ట్రంప్‌కు ఇంటిపోరు.. అమెరికన్లే ఎదురు తిరుగుతున్నారు!

First Published Jul 1, 2018, 12:47 PM IST
Highlights

ట్రంప్‌కు ఇంటిపోరు.. అమెరికన్లే ఎదురు తిరుగుతున్నారు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇంటిపోరు మొదలైంది. తమ దేశంలోని ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో బై అమెరికన్ హైర్ అమెరికన్ (అమెరికా వస్తువులనే కొనండి, అమెరికన్లకే ఉద్యోగాలివ్వండి), మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (అమెరికాను మరోసారి గొప్పగా తీర్చిదిద్దండి) అంటూ పలు నినాదాలు, విధానాలతో అమెరికన్లను ఆకర్షించి అధ్యక్ష పదవి చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌కు ఇప్పుడు అదే అమెరికన్లు వ్యతిరేకంగా మారుతున్నారు. తాజా సర్వేలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

అక్రమ వలసలపై, వలసదారులపై ట్రంప్‌ అనుసరిస్తున్న కఠిన వైఖరిని స్వంత దేశంలోని అమెరికన్లే తీవ్రంగా నిరసిస్తున్నారు. వివిధ పౌర హక్కుల సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు ఈ విషయంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాదాపు 50 రాష్ట్రాల్లో ఈ తరహా నిరసనలు జరుగుతున్నాయి. ఇటీవలే వాషింగ్టన్‌ డీసీలో కూడా భారీ ఎత్తున ర్యాలీ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు 500 మందికి పైగా నిరసనకారులను అరెస్ట్ చేశారు.

అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌, ది లీడర్‌షిప్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ సివిల్‌ రైట్స్‌, నేషనల్‌ డొమెస్టిక్‌ వర్కర్స్‌ అలయన్స్‌ వంటి గ్రూపులు ఈ తరహా నిరసన కార్యక్రమాలను ముందుండి నిర్వహిస్తున్నాయి. అయితే, ఈ నిరసనలను కేవలం శాంతియుతంగా చేపట్టాలని, అందరూ తెల్లదుస్తుల్లో రావాలని వెబ్‌సైట్‌ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాయి. సినీ నటులు జూలియాన్నే మూర్‌, అమెరికా ఫెర్రారా, నటాలియా పోర్ట్‌మ్యాన్‌, లిన్‌ మాన్యుయెల్‌ మిరాండాలతో పాటుగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ నిరసనలకు మద్దతు ప్రకటిస్తున్నారు.

ప్రత్యేకించి 'ఫ్యామిలీస్‌ బిలాంగ్స్‌టుగెదర్‌' (కుటుంబాలు కలిసే ఉండాలి) అన్న నినాదంతో లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఈ శని, ఆదివారాల్లో కూడా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు ప్లాన్ చేశారు. సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన డిటెన్షన్ సెంటర్లను వెంటనే ఎత్తివేసి, నిర్భందించిన వారిని తక్షణమే వారి కుటుంబ సభ్యులతో కలపాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు.

అక్రమ వలసదారులను నిర్భందించి, కుటుంబాలను వేరు చేస్తున్న ట్రంప్ సర్కారుపై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో, ఈ విషయంపై ట్రంప్ కాస్తంత వెనక్కు తగ్గి ఫ్యామిలీ సెపరేషన్‌ను ఆపివేస్తున్నట్లు ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసిన సంగతి తెలిసినదే.

అయితే, ఈ తాజా ఆర్డర్ ఇదివరకే నిర్భందించిన వారికి వర్తించేలా లేదు, కొత్తగా నిర్భంచబడే వారికి మాత్రమే వర్తించేలా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ట్రంప్‌ జారీ చేసిన ఆదేశాలు సమస్యను పూర్తిగా పరిష్కరించలేదని అమెరికాలోని పౌరహక్కుల నేతలు, రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

click me!