భారత్ తో సంబంధాలు మాకు చాలా కీలకం - కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్

By Asianet News  |  First Published Sep 25, 2023, 12:11 PM IST

భారత్ తమకు చాలా కీలకమైన దేశమని కెనడా రక్షణ శాఖ మంత్రి బిల్ బ్లెయిర్ అన్నారు. ఇరు దేశాలు కలిసి మాట్లాడుకోవాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్ ఇప్పుడు ఎదురైన సమస్య సవాలుతో కూడుకున్నదని చెప్పారు.


ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నెలకొన్నాయి. ఈ పరిస్థితులను చల్లబర్చేందుకు ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ప్రయత్నించారు. మంత్రి బిల్ బ్లెయిర్ ఆదివారం మాట్లాడుతూ.. భారతదేశంతో తమ దేశ సంబంధాలు చాలా ముఖ్యమైనవని అన్నారు. ఇండో-పసిఫిక్ ఇనిషేటివ్ వంటి భాగస్వామ్యాలను తమ దేశం కొనసాగిస్తుందని అన్నారు. 

ట్రూడో లేవనెత్తిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తూ కెనడా ఆ భాగస్వామ్యాలను కొనసాగిస్తుందని బ్లెయిర్ ఆదివారం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇండో-పసిఫిక్ వ్యూహం కెనడాకు కీలకమైనదని, ఇది ఈ ప్రాంతంలో దాని సైనిక ఉనికిని పెంచడానికి, మరింత గస్తీ సామర్థ్యాలకు కట్టుబడి ఉండటానికి దారితీసిందని మంత్రి పేర్కొన్నారు. ‘‘భారతదేశంతో మాకు ఉన్న సంబంధాల వల్ల ఇప్పుడు ఎదురైన సమస్య సవాలుతో కూడుకున్నదని మేము అర్థం చేసుకున్నాం. కానీ అదే సమయంలో చట్టాన్ని, మా పౌరులను రక్షించడం కూడా ముఖ్యమే. అందుకే మేము సమగ్ర దర్యాప్తు చేసి నిజం తెలుసుకునేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది’’ అని బ్లెయిర్ అన్నారని ‘గ్లోబల్ న్యూస్’ పేర్కొంది.

Latest Videos

అయితే ఆరోపణలు నిజమని రుజువైతే కెనడా గడ్డపై కెనడా పౌరుడి హత్యలో తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించినట్టే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘నేను ప్రేమించే రెండు దేశాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టాలని నిజంగా కోరుకుంటున్నాను. మాటలు మొదలైన తరువాత వారు (ఇండియా) తమ పౌరులకు నిజంగా సాయం చేయాలనుకుంటే, స్నేహితులను సంపాదించడానికి ఉమ్మడి స్థలాన్ని కనుగొంటారని అనుకుంటున్నాను’’ అని రక్షణ శాఖ మంత్రి బిల్ బ్లెయిర్ మరో ఇంటర్వ్యూలో చెప్పారు.

కాగా.. జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో కాల్పుల్లో నిజ్జర్ చనిపోయారు. అయితే అతడి హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా పార్లమెంటులో ట్రూడో చేసిన ఆరోపణల తర్వాత భారత్-కెనడా సంబంధాలు అత్యల్ప స్థాయికి చేరుకున్నాయి. దీనిపై స్పందించిన భారత్.. కెనడా ప్రధాని ఆరోపణలు అసంబద్ధమైనవి, ప్రేరేపితమైనవని పేర్కొంది. కెనడా దౌత్యవేత్తను బహిష్కరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రతాపరమైన ముప్పుల దృష్ట్యా కెనడా పౌరులకు వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేసిన భారత్.. న్యూఢిల్లీలోని కెనడా దౌత్యవేత్తలను తిరిగి వెళ్లిపోవాలని కోరింది. 

పెరుగుతున్న భారత వ్యతిరేక కార్యకలాపాల నేపథ్యంలో కెనడాలో ఉన్న మన పౌరులకు మన దేశం పలు సూచనలు చేసింది. అక్కడున్న ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. గత కొన్నేళ్లుగా భారత్, కెనడా ద్వైపాక్షిక వాణిజ్యంలో వృద్ధి చెందుతుండటంతో ఇరు దేశాల మధ్య దౌత్య ప్రతిష్టంభన వాణిజ్య సంబంధాలపై అనిశ్చితిని పెంచింది. కెనడా-భారత్ ఒకదానికొకటి ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములుగా ఉన్నాయి.  2022 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 8.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రపంచంలో భారత్ అసాధారణమైన ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థ అని స్వయంగా ట్రూడో జీ20 సదస్సు సందర్భంగా అంగీకరించారు. ఈ రాజకీయ విభేదాలు బలమైన భారత్-కెనడా వాణిజ్యంపై ప్రభావం చూపుతాయనే ఆందోళనల నెలకొంది. 

click me!