అరుదైన ప్లేగు వ్యాధి అమెరికాను కలవరపెడుతోంది. గతంలో కోట్లాదిమంది యూరప్ ప్రజలు ఈ వ్యాధి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి మహమ్మారి మరోసారి బయటపడటం కలవరపెడుతోంది.
అమెరికా : చరిత్రలో మారణహోమం సృష్టించిన అరుదైన ప్లేగు వ్యాధి మళ్లీ బయటపడింది. అమెరికాలో ఓ వ్యక్తి బుబోనిక్ ప్లేగు వ్యాధి బారినపడ్డట్లు డాక్టర్లు నిర్దారించారు. అయితే తొందరగానే అతడిలో వ్యాధిలక్షణాలను గుర్తించడంతో ప్రమాదం తప్పిందని వైద్యాధికారులు తెలిపారు.
అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రంలో ఓ వ్యక్తి తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతూ డాక్టర్లను సంప్రదించారు. అతడికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అరుదైన ప్లేగు వ్యాధి సోకినట్లు గుర్తించారు. వెంటనే అతడికి వైద్యం అందించడంతో పాటు వైద్యాధికారులకు సమాచారం అందించారు. అతడికి సోకిన బుబోనిక్ ప్లేగు అంటువ్యాధి కావడంతో అప్రమత్తమైన అధికారులు ఇటీవల కాలంలో అతడిని కలిసినవారిని, కుటుంబసభ్యులకు కూడా వైద్యపరీక్షలు నిర్వహించారు. అయితే ఎవరికీ ఈ వ్యాధి సోకకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
undefined
అయితే పెంపుడు పిల్లి ద్వారానే ఈ బుబోనిక్ ప్లేగు అతడికి సోకినట్లు గుర్తించారు. వెంటనే ఆ పిల్లిని స్వాధీనం చేసుకుని వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఒకేఒక కేసు నమోదయ్యిందని... అతడు కూడా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ బుబోనిక్ ప్లేగు 14వ శతాబ్దంలో యూరప్ ను శవాలదిబ్బగా మార్చింది. ఈ వ్యాధితో ఏకంగా 5 కోట్ల మంది మరణించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ వ్యాధి సోకినవారికి మొదట చలిజ్వరం, ఒళ్లునొప్పులు... ఆ తర్వాత బ్లడ్ ఇన్ఫెక్షన్... చివరగా ఊపిరితిత్తులు దెబ్బతిని మరణం సంబవిస్తుందని తెలిపారు. వ్యాధి లక్షణాలను గుర్తించి సరైన చికిత్స పొందితే ప్రాణాలతో బయటపడతారని డాక్టర్లు చెబుతున్నారు.