
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్లు తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నాక తాజాగా అక్కడ ప్రభుత్వ ఏర్పాట్లపై కసరత్తులు జరుపుతున్నారు. కాబూల్‌ను ఆక్రమించుకున్నాక ఏర్పాటు చేసిన తొలి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వారు మహిళా హక్కుల గురించి ప్రస్తావించారు. ముస్లిం మత చట్టాల ప్రకారం, వారి స్వేచ్ఛను అమలు చేస్తామని చెప్పారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు తాలిబాన్ల అగ్రనేతలు చెబుతున్నదానికి వ్యతిరేకంగా ఉన్నది. మహిళలను బయట ఒకచోట పనిచేయకుండా ఇప్పటికే ఆంక్షలు విధిస్తున్నట్టు తెలిసింది. కో ఎడ్యుకేషన్‌ను రద్దు చేస్తూ ఫత్వా జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఆఫ్ఘనిస్తాన్‌లో ఇన్నాళ్లు అభ్యుదయ భావాలను ప్రచారం చేసినవారు, లేదా ఆ భావాలకు ఐకాన్‌గా నిలిచినవారు లేదా ఛాందసవాదాలను తుత్తునియాలు చేసినవారికి ప్రాణ సంకటం పొంచి ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్ టాప్ పాప్ స్టార్ అర్యానా సయీద్ దేశాన్ని వదిలిపెట్టారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ధ్రువీకరించారు.
తాను ఇప్పుడు బాగే ఉన్నారని, ఇంకా ప్రాణాలతోనే ఉన్నట్టు పాప్ సింగర్ అర్యానా సయీద్ వివరించారు. పీడకలగా గడిచిన రెండు రోజుల రాత్రి తర్వాత తాను దోహా, ఖతర్ చేరుకున్నట్టు వెల్లడించారు. యూఎస్ కార్గో విమానంలో తాను దోహాకు వెళ్లినట్టు వివరించారు. ఇస్తాంబుల్ వెళ్లడానికి విమానం కోసం వెయిట్ చేస్తున్నట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు.
అర్యానా సయీద్ స్టేడియంలో పాటపాడి మూడు జాఢ్యాలను బద్దలు కొట్టిందని ఆమె అభిమాని ఒకరు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 1. ఒక మహిళగా పాడటం, 2. హిజబ్ ధరించకపోవడం, 3. స్టేడియంలోకి మహిళగా ప్రేవశించడం అని ఆయన ఏకరువు పెట్టారు. ఇప్పుడు ఈ స్వేచ్ఛ తాలిబాన్ల పాలనలో నిషేధానికి గురైందని వివరించారు. ఆమె చేసిన కార్యాలు ఇప్పుడు ఒక కలగా మారాయని పేర్కొన్నారు.
దోహా నుంచి అర్యానా సయీద్ టర్కీకి వెళ్లారు. అక్కడే తన భర్త, ప్రముఖ ఆఫ్ఘనిస్తాన్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ హసీబ్ సయిద్‌తో కలిసి జీవించనున్నారు. ‘ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నా మనసు, భావోద్వేగాలు సాధారణ స్థితికి వచ్చాయి. అపనమ్మకం, దిగ్భ్రాంతికర సన్నివేశాల నుంచి కోలుకుంటున్నా. మీతో పంచుకోవడానికి నా దగ్గర చాలా కథలున్నాయి’ అని సోషల్ మీడియాలో ఉద్వేగభరిత పోస్టు పెట్టారు.
ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటపడాలని బిక్కుబిక్కుమంటూ క్షణాలను గడుపుతున్న మహిళా కార్యకర్తలెందరో ఉన్నారు. ముఖ్యంగా హజారా జిల్లా సలీమా మజారీ. ఆమె ఉగ్రవాదులను బహిరంగంగా తీవ్రంగా విమర్శించారు. బుధవారం ఆమెను అరెస్టు చేసినట్టు తెలిసింది. బహుశా ఆమెను ఇప్పటికే చంపేసి ఉంటారన్న ఆందోళనలు వెలువడ్డాయి.
ఇదిలా ఉండగా, భావి తాలిబాన్ ప్రభుత్వంలో తమ హక్కులు కొనసాగాలనే డిమాండ్‌తో మహిళలు నిరసనలు చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాట్లకు సమాయత్తమవుతున్నట్టు తాలిబాన్లు ప్రకటించిన తరుణంలో మహిళలు ఈ ఆందోళనలు చేయడం గమనార్హం.