
న్యూఢిల్లీ: రష్యా ప్రభుత్వం తొలిసారి ఉక్రెయిన్ దాడి చేసిందని ప్రకటించింది. పశ్చిమ రష్యాలోని తమ చమురు డిపోపై ఉక్రెయిన్ వైమానిక దాడులు చేపట్టిందని వివరించింది. రెండు హెలికాప్టర్లు తమ భూభాగంలోని ఫ్యూయెల్ స్టోరేజీ డిపోను పేల్చేశాయని తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల ప్రారంభించిన 37వ రోజుల తర్వాత ఇలాంటి ప్రకటన రావడం గమనార్హం. బెల్గరోడ్ పట్టణంలో ఈ దాడి జరిగినట్టు బెల్గరోడ్ రీజియన్ గవర్నర్ వ్యాచెస్లవ్ గ్లాడ్కోవ్ మెస్సేజింగ్ యాప్ టెలిగ్రామ్‌లో రాసుకొచ్చారు. ఈ ఘటనలో ఇద్దరు ఉద్యోగులు మరణించారని తెలిపారు.
బెల్గరోడ్ ఉక్రెయిన్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో.. ఉక్రెయిన్‌లోని కీలక పట్టణం ఖార్కివ్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నగరంపై రెండు ఉక్రెయిన్ ఆర్మీ హెలికాప్టర్లు అత్యల్ప ఎత్తులో వచ్చి బాంబులు వేశాయని గవర్నర్ గ్లాడ్కోవ్ తెలిపారు. ఈ వైమానిక దాడిలో పెట్రోల్ డిపో మొత్తం తగలబడింది. భారీ మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో ఇద్దరు ఉద్యోగులు అదే ఫెసిలిటీలో ఉన్నారని, వారికి గాయాలయ్యాయని వివరించారు. ఇక్కడ మంటలు ఆర్పడానికి 170 మంది అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారని తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం, ఈ రోజు ఉదయం 6 గంటలకు ఈ మంటలు ప్రారంభం అయ్యాయని పేర్కొన్నారు. పెద్ద మొత్తంలో అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఆ భవనం చుట్టూ దట్టమైన పొగ కమ్ముకుందని అన్నారు. ఈ డిపో రష్యా దిగ్గజ ఇంధన సంస్థ రోస్నెఫ్ట్‌కు చెందినది. ఈ రోస్నెఫ్ట్ సంస్థ వెంటనే అక్కడి నుంచి సిబ్బందిని తరలించింది.
దానికి సమీపంలోనే ఓ ఫ్యూయెల్ ఫిల్లింగ్ స్టేషన్‌లో కార్లు సుదీర్ఘ క్యూలో నిలబడి ఉన్నాయని గవర్నర్ అన్నారు. ఈ పేలుడు గురించి పౌరులు భయాందోళనలకు గురి కావద్దని పేర్కొన్నారు. అందరికీ సరిపడా పెట్రోల్ ఉన్నదని తెలిపారు. ఈ రీజియన్‌లో చమురు కొరత ఏమీ లేదని, అలాంటి కొరత ఉంటుందన్న ఆందోళనలూ వద్ద అని అన్నారు.
గతవారం కూడా బెల్గరోడ్‌లోని ఆయుధ డిపోలో నుంచీ కూడా భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. కానీ, దానిపై అధికారులు ఎలాంటి వివరణలు ఇవ్వలేదు. ఆ పేలుడుకు గల కారణాలనూ స్పష్టంగా వెల్లడించలేదు.
కాగా, మరో చోట రష్యా రక్షణ మంత్రి ఉక్రెయిన్‌పై స్పందిస్తూ.. మాస్కో ఇప్పటి వరకు ఉక్రెయిన్‌లోని ఆరు మిలిటరీ ఫెసిలిటీలను ధ్వంసం చేసిందని వివరించారు. అందులో పేలుడు పదార్థాలు, రాకెట్లు, భారీ ఆయుధ సంపత్తి ఉన్న ఐదు డిపోలూ ఉన్నాయని తెలిపారు.
భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఈ రోజు రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్‌తో సమావేశం అయ్యారు. ఒక వైపు భారత్‌కు రష్యా చౌకగా చమురును అందిస్తామని ఆఫర్ ఇస్తుండగా, మరోవైపు తాము రష్యాపై విధించిన ఆంక్షలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తే తర్వాతి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న అమెరికా హెచ్చిరకల నేపథ్యంలో వీరిద్దరి సమావేశం జరిగింది. ఇదే సందర్భంలో విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్ మాట్లాడుతూ, తాను భారత ప్రధాని నరేంద్ర మోడీతో పర్సనల్‌గా కలిసి ఓ మెస్సేజీని డెలివర్ చేయాలనుకుంటున్నట్టు తెలిపారు.