అలాచేస్తే రష్యా అధ్యక్షుడు పుతిన్ చావు ఖాయం... : ఎలాన్ మస్క్ సంచలనం 

By Arun Kumar PFirst Published Feb 14, 2024, 12:36 PM IST
Highlights

రష్యా‌‌-ఉక్రెయిన్ యుద్దంపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అమెరికా ఉక్రెయిన్ కు ఎంత సాయం చేసినా లాభం వుండదని... చివరకు గెలిచేది రష్యానే అని మస్క్ అభిప్రాయపడ్డారు. 

వాషింగ్టన్ : ప్రపంచ కుబేరుడు, స్పెస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ రష్యా-ఉక్రెయిన్ యుద్దంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. బలమైన సైన్యం కలిగిన రష్యా చిన్నదేశమైన ఉక్రెయిన్ చేతిలో ఓడిపోతుందని తాను అనుకోవడం లేదన్నారు. ఒకవేళ రష్యా వెనక్కితగ్గితే ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ అంతమయ్యే అవకాశాలున్నాయన్నారు. కాబట్టి యుద్దాన్ని కొనసాగించడం తప్ప పుతిన్ వద్ద మరో ఆప్షన్ లేదని మస్క్ పేర్కొన్నారు.  

ఉక్రెయిన్ కు భారీగా ఆర్థికసాయం అందించే   బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం తెలిపిన సమయంలోనే మస్క్ ఈ వ్యాఖ్యలు చేసారు. ఉక్రెయిన్ కు 6,000 కోట్ల డాలర్లను అందించేందుకు ప్రవేశపెట్టిన బిల్లుకు ప్రతిపక్ష రిపబ్లికన్ల మద్దతుతో డెమోక్రాట్ ఆమోదించుకోగలిగింది. 

ఇలాంటి సమయంలో ఉక్రెయిన్ కు అమెరికా సాయంచేయడం వృధా అనేలా ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు చేసారు. ఎవరు ఏ సాయం చేసినా ఉక్రెయిన్ గెలిచే పరిస్థితి లేదన్నారు. ఇది జరుగుతుందని అనుకుంటున్నవారు ఊహల్లో తేలుతున్నట్లేనని ఎలాన్ మస్క్ అన్నారు. ఉక్రెయిన్ కూడాగెలుపు ఆశలు వదులుకుంటే మంచిదని మస్క్ సూచించారు. 

గతంలో కూడా ఎలాన్ మస్క్ ఇలాంటి కామెంట్స్ చేసారు. రష్యా దాడుల్లో ఇప్పటికే ఉక్రెయిన్  చాలా నష్టపోయిందని... ఇకనైనా ఆ దేశం వెనక్కి తగ్గితే మంచిదని సూచించారు. సుధీర్ఘ యుద్దం వల్ల ఉక్రెయిన్ కు నష్టమే తప్ప లాభం వుందన్నారు. అమెరికా ఆర్థిక సాయం తాత్కాలిక ఊరట ఇచ్చినా ఉక్రెయిన్ గెలిపించలేదని టెస్లా అధినేత మస్క్ పేర్కొన్నారు. 
 

click me!