
దుబాయ్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయోద్ అల్ నహ్యాన్ తో శనివారంనాడు భేటీ అయ్యారు.
ధ్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులకు ఊతమిచ్చేలా మోడీ పర్యటన సాగుతుంది. స్థానిక కరెన్సీలో వాణిజ్య పరిష్కారాన్ని ప్రారంభించేందుకు భారతదేశం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను అంగీకరించినట్టుగా రెండు దేశాలు ప్రకటించాయి. ప్రస్తుతం 85 బిలియన్ డాలర్లుగా ఉన్నందున త్వరలో 100 బిలియన్ డాలర్ల మార్కును దాటుతుందని తాను ఆశిస్తున్నట్టుగా ప్రధాని మోడీ తెలిపారు.
ఇండియా-యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం క్రమంగా బలపడుతుంది. ఇంధనం, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రత, ఫిన్ టెక్, రక్షణ, సంస్కృతి వంటి రంగాలలో ముందుకు తీసుకెళ్లేందుకు మోడీ టూర్ దోహాదం చేసే అవకాశం ఉందని విదేశీ మంత్రిత్వశాఖ తెలిపింది. ఫ్రాన్స్ పర్యటనను ముగించుకొని యూఏఈకి మోడీ వెళ్లారు. ఈ నెల 15వ తేదీన మోడీ యూఏఈకి చేరుకున్నారు.
యూఏఈలో నేషనల్ ఆయిల్ కంపెనీ గ్రూప్ సీఈఓ డాక్టర్ సుల్తాన్ అల్ జాబర్ తో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. శనివారం నాడు ప్రధాని మోడీ అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాహెద్ ఆల్ నహ్యాన్ తో భేటీ అయ్యారు. ప్రధాని మోడీ పర్యటనను పురస్కరించుకొని బుర్జ్ ఖలీఫా లో భారత జాతీయ జెండా రంగులలో వెలిగించారు.
ఇండియా, యూఏఈ ప్రపంచ మేలు కోసం సన్నిహితంగా పనిచేస్తూనే ఉంటాయని రెండు దేశాలు ప్రకటించాయి.