
సోషల్ మీడియా వేదిక ఎక్స్ (గతంలో ట్విట్టర్)పై భారీ సైబర్ దాడి జరిగిందని దాని యజమాని ఎలాన్ మస్క్ ఆరోపించారు. ఈ దాడి చేయడానికి చాలా వనరులు ఉపయోగించారని, దీన్ని ఏదైనా పెద్ద సమూహం లేదా దేశమే చేసి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ దాడి గురించి యూజర్లకు తెలియజేస్తూ మస్క్ ఎక్స్ లో ఇలా పోస్ట్ చేశారు, "ఎక్స్ పై భారీ సైబర్ దాడి జరిగింది (ఇంకా జరుగుతూనే ఉంది). మాకు ప్రతిరోజు దాడులు జరుగుతూనే ఉంటాయి, కానీ ఈ దాడి చేయడానికి చాలా వనరులు వాడారు. దీంట్లో ఏదైనా పెద్ద సమూహం లేదా దేశం పాల్గొని ఉండొచ్చు. కనిపెడుతున్నాం..." అని అన్నారు.
ఈ సైబర్ దాడి వల్ల ప్లాట్‌ఫామ్ అంతటా అంతరాయం ఏర్పడింది, వేల మంది యూజర్లు తమ ఖాతాల్లోకి లాగిన్ అవ్వలేకపోయారు. డౌన్‌డిటెక్టర్ ప్రకారం, అంతరాయాల రిపోర్టులు 26,579కి పెరిగాయి, ఆ తర్వాత కాస్త తగ్గాయి. అంతకుముందు రోజు, అమెరికాలో మాత్రమే 40,000 మంది యూజర్లు దీని వల్ల ఇబ్బంది పడ్డారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లో కూడా యూజర్లు ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, అక్కడ 10,800కు పైగా అంతరాయాల రిపోర్టులు వచ్చాయి. అయితే, ఈ అంతరాయాలకు అసలు కారణం మాత్రం ఇంకా తెలియలేదు.