపంచదేశాల ప్రయోగాలు విజయవంతమవుతున్నాయి. క్యాన్సర్ పేషంట్లలో జీవితాశలు రేకెత్తిస్తున్నాయి.
క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ప్రపంచ దేశాలు శుభవార్త చెప్పబోతున్నాయా అంటే అవుననే అంటున్నాయి రష్యా, యూకేలు. క్యాన్సర్ వస్తే ఎన్ని రకాల చికిత్సలు చేసిన మరణం అంచుల్లోకి చేరుకోవడం గ్యారెంటీ. క్యాన్సర్ వచ్చిన తర్వాత జీవితకాలం పొడిగించవచ్చేమో కానీ.. ఇప్పటివరకు దానిని తగ్గించే చికిత్స అందుబాటులో లేదు. అయితే ఇటీవలే రష్యా అధ్యక్షుడు పుతిన్ క్యాన్సర్ కి తాము వ్యాక్సిన్ ని కనుక్కొని పనిలో ఉన్నామని… త్వరలోనే ఈ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని చెప్పుకొచ్చారు. మరోవైపు తాజాగా యూకేలో శాస్త్రవేత్తలు మెసోథెలి యోమా అనే ప్రాణాంతక క్యాన్సర్ కు మందు కనిపెట్టారు.
ఒక్కరోజు తేడాతో వెలుగు చూసిన ఈ రెండు వార్తలు.. క్యాన్సర్ పేషంట్లలో జీవితంపై ఆశలు చిగురించేలా చేస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫిబ్రవరి 14న మాట్లాడుతూ తాము కొత్తతరం కోసం క్యాన్సర్ వ్యాక్సిన్లు, ఇమ్యునో మోడ్యులేటరీ డ్రగ్ తయారు చేస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించి తాము చేస్తున్న పరిశోధనలు దాదాపుగా పూర్తికావచ్చినట్లుగా చెప్పారు. ప్రపంచంలో అనేక రకాల క్యాన్సర్లు ఉన్నాయి.
ఎలుకల బోను రూపంలో బూట్లు ధరించిన మహిళ: సోషల్ మీడియాలో వైరల్
అయితే, పుతిన్ చెప్పిన వ్యాక్సిన్లు ఏ రకమైన క్యాన్సర్ లక్ష్యంగా పనిచేస్తాయనే విషయం మాత్రం స్పష్టత లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తం అనేక దేశాలు, కంపెనీలు క్యాన్సర్ వ్యాక్సిన్ ల మీద పనిచేస్తున్నాయి. నిరుడు యూకే ప్రభుత్వం 2023 నాటికి 10 వేల మంది రోగులకు వ్యక్తిగత క్యాన్సర్ చికిత్సలను అందించే క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించాలని.. జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ కంపెనీతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
మరోవైపు ఫార్మాసూటికల్ కంపెనీలు మోడెర్నా, మెర్క్ అండ్ కో కంపెనీలు ప్రయోగాత్మక క్యాన్సర్ వ్యాక్సిన్ ను అభివృద్ది చేస్తున్నాయి. మూడేళ్ల చికిత్స తర్వాత అత్యంత ప్రాణాంతక చర్మ క్యాన్సర్ నుండి రక్షించవచ్చని మెలనోమా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక గర్భాశయ క్యాన్సర్ తో పాటు అనేక క్యాన్సర్లకు కారణమయ్యే హ్యుమన్ పాపిల్లోమావైరస్ లకు వ్యతిరేకంగా ప్రస్తుతం ఆరు లైసెన్స్ పొందిన వ్యాక్సిన్లు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది. అలాగే కాలేయ క్యాన్సర్ కు దారితీసే హెపటైటిస్ బీ (హెచ్‌బీవీ) నివారణకు కూడ టీకాలున్నాయి.
తాజాగా ఫిబ్రవరి 15న లండన్ లో మెసోథెలియోమాను తగ్గించే అద్భుతమైన ఔషధాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారనే విషయం వెలుగు చూసింది. ఈ మెసోథెలియోమా క్యాన్సర్ ప్రపంచంలోనే అతి భయంకరమైన, చికిత్సకు లొంగని, వేగంగా వ్యాపించే క్యాన్సర్ రకం. దీని చికిత్సలో వీరు కనిపెట్టిన ఔషధం అద్భుతంగా పనిచేస్తోంది. సగటు జీవితకాలాన్ని నాలుగు రెట్లు పెంచేదిగా ఉంది.
వీరు కనిపెట్టిన కొత్తరకం చికిత్స విధానంలో క్యాన్సర్ కారక కణితికి ఆహార సరఫరాను నిలిపివేస్తారు. ఈ శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ కొత్త ఔషధం 20 సంవత్సరాలలో మెసోథెలియోమా క్యాన్సర్ కోసం కనిపెట్టిన మొదటి రకం మందు అని కూడా వారు తెలిపారు. ఈ పరిశోధన ఫలితాలు JAMA ఆంకాలజీ జర్నల్‌లో ప్రచురించబడ్డాయి.
మెసోథెలియోమా అనేది ఒక రకమైన క్యాన్సర్, ఇది ఊపిరితిత్తులలో అభివృద్ధి చెందుతుంది. ప్రధానంగా ఆస్బెస్టాస్ ఉన్న పని ప్రాంతంలో పనిచేసేవారు ఎక్కువగా ఈ క్యాన్సర్ బారిన పడతారు. ఇది వేగంగా విస్తరిస్తుంది. ప్రాణాంతకమైన, ప్రపంచంలోని అతి మొండి, జీవితకాలాన్ని బాగా తగ్గించే క్యాన్సర్ లలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం, యూకేలో ప్రతి సంవత్సరం 2,700 కొత్త మెసోథెలియోమా కేసులు నమోదవుతున్నాయి.
క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ పరిశోధకులు యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, ఇటలీ, తైవాన్ లాంటి ఐదు దేశాలలో అంతర్జాతీయ ట్రయల్ నిర్వహించారు. క్వీన్ మేరీ ప్రొఫెసర్ పీటర్ స్జ్లోసరెక్ నేతృత్వం వహించిన పరిశోధన బృందం.. రోగులందరికీ ప్రతి మూడు వారాలకు ఆరు రౌండ్ల కీమోథెరపీ అందేలా చూశారు. వీరిలో సగం మందికి కొత్త ఔషధం ADI-PEG20 (పెగార్గిమినేస్) ఇంజెక్ట్ చేశారు. మిగిలిన సగం మందికి రెండేళ్లపాటు ప్లేసిబో ఇచ్చారు.
ఈ పరిశోధనలో ప్లూరల్ మెసోథెలియోమా చివరి దశలో ఉన్న 249 మంది రోగులు ఉన్నారు. ATOMIC-meso ట్రయల్ 2017, 2021 సం.ల మధ్య ఐదు దేశాలలో 43 కేంద్రాలలో నిర్వహించబడింది. అధ్యయనంలో పాల్గొన్న రోగులను కనీసం ఒక సంవత్సరం పాటు పరిశీలనలో ఉంచారు. అధ్యయనం ప్రకారం, ప్లేసిబో, కీమోథెరపీ ఇచ్చినవారి 7.7 నెలలతో సగటుతో పోలిస్తే... పెగార్గిమినేస్, కీమోథెరపీ ఇచ్చినవారు సగటున 9.3 నెలలు జీవించారు,
ప్లేసిబో, కెమోథెరపీ చికిత్స అందిన రోగుల 5.6 నెలల జీవితకాలంతో పోలిస్తే... పెగార్గిమినేస్-కెమోథెరపీతో చికిత్స ఇచ్చిన రోగుల్లో వ్యాధి పెరగకపోవడంతో వారి జీవితకాలం 6.2 నెలలు ఉంటుందని పరిశోధకులు తెలిపారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, 20 సంవత్సరాలలో ఈ వ్యాధి కోసం అభివృద్ధి చేయబడిన క్యాన్సర్ జీవక్రియను లక్ష్యంగా చేసుకునే ఔషధంతో.. కీమోథెరపీని కలిపి చేసే చికిత్స ఇందులో మొదటి విజయవంతమైన కలయిక అని తెలిపారు. కొత్త ఔషధం రక్తప్రవాహంలో అర్జినైన్ స్థాయిలను తగ్గించడం ద్వారా పనిచేస్తుంది. ఈ వ్యాధి బారిన పడినవారిలో శరీరం వారి స్వంత అర్జినైన్‌ను తయారు చేయలేని స్థితిలో ఉంటుంది. ఆర్జినైన్ కణితి కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది.